20, డిసెంబర్ 2020, ఆదివారం

ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయ్యాలని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకోవాలని మాజీ కేంద్ర సమాచార కమీషనర్‌ శ్రీ మాడబూషి శ్రీధర్‌ గారు పిలుపునిచ్చారు.

ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయ్యాలని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకోవాలని మాజీ కేంద్ర సమాచార కమీషనర్‌ శ్రీ మాడబూషి శ్రీధర్‌ గారు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ సంఘీవ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు (20.12.20) ప్రారంభించబడింది. ప్రారంభోత్సవంలో డాక్టర్‌ ప్రసాదరావు గారు లోగోను, శ్రీ మాడభూషి శ్రీధర్‌ గారు పోస్టర్‌ను, డా|| మోహన్‌ రెడ్డి గారు ప్రచార స్టిక్కర్‌ను, శ్రీ జి. కిరణ్‌రెడ్డి గారు డోనర్‌ దరఖాస్తు ఫారమ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డా|| జయసూర్య, బిఎన్‌ సుదర్శన్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు టిఎన్‌వి రమణ, వీరయ్య, ఎం.శ్రీనివాస్‌రావు, నాగేశ్వర్‌రావు, పి.శ్రీనివాస్‌రావు, నాగేష్‌, శ్రీవల్లి, రాజమౌళి, సంగీత, హస్మిత, ఆమీన్‌ తదితరులు పాల్గొన్నారు.

27, ఆగస్టు 2020, గురువారం

ఉదయం 8లోపు ఈ ఆరు పనులు చేయండి...

మీలోని మిమ్మ‌ల్ని నిద్ర‌లేపడానికి ఉదయం 8లోపు ఈ ఆరు పనులు చేయండి......... ఉద‌యం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!
హాల్ ఎలోర్డ్ అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన .... “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డ ఈ ర‌చ‌యిత ఇప్పుడు త‌న ర‌చ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆలోచింప‌జేస్తున్నాడు. ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S
1. S-Silence( నిశ్శ‌బ్దం) ....మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది . 2. A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం) …. అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పాయింట్స్ ప్ర‌తి రోజు మీతో మీరు మాట్లాడుకోండి. 1) నేనేమి కావాల‌నుకుంటున్నా.?? 2) దాని కోసం నేను ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌?? 3) అనుకున్న‌ది సాధించ‌డం కోసం నేను వేటిని వ‌దిలివెయ్యాలి? వేటిని కొత్త‌గా ఆహ్వానించాలి? ఇలా ప్ర‌తి రోజూ మ‌న‌లో మ‌నం మాట్లాడుకుంటూ….మ‌న‌లోని మార్పును మ‌న‌మే లెక్కించాల‌న్న మాట‌.! 3. V-Visualization ( ఆత్మ సాక్షాత్త్కారం) … మ‌నలోని భావాలకు మ‌న‌స్సులో దృశ్య‌రూపం ఇవ్వ‌డం. కాన్సియ‌స్ తో క‌ల‌లు క‌న‌డం అన్నమాట‌! ఉద‌యాన్నే మ‌న ల‌క్ష్యం అలా క‌ళ్ళ ముందు క‌న‌బ‌డితే…దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌య‌త్నం చేస్తాం. 4. E-Exercise ( వ్యాయామం) – ఇది ప్ర‌తి ఒక్క‌రికి తెల్సిన విష‌య‌మే… కండ‌రాలు, న‌రాలు ఉత్తేజిత‌మై…కొత్త శ‌క్తిని ప్రేరేపిస్తుంది. 5. R-Reading (పుస్తక పఠనం) – రోజుకు 10 పేజీలు చ‌ద‌వడాన్ని అల‌వాటు చేసుకోవాలి..ఇది మ‌నలోని అంత‌ర్గ‌త శ‌క్తిని ప్రేరేపిస్తుంది. ఫ‌లానా బుక్ చ‌ద‌వాల‌ని లేదు..మీకు తోచిన బుక్ ను చ‌దువుతూ పోండి. 6. S-Scribing ( రాయ‌డం) - ఉద‌యం లేవ‌గానే…మీకు తోచిన లైన్స్ రాయండి… వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు. ఇలా మీరు రోజూ రాస్తూ పోతే…మీ ఆటిట్యూడ్ లో మీకే తెలియ‌ని పాజిటివ్ వేవ్స్ వ‌స్తాయ్. సో…. ఈ ప‌నుల‌న్నీ ఉద‌యం 8 లోపే చేయాలి. ఆల్ ది బెస్ట్…మీలోని మిమ్మ‌ల్ని నిద్ర‌లేపండి

25, ఆగస్టు 2020, మంగళవారం

నిశ్శబ్దంగా నిష్క్రమించిన నాన్న...

నిశ్శబ్దంగా నిష్క్రమించిన నాన్న - Venkat Kolagari
80 సంవత్సరాలకు పైబడిన జీవితం. ఎవరి మీద పిర్యాదులు లేవు. ఆందోళనలు లేని నిశ్శబ్ద జీవితం. బుదవారం వేకువన, ప్రశాంతమైన నాన్న నిద్రను ఆఖరి నిద్రను చేసి, కాలం నిర్ధాక్షిణ్యంగా తన దారిన తాను వెళ్లిపోయింది. శ్రమలో నిండిన తన జీవితం బ్రహ్మ తన నుదుటిన రాసిన రాత ఫలితం అన్న ప్రగాఢ నమ్మకం, బండ చాకిరి నుండి బయటపడి, తన జీవితాన్ని వికసింపచేసుకోవడానికి చేసే ప్రయత్నాలను అన్నింటిని కాలరాసి, తలఎత్తక కలవారికి దాస్యం చేయడం తప్ప మరో మెరుగైన జీవితం తనకు లేకుండా చేసింది. కల్మషంలేని, ఒకరికి చెడు తలపెట్టాలన్న తలంపు లేని, ఇతరుల గురించి చెడు ప్రచారం చేయాలన్న ఆలోచన లేని, కోపం ఎరుగని, ప్రేమగా మనసార తోటివారిని పిలిచే మంచి మనిషి తాను. అందుకేనేమో, తన మోహంలో చెదరని ప్రశాంతత వెల్లివిరుస్తుండేది. స్వాతంత్రానికి సుమారు ఏడు సంవత్సరాల క్రితం, మారుమూల గ్రామం, కృష్ణ , తుంగభద్రల కూడలైన కూడవెళ్లిలో జన్మించాడు మా నాన్న తెలుగు రాముడు. గ్రామంలోని భూములన్నీ ఆధిపత్య కులాలయిన రెడ్లు మరియు బ్రహ్మణ కులస్థుల చేతిలో ఉండేవి. గ్రామానికి రెండువైపుల విస్తరించిన రెండు నదులు, గ్రామాన్ని బయటి ప్రపంచానికి దూరంచేసి, గ్రామ భూముల్ని అత్యంత సారవంతంగా మార్చాయి. గ్రామాన్ని మాత్రం మారుమూలకు పరిమితం చేశాయి. మారుమూల గ్రామం, రాజ్యాంగం ఆధునిక విలువలయిన స్వేచ్చా, సమానత్వాన్ని, ఆత్మగౌరంగా బ్రతికే పరిస్థితుల్ని దళిత, బహుజనులకు పూర్తిగా దూరంచేసి, ఆధిపత్య కులాల ప్రజలకు సేవచేస్తూ, వారిముందు తలవంచుకొని బ్రతికే దుర్భర పరిస్థితిని కల్పించింది. గ్రామాలు ఆజ్ఞానం, ఆచారాలతో కుళ్లికంపు కొడుతూ, వివక్షతలు, అణచివేతలు, వెట్టిచాకిరి లకు నెలవై దళిత బహుజన కులాల ప్రజల జీవితాల్ని దుర్భరంగా మార్చే మురికికూపాలు అన్న అంబేద్కర్ మాటలకు అచ్చమైన నమూనాగా ఉండిందీ ఈ గ్రామం. తాను పాఠశాల విద్య ఎరుగడు. ఆర్థిక స్థోమతలేక, చదువు అవసరం పట్ల స్పృహలేక, చదువుకునే సౌకర్యాలు సైతం లేని మారుమూల గ్రామంలో, ఆనాటి కాలాన, వెనుక ఉంచబడిన కులం అయిన బెస్త కులంలో జన్మించిన తనకు జీవితం వికసించడానికి అవకాశం ఇవ్వలేదు. గాసం పేరున వెట్టిచాకిరికి బంధీని చేసింది. రెడ్ల ఇండ్లలో గాసం చేయడం ప్రధాన జీవితం, జీవనోపాధిని కలిగిన తన తండ్రులు, చిన్నప్పుడే తనను రెడ్ల ఇండ్లలో గాసానికి ఉంచారు. అర్థ శతాబ్దం పైగా గాసమనే దుర్మార్గపు కోరలకు బంధీ అయి, తన చెమట, నెత్తురును ధార పోసి, నమ్మకంగా పనిచేశాడు. తనకు డబ్బులు ఖర్చుచేసే ఎలాంటి దురలవాట్లు లేవు. డబ్బు విషయం పట్ల బహు పొదుపరి. వ్యవసాయం చేయడం నుండి వంట చేయడం దాక తనకు ఎన్నోరకాల పనులు నైపుణ్యంతో చేయడం వచ్చు. నిరంతరం శ్రమించడం తప్ప మరో జీవితం ఎరుగడు. అయినప్పటికి తాను సంపదను సృష్టించుకోలేక పోయాడు. శ్రమించే వారి వద్దకు సంపద చేరుతుందన్నది నిజం కాదని, వారి శ్రమను వెట్టి చాకిరి పేర దొచుకొని సంపన్నులే తమ సంపదను మరింత పెంచుకుంటారన్నది మెజారిటీ పేదల విషయంలో అక్షరాల నిజమని నిరూపించిన కోట్లాది ఉదాహరణల్లో తన జీవితం కూడా కలిపి కాలగర్భంలోకి వెళ్లిపోయాడు. రైతు కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన తన జీవిత సహచరి, వెట్టిచాకిరి విషపు కోరల నుండి బయటపడి, స్వతంత్రంగా, ఆత్మగౌరంగా బ్రతికే అవకాశాల్ని చూడమని చెప్పిన సలహాలు, కలవారికి చాకిరిచేయడమే తనజీవిత ధర్మం, జీవనోపాధిగా మతం, దైవం పేర ప్రగాఢంగా నమ్మిన తన చెవికి చేరలేకపోయాయి. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం, శ్రీశైలం నీటిమునకలో పూర్తిగా మునిగి, చరిత్ర చిత్ర పటం నుండి కనుమరుగయిపోయిన కూడవెళ్లి, గ్రామ ప్రజల జీవితాల్ని చెల్లాచెదరు చేసింది. ఆస్థులున్న వారికి కొంత అధిక నష్ట పరిహారం వచ్చింది, ఆస్థులు, సామాజిక బంధాల బలంతో కలవారు మెరుగైన అవకాశాలను వెతుకున్నారు. ఆస్థులు లేనివారు గాసం, ప్రకృతి వనరుల పై ఆధారపడి బ్రతికే మెజారిటి పేదలు, బ్రతుకుతెరువు వెతుక్కుంటు, స్నేహితులు, బంధువులు ఉన్న గ్రామాలకు విసిరివేయబడ్డారు. అలా తాను 10 సంవత్సరాల కాలంలో 3 ప్రాంతాలు మారాడు. చివరికి తాను ఏ రెడ్ల చెంత అయితే గాసం చేశాడో, అదే రెడ్లకు సరికొత్త రూపంలో సేవ చేసేందుకు అలంపూర్ లో చివరికి స్థిరపడ్డాడు. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, ఈ దాస్యపు భూతపు కోరలనుండి తాను పూర్తిగా బయటపడలేక పోయాడు.
మనిషి అనుమతిలేకుండానే మొదులయ్యే జీవితం, ఆరంభంలో ఆమనిషి కన్నవారికి, ఆప్తులకు ఆనందాన్నిస్తుంది. అంతిమంలో ఆమనిషి అనుమతి అక్కరలేకుండా తనదారిన పోతూ, ఆప్తులకు అందమైన జ్ఞాపకాలతోపాటు తీరని విషాదాన్ని, నేర్చుకోవడానికి తగిన పాఠాల్ని మిగిల్చిపోతుంది. తన అంతిమ ప్రయాణాన్ని ముందే ఊహించి, తనను కాపాడుకునే అవకాశాలను అన్నింటిని ఉపయోగించుకోలేని పిల్లల అసమర్థతపై, నాణ్యమైన వైద్యం అందరికి ఉచితంగా తక్షణం అందించడంలో వ్యవస్థ వైఫల్యాల పై ప్రశ్నలు మిగిల్చి వెళ్లిపోయారు.

23, ఆగస్టు 2020, ఆదివారం

యూట్యూబ్, ఫేస్‌బుక్ మెషీన్ లెర్నింగ్‌తో మిమ్మల్ని ఇలా హైజాక్ చేస్తున్నాయి..!

యూట్యూబ్, ఫేస్‌బుక్ మెషీన్ లెర్నింగ్‌తో మిమ్మల్ని ఇలా హైజాక్ చేస్తున్నాయి..! -------------------- యూట్యూబ్‌లో నీకు ఎలాంటి వీడియోలు చూపించాలో నీకన్నా యూట్యూబ్‌కే బాగా తెలుసు.. స్మార్ట్ టీవీ ఆన్ చేస్తే ఎలాంటి వీడియో కంటెంట్ చూపించాలి అన్నది అదే నిర్ణయిస్తుంది.. అంతెందుకు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నీకు వేలాదిమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎవరెవరి పోస్టులు మాత్రమే చూపించాలి అన్నది ఫేస్బుక్కే నిర్ణయిస్తుంది. ఆల్గారిధమ్స్.. ఇది సాంకేతిక పదం కాదు.. ఇప్పుడు మన జీవితాలను మనవి కాకుండా చేస్తున్న అతి పెద్ద ప్రమాదం! మన జీవితం, మన ఆలోచనలు మన చేతిలో నుండి టెక్నాలజీ చేతిలోకి వెళ్లిపోతున్న ప్రమాదకర పరిణామం. నాకు నచ్చిన కంటెంట్ ఇది భలే చూపిస్తోందే అని చాలామంది సంబరపడిపోతూ ఉంటారు. టెక్నాలజీని తెగ మెచ్చేసుకుంటారు. కానీ తమ ఆలోచనలు, వ్యక్తిత్వం మొత్తాన్ని మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ సమూలంగా మార్చేస్తున్నాయని.. తాము చూసే సెన్సేషనల్ కంటెంట్ మాత్రమే ఇక జీవితాంతం చూపించబడి జీవితం సమాధి అయిపోతోందని అర్థం చేసుకునే పరిపక్వత అతి కొద్దిమందికే ఉంటుంది. ప్రొఫైలింగ్ యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి దాదాపు అన్ని టెక్నాలజీ కంపెనీలు చాలా కాలంగా మెషీన్ లెర్నింగ్ పద్ధతులు అనుసరిస్తున్నాయి. సంబంధిత సర్వీసుల్లో మీరు ఎకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఆలస్యం.. అవి ఎప్పటికప్పుడు నిశితంగా మీరు ఎలాంటి వీడియోలు, పోస్టులు ఎంత సమయం చూస్తున్నారు, ఏ వీడియోలు, పోస్టుల దగ్గర ఆగకుండా ముందుకు కదులుతున్నారు వంటి సమాచారం మొత్తాన్ని "హీట్ మ్యాప్స్" అనే ఏర్పాటు ద్వారా మీకు తెలియకుండానే విశ్లేషిస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మెషీన్ లెర్నింగ్ నిరంతరం మీ ఇష్టాఇష్టాలను గమనిస్తూ మీ గురించి నేర్చుకుంటూ ఉంటుంది. ఇకమీదట సరిగ్గా మీకు నచ్చే కంటెంట్ యూట్యూబ్ రికమండేషన్స్ రూపంలో, ఫేస్‌బుక్ న్యూస్‌ఫీడ్‌లో అదే విధమైన కంటెంట్ మాత్రమే మీకు చూపించబడుతుంది. తప్పేంటి అనుకుంటున్నారా? "నాకు నచ్చిన కంటెంట్ అది చూపిస్తోంది కదా, నా పని మరింత సులువు చేస్తోంది కదా, దాంట్లో తప్పేముంది" అని కొంతమంది భావిస్తూ ఉంటారు. నిజమే మనకు ఎలాంటి కంటెంట్ కావాలో మనం కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన పనిలేకుండా స్క్రీన్ మీద ఏదో ఒక కంటెంట్, అది గతంలో మనం ఇష్టపడిన తరహాది కన్పించడం మనకు చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే, మన బ్రెయిన్‌ని ఇబ్బంది పెట్టడం మనకు ఇష్టం ఉండదు. "నాకు నువ్వు కంటెంట్ వద్దు, వేరే నాకు నచ్చినది నేను వెతుక్కుంటాను" అనే తెగింపు అతి కొద్దిమందిలోనే ఉంటుంది. మిగతా వాళ్లంతా ఒక వీడియో తర్వాత మరొకటి యూట్యూబ్ చూపించిన వీడియోలన్నీ చూసేస్తూ చాలా నేర్చుకున్నాం అన్న భ్రమలో బ్రతికేస్తుంటారు. వ్యక్తిత్వం మారిపోతుంది! సహజంగా సంచలన విషయాల జోలికి వెళ్లకుండా జీవితం పట్ల స్పష్టమైన ఆలోచనలు ఉండి, ప్రొడక్టివ్‌గా బ్రతికే ఆలోచనలు కలిగిన వ్యక్తులు మీరు అనుకుందాం. పొరబాటున చైనాకి, ఇండియాకి మధ్య దశాబ్దాలుగా ఏం జరుగుతోంది అన్న వీడియో మీది యూట్యూబ్‌లో వెదికారు అనుకోండి. అది అనేక వీడియోలు చూపిస్తుంది. మీరు రెండు మూడు వీడియోలు చూస్తారు. అంతటితో ఆ విషయం మీరు మర్చిపోతారు. కానీ యూట్యూబ్ దాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటుంది. ఇక యూట్యూబ్లోకి మీరు ఎప్పుడు వెళ్ళినా ఇండియా, చైనా గురించి విభిన్నమైన వీడియోలు మీ దృష్టికి రికమండేషన్స్ రూపంలో చూపిస్తుంది. గతంలో ఆ సమాచారాన్ని మీరు ఇష్టపడ్డారు కాబట్టి, సహజంగానే మీ మెదడులో దానికి సంబంధించిన ఒక న్యూరల్ నెట్వర్క్ సృష్టించబడి ఉంటుంది కాబట్టి, ఇలా చూపించబడే కొత్త వీడియోలను కూడా మీరు రెండో ఆలోచన లేకుండా చూస్తారు. అంటే ఇక్కడ మీకు తెలియకుండానే మీ ప్రొడక్టివ్ టైం మొత్తాన్ని పక్కన పెట్టి చైనా, ఇండియా అనే అంశం దగ్గర ఇరుక్కుపోయారు. మీరు ఆశావహ దృక్పథం ఉన్న వ్యక్తి అనుకోండి.. గాసిప్స్ చూడడం ఇష్టం లేదు అనుకోండి. పొరపాటున ఏదో ఒక రోజు ఒకటి రెండు వీడియోలను నెగిటివ్ వీడియోలు, గాసిప్స్ వీడియోలు చూశారు అనుకోండి. అప్పటినుండి అలాంటి కంటెంట్ మళ్లీ మళ్లీ చూపించబడుతుంది. దాంతో మెల్లగా మీ వ్యక్తిత్వం మొత్తం "వేరే వాళ్ల జీవితం గురించి మనకెందుకు" అనే మాదిరిగా గతంలో ఉన్నది కాస్తా మారిపోయి, "వాళ్ల జీవితంలో ఏం జరిగింది, వీళ్ల జీవితంలో ఏం జరిగింది" లాంటి గాసిప్ వీడియోలు చూడటం మొదలు పెడతారు. దురదృష్టవశాత్తు దీన్నంతా చాలా జ్ఞానం సంపాదిస్తున్నాం అనే భ్రమలో చూసేస్తుంటారు. యూట్యూబ్ వీడియోలు చేసే వ్యక్తులు వ్యూల కోసం అభూత కల్పనలు చక్కని స్వరంతో చెప్పినా అది నిజమని నమ్మే ఊబిలో కూరుకుపోతాం. సామూహిక హైజాక్ కేవలం ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలు మాత్రమే కాదు.. సామూహికంగా ఒక నగరంలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో అధిక శాతం మంది ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వినియోగదారులు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అన్నది కూడా "ట్రెండింగ్" రూపంలో మన ముందుకు తీసుకు రాబడుతుంది. అంటే సమాజం మొత్తం మంచి విషయాలు పక్కన పెట్టి, కాలక్షేపపు విషయాలు, సంచలనాత్మక విషయాలు చూస్తూ కూర్చున్నారు అనుకుందాం. మీకు అలాంటి కంటెంట్ వద్దు అనుకున్నా తప్పించుకోటానికి లేకుండా అది "ట్రెండింగ్" అనే విభాగంలో మీ దృష్టికి బలవంతంగా తీసుకు రాబడుతుంది. ఒకసారి మీ కళ్లకు అలాంటి సమాచారం వచ్చిన తర్వాత దాన్ని చూడకుండా ఉగ్గబట్టుకోవడం అతి కొద్దిమంది స్థితప్రజ్ఞులకే సాధ్యపడుతుంది. అంటే మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కావచ్చు, సమాజం మొత్తం చేసే బలహీన ఆలోచనలు కావచ్చు.. అవి మీరు తెల్లారి లేచింది మొదలు కొన్ని వందల సార్లు ఓపెన్ చేసే ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి యాప్స్‌లో ప్రతిఫలిస్తుంటాయి. దాంతో వ్యక్తులు తమ ప్రాధాన్యతలు మర్చిపోయి ఇలాంటి అప్లికేషన్స్ చూపించే సమాచారం మాయలో పూర్తిగా మునిగిపోతారు. నష్టం ఏంటంటే? మెషీన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ మనకేం కావాలో అవే నిర్ణయించి మన ఆలోచనలను ప్రభావితం చేయటం, మనకంటూ మనం సొంతంగా ఎప్పటికప్పుడు నిర్ణయించుకునే స్వేచ్ఛను హరించడం వల్ల వ్యక్తుల యొక్క నిర్ణయాత్మక శక్తి సన్నగిల్లుతుంది. తన జీవితానికి ఏమాత్రం ముఖ్యం కాని విషయాన్ని కూడా అతి ముఖ్యమైనదిగా భావిస్తాడు. ఉదాహరణకు "రామ జన్మభూమి" అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది అనుకోండి. రెండు మూడు రోజులపాటు ఆ అంశం తనకు ఏమాత్రం సంబంధం లేనిది అని అతను ఎంత తప్పించుకుని తిరుగుతున్నా ఏదో రూపేణా యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ కన్పిస్తూ ఉంటుంది. దాంతో ఆ అంశం చుట్టూ ఆ వ్యక్తిలో మెదడులో న్యూరాన్ల ఫైరింగ్ జరిగి ఓ న్యూరల్ నెట్వర్క్ సృష్టించబడుతుంది. తనకు అవసరం లేని విషయమైనా అతను కూడా దాని మీద ఒక పోస్ట్ రాస్తాడు. అంటే పరోక్షంగా మన ఆలోచనలు, మన ప్రాధాన్యతలు సోషల్ మీడియా సంస్థలు నిర్ణయిస్తున్నాయి. దీన్ని అడ్డుకోవడం ఎలా? ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టా వంటి యాప్స్ మాయలో పడకుండా ఉండాలంటే ఒక వ్యక్తికి తన మీద తనకు పూర్తిస్థాయి నియంత్రణ అవసరం. కళ్లెదురుగా ఎంత ప్రలోభపూరితమైన సమాచారం చూపించబడుతున్నా దాని జోలికి వెళ్లకుండా ఉండాలి. "కరోనా వచ్చిన వ్యక్తి ఎంత దారుణంగా చచ్చిపోతాడో తెలుసా" అని ఓ భయంకరమైన యూట్యూబ్ థంబ్‌నెయిల్ కన్పిస్తుంది అనుకోండి. మానవ సహజమైన స్వభావంతో దాన్ని చాలామంది రెండో ఆలోచన లేకుండా క్లిక్ చేస్తారు. అది ఆ వీడియో సృష్టించిన వ్యక్తి మనల్ని తన వైపు లాక్కోవడానికి పెట్టిన టైటిల్ అనీ, ఆ అంశం మనకు ఏమాత్రం అవసరం లేనిది, మన ప్రాధాన్యతలు వేరని అప్పటికప్పుడు గుర్తించగలిగే విజ్ఞత చాలా అవసరం. ఈ సెట్టింగ్స్ చేయండి ఈ సోషల్ మీడియా ట్రాప్ నుండి బయటపడాలంటే వెంటనే కొన్ని సెట్టింగ్స్ చేయండి. మీ ఫోన్ లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి, అందులో సెట్టింగ్స్ లో ఉండే "సెర్చ్ హిస్టరీ, వాచ్ హిస్టరీ" అనే వాటిని డిసేబుల్ చేయండి. ఇకమీదట మీకు చాలా వరకు ప్రమాదకరమైన రికమండేషన్స్ నిలిచిపోతాయి. అలాగే యూట్యూబ్ లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, "ఇదేదో ఆసక్తికరంగా ఉందే" అని ఒక వీడియో దగ్గర గానీ, ఫొటో, పోస్ట్ దగ్గర గానీ ఎక్కువ సేపు ఆగకండి. మీ ఫేస్‌బుక్, యూట్యూబ్ యాప్‌లలో పైకి మీ కళ్ళకు కనిపించకుండా "హీట్ మ్యాప్" అనే టెక్నాలజీ ఉపయోగించబడుతుంది. ఇది స్క్రీన్ మీద ఏ ఫొటో, పోస్ట్, వీడియో దగ్గర మీరు ఎక్కువ సేపు ఆగారు అన్నది కూడా రహస్యంగా పరిశీలిస్తూ మీ ఇష్టాలను పసిగట్టడానికి ప్రయత్నిస్తుంది. వీలైనంతవరకూ సంచలనాత్మక అంశాలను ఎట్టి పరిస్థితుల్లో చూడకండి. మీకు కావలసిన కంటెంట్ కోసం మీరే ఎప్పటికప్పుడు సెర్చ్ చేయండి. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో మీకు పైకి కనిపించని మీ జీవితాలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన వీడియోలు, పోస్టులు, ఫాలో కావలసిన వ్యక్తులు కూడా ఉంటారు, వారిని మీకు మీరుగా వెదికి పట్టుకోండి.. మీకేం కావాలో మెషీన్ కాదు నిర్ణయించాల్సింది, మీ ఆలోచనలను, మీరు ఫాలో అవ్వాల్సిన వ్యక్తులను, మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాల్సిన వ్యక్తులను మీకు మీరుగా నిర్ణయించుకునే స్వేచ్ఛ మీరు సాధించండి. స్వాతంత్రం అంటే దేశానికి మాత్రమే కాదు.. ఇలాంటి సోషల్ యాప్స్ మెషీన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ ద్వారా మీకు వేసిన బంధనాల నుండి విముక్తి సాధించడమూ స్వతంత్రమే, అదే నిజమైన స్వేచ్ఛ! - Nallamothu Sridhar (ఆంధ్రజ్యోతి టెక్ గురు కాలమ్)

22, ఆగస్టు 2020, శనివారం

3, ఆగస్టు 2020, సోమవారం

అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం...

అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం...
అన్నా చెల్లెళ్లు...అక్కా తమ్ముళ్ల మధ్య
ఆప్యాయత, అనుబంధం
ఎన్నేళ్లయీనా చెక్కు చెదరకుండా ఉండే బంధమే.
రక్షా బంధన్.
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
https://www.youtube.com/watch?v=IPPANNrV0Ic

30, జులై 2020, గురువారం

రియల్‌ హీరో సోనూ సూద్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు...

సినిమాలో వేసేది విలన్‌ పాత్రలు. బయట మాత్రం ఆయన రియల్‌ హీరో.
కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు ఎక్కడివారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు, డబ్బులు, తినడానికి తిండి అన్ని ఉన్నవారి పరిస్థితి ఆ టైంలో బాగానే ఉంది. కానీ పొట్టకూటి కోసం అయిన వారందరిని వదిలి ఎవరూ తెలియని చోటుకు వచ్చి బతికే  వలస కూలీల పరిస్థితే అగమ్య గోచరంగా మారింది.
ప్రభుత్వం అందించే సాయం అందకా, రైళ్లు,బస్సులు లేక సొంత గూటికి  చేరలేక, ఉన్నచోట తినడానికి తిండి, ఉండటానికి నీడలేక వారు పడిన బాధలు వర్ణనాతీతం. అలాంటి సమయంలో వారిని ఆదుకోవడానికి ఆ విలన్‌ హీరోలా ముందుకు వచ్చాడు.
సినిమాలో హీరోలం అని చెప్పుకునే చాలా మంది చెయ్యలేని పనిని చేశాడు. రియల్‌ హీరో అని నిరూపించుకున్నాడు. మమల్ని ఎవరు ఆదుకుంటారా అని వలస కార్మికులందరూ ఎదురు చూస్తున్న క్రమంలో సోనూ సూద్ నేనున్నాను అంటూ వారిని సొంత గూటికి చేర్చాడు. వాళ్లందరిని బస్సులు, రైళ్లు ద్వారా అయినవారి చెంతకు చేర్చాడు. అప్పటి నుంచి ఎవరు ఏ సాయం అడిగిన అందిస్తూనే ఉన్నాడు.
అక్కడి వారు, ఇక్కడి వారు అనే తేడా లేదు. ఎవరు కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆయన ముందుకు వస్తున్నాడు.
మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతుకు ట్రాక్టర్‌ కొనిచ్చి తన మానవత్వాన్ని మరోమారు  చాటుకున్నాడు. 

కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు సోనూ సూద్‌. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు సోనూ సూద్‌. తాజాగా టీవీ నటుడు అనుపమ్ శ్యామ్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు సోనూ సూద్‌. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన అనుపమ్‌ శ్యామ్‌కు సాయం చేస్తానని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు సోనూ సూద్‌. 
....నిత్య జీవితంలో  రియల్‌ హీరో, 
మానవత్వం, సేవాగుణం కలవారు 
సోనూ సూద్‌ గారికి  
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... 


29, జులై 2020, బుధవారం

బ్లడ్ ప్లాస్మా అంటే ఏమిటి..?

# బ్లడ్  ప్లాస్మా అంటే ఏమిటి..?
* రక్తపు రసి ( Blood plasma - బ్లడ్ ప్లాస్మా, రక్తరసము, నెత్తురు సొన, రక్తజీవద్రవ్యం) అనేది తేటైన ఎండుగడ్డి రంగు గల రక్తం యొక్క ద్రవ భాగం, ఇది రక్తం నుండి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లేట్స్, ఇతర సెల్యూలర్ భాగాలు తొలగించబడిన తరువాత మిగిలిన భాగం. ఇది మానవ రక్తం యొక్క ఒక పెద్ద భాగం, రక్తంలో దాదాపు 55 శాతం దాకా వుంటుంది, నీరు, లవణాలు, ఎంజైములు, రోగనిరోధక కణాలు, ఇతర ప్రోటీన్లను కలిగి వుంటుంది. ప్లాస్మా 92% నీటితో కూడి ఉంటుంది, ఇది మానవ శరీరానికి అవసరమైన కణాలు, వివిధ కీలక పదార్థాలను సరఫరా చేసే ఒక మాధ్యమం. ప్లాస్మా శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించడం సహా వ్యాధులను ఎదుర్కోవడం, వివిధ ఇతర క్లిష్టమైన విధులను చేపడుతోంది.*


* 👉 # ప్లాస్మాథెరపీఅంటే_ఏంటి?*

* రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కోవిడ్-19 వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే, వారిలోని రోగనిరోధక కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి ఆ వైరస్‌ను నాశనం చేస్తాయి. అందుకే, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది.*

* అయితే, కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది.*

* అందుకు పరిష్కారంగా, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు..*

11, జూన్ 2020, గురువారం

బ్లడ్ గ్రూప్...

గ్రూప్ సభ్యులు అందరికి నమస్కారం...
whatsApp లో  బ్లడ్ గ్రూప్ నడిపెట్టపుడు తిసుకొవలసిన జాగ్రత్తలు :
ఈ గ్రూప్, అత్యావసరమైన, గ్రూప్.
Gm, Gn, images, Hi....  ఏ ఇతరములు దయచేసి పెట్టారాదు  please...
సమాజంలో ప్రతి మంచి చెడు పనులకు ప్రత్యేక ప్రదేశాలు ఉన్నట్లే, 
సమాచారాలకు కూడా ప్రత్యేక గ్రూప్ లు ఉన్నాయి.
ఈ చిన్న విషయాన్ని అర్ధం చేసుకొని ప్రవర్తిస్తే 
మన సేవాభావనికి అర్థం పరమార్థం ఉంటుంది.
..
గ్రూప్ సభ్యులు అందరికీ చిన్న విన్నపం.
గ్రూప్ సభ్యులు అందరూ గ్రూప్ నియమాలను పాటించ వలెను, 
లేనియెడల వారిని గ్రూప్ నుండి తోలగించబడును. 
దయచేసి సభ్యులందూ గమనించగలరు.
..
. ఈ గ్రూప్ లో బ్లడ్ కు సంబంధించిన పోస్టులు మాత్రమే పెట్టాలి.
. బ్లడ్ అవసరమైన వాళ్ళు date తో పాటు ఫుల్ డీటెయిల్స్ పెట్టాలి.
. మీరు బ్లడ్ ఎవరైన అవసరమైనప్పుడు మీ దగ్గరలో ఉన్న
 జిల్లాలోని వారు గాని,ఊరి(city) వారు వచ్చి బ్లడ్ ఇస్తారు.
. బ్లడ్ ఇవ్వడానికి అందరికి ఆయా సమయానికి
 కొన్ని సందర్భాలలో కుదరకపోవచ్చు, mobile చుడకపోవచ్చు,
నెట్ బాలన్స్ లేకపోవచ్చు కాబట్టి ఆయా సమయంలో తప్పుగా అనుకోవద్దు.
. ఈ గ్రూప్ లో చాలా జిల్లాలోని వారు,రెండు రాష్ట్రంలో ని వారు కూడా ఉన్నారు.
. గ్రూప్ కు సంబంధం లేని పోస్టులు పెట్టినచో గ్రూప్ నుండి తొలిగించబడతారు.
. ఈ గ్రూప్ లో బ్లడ్ కు సంబంధం లేని ఎటువంటి పోస్టులు పెట్టవద్దు సమయానికి స్పందిస్తే చాలు.
. బ్లడ్ కోసం ఎదైనా మెసేజ్ వచ్చినచో వారు ఇచ్చిన నేంబరుకి ఫోన్ చేసి 
వివరాలు తేలుకున్న తరువాతనే పోస్ట్ చేయగలరు.
              ఇట్లు
        మీ కోసం మీ,

22, మే 2020, శుక్రవారం

కరోనాపై యుద్ధం.. 1.3 కోట్ల సైన్యం...

భారతదేశంలో దేశవ్యాప్తంగా కరోనా యోధుల లెక్క తేల్చిన కేంద్రం.
పోరులో డాక్టర్ల నుంచి గ్రామీణ డాక్‌ సేవక్‌ల వరకు.
ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, మాజీ సైనికులు, ఆశ వర్కర్లు..
అత్యధిక సంఖ్యలో అంగన్‌వాడీల భాగస్వామ్యం..
కరోనాపై పోరులో తెలంగాణలో 3.36 లక్షల మంది..
ఏపీలో 7.24 లక్షల మంది యోధులు.. 

             రోజుకు ప్రపంచంలో ఎన్ని కొత్త కేసులు వస్తున్నాయి.. మన దేశంలో ఈ రోజు ఎంతమందికి సోకింది..  కానీ అసలు ఈ కరోనా మహమ్మరిపై ఎంత మంది యుద్ధం చేస్తున్నారు? రోజూ మహమ్మారితో ప్రత్యక్షంగా పోరాడుతూ మన దేశంలో, రాష్ట్రంలో వైరస్‌ను నియంత్రిస్తున్నారనే దాని గురించి ఆలోచించారా? కరోనా యోధులుగా పిలిచే వీరి సంఖ్య 1.3 కోట్లకు పైగానే. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనాపై వీరంతా పోరాడుతున్నారు. ఇందులో ఎంబీబీఎస్‌ డాక్టర్ల నుంచి గ్రామీణ డాక్‌ సేవక్‌ల వరకు ఉన్నారని కేంద్ర లెక్కలు చెబుతున్నాయి.

21, మే 2020, గురువారం

ప్రపంచంపై కరోనా పంజా అరకోటి...

చైనాలో తొలి కరోనా కేసు వెలుగు చూసి ఆరు నెలలైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేసులు అరకోటి దాటేశాయి. 3 లక్షల 25వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 213 దేశాలకు వైరస్‌ విస్తరించింది. ఇప్పటివరకు ఏ వ్యాధి కూడా ఈ స్థాయిలో ప్రపంచ దేశాలను భయపెట్టలేదు. వ్యాక్సిన్‌ ఇప్పుడప్పుడే వస్తుందన్న ఆశ లేకపోవడంతో కరోనాతో కలిసి బతుకు బండిని సాగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆర్థికం, ఆరోగ్యం మధ్య సమన్వయం సాధించడం కోసమే దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాల్లో కరోనా కరాళ నృత్యం చేసింది. ఇప్పుడు రష్యా, బ్రెజిల్, యూకేలో విజృంభిస్తోంది.  





18, మే 2020, సోమవారం

భారతదేశంలో లాక్‌డౌన్‌ మే 31 వరకు ...

భారతదేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో
లాక్‌డౌన్‌ మే 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
నిషేధం వీటిపైనే..
''అన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైల్‌ సర్వీసులు నిషేధం కొనసాగుతుంది. స్కూల్స్‌, కాలేజీలు, ఎడ్యుకేషన్‌, ట్రైనింగ్‌, కోచింగ్‌ సంస్థలు తెరవడానికి వీలు లేదు. ఆన్‌లైన్‌ టెస్టింగ్‌ లెర్నింగ్‌ ఎప్పటిలాగే కొనసాగుతాయి. హోటల్స్‌, రెస్టారెంట్లు, హాస్పిటిలిటీ సర్వీసులు అనుమతి లేదు. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్స్‌, స్విమింగ్‌పూల్స్‌, ఇతర వినోదపార్క్‌లు, థియేటర్స్‌, బార్లు, ఆడిటో రియంలు, అసెంబ్లీ హాల్స్‌ తెరవటానికి అనుమతిలేదు. రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్ర మాలకు అనుమతిలేదు. మతపరమైన సంస్థల్లో ప్రజలకుఅనుమతి లేదు. మతప రమైన ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి లేదు'' అని పేర్కొంది. 

ఒక్కరోజులోనే 4,987:
ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987 పాజిటివ్‌ కేసులు.. ఏకంగా 120 మరణాలు. భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం ఏమాత్రం ఆగడం లేదనడానికి నిదర్శనాలివీ. కరోనా పాజిటివ్‌ కేసులు 90 వేల మార్కును దాటేయడం గుబులు రేపుతోంది.  దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 90,927కు, మరణాలు 2,872కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


16, మే 2020, శనివారం

కూలిపోయిన కూలి బతుకులు.. కడుపునింపని ప్యాకేజీలు..

ఎర్రటి ఎండ.. కాళ్లకు సగం సగం ఊడిపోయి ఎప్పుడు తెగిపోతాయో తెలియని చెప్పులు..
 నెత్తిన మూట, పక్కన పదేండ్ల కూతురు, ఆ అమ్మాయి చేతిలో చంటిపాప, భార్య చేతిలో పెద్ద మూట, పక్కన నెత్తిమీద బరువుతో భార్య.. 
ఇలా మొత్తం కుటుంబం వందల కిలోమీటర్లు కాలినడకన సొంతూళ్లకు చేరుకునేందుకు నానా యాతనలు పడుతున్నారు. వందల కిలో మీటర్లు నడుస్తున్నారు. జనం లక్షల సంఖ్యలో ఇప్పటికీ హైవేలలో ముందుకు సాగుతున్నారు.  వీరిలో కొందరు దారిలో ప్రాణాలు వదులుతున్నారు.

తక్షణం వలస కూలీలను ఎలా ఆదుకోవాలనే ఆలోచన ఎక్కడా కనిపించలేదు. వలసకూలీలు ఆకలికీ, నిరుద్యోగానికీ, వందలమైళ్ల నడకకూ భయపడటం లేదు. కానీ పాలకుల వివక్షకు మాత్రం వారు ఆందోళనకు గురవుతున్నారు. నిజమే, కోట్లాది మంది వలసకూలీలను పట్టించుకోని పాలకుల భయానకమైన బాధ్యతా రాహిత్యానికి రోడ్లపాలైన కూలీల బతుకులు, పట్టాలపై, రోడ్లపై విగతజీవులైన వారి జీవన్మృత సాక్ష్యాలు.

లాక్‌డౌన్‌ ప్రకటించి 50 రోజులు దాటింది. అలా ప్రకటించే టప్పుడు పొట్టచేతపట్టుకుని నగరాలకు వలస వచ్చిన కూలీలు పరిస్థితి ఏమిటి? వారెలా జీవిస్తారు? ఎక్కడ ఉంటారు? వీరి బతుకులను ఏం చేయాలనే ఆలోచన, ప్రణాళిక లేకుండా వారిని బతికి ఉండేలా చేయాలనే ధ్యాస లేకుండా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ వలస కార్మికులు 20 కోట్ల వరకు ఉంటారు. వలస కార్మికుల గురించి ప్రభుత్వానికి అవగాహనలేదు. 




11, మే 2020, సోమవారం

మంచి మిత్రుడిని కోల్పోయాం...

మంచి మిత్రుడిని కోల్పోయాం...
రవికి నా నివాళి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
సాక్షి దిన పత్రిక ఫోటోగ్రాఫర్ రవి రాత్రి జడ్చర్ల లో కన్ను ముసాడు.దాదాపు 

గత 2 సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు.
సిగ్మ ఆర్ట్ పోటోగ్రాఫి పోటిలో పోట్రైట్ విభాగంలో గోల్డ్ మెడల్, SAAP జాతీయస్థాయి

 ఫొటోగ్రఫీ పోటీలలో అవార్డు, ...అనేక అవార్డులు అవార్డులు అందుకున్నారు.
 పండుగలు, ఎన్నికలు, ఉద్యమాలు, పోరాటలలో... చాల మంచి ఫోటో గ్రాఫర్ గా గుర్తింపు వచ్చింది.
స్నేహశీలి, కష్టజీవి, అరుదైన వ్యక్తిత్వం, అప్యాయంగా పిలిచే అన్న.
రవి గారికి జోహర్లు.




10, మే 2020, ఆదివారం

పేదలకు ఉచిత భోజనాలు పంపిణి...

కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా  హైదరాబాద్ జిందాబాద్ ముషీరాబాద్ డివిజన్ కమిటీ ఆద్వర్యంలో...
( YSR పార్క్ ఏరియా) ఈ రోజు 160 మంది  పేదలకు  ఉచిత భోజనాలు పంపిణి.
గత 20 రోజులుగా పేదలకు ఉచితంగా ప్రతి రోజు ఉదయం 200 మంది టిఫిన్, 

మధ్యాహ్నము 100 మందికి ఉచిత భోజనాలు పంపిణి జరిగింది.




5, మే 2020, మంగళవారం

COVID-19 అనంతర ప్రపంచం - నా అంచనాలు


1) Life Styles - కుటుంబ జీవనంలో గణనీయమైన మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా Western countries లో కుటుంబ బంధాలు ఇప్పటివరకు బలహీనంగా ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల , బ్రతుకు భయం వల్ల కుటుంబ సంబంధాల్లో అవగాహన పెరుగుతుందని, ఆత్మీయతలు తెలియకుండానే పెరుగుతాయని, ఇవి కుటుంబ వ్యవస్థ బలోపేతానికి దారి తీస్తాయని భావిస్తున్నాను.
ఆహారపు అలవాట్లలో కూడా గణనీయమైన మార్పు వస్తుందని, సొంతంగా ఆహారాన్ని తయారుచేసుకుని తినే అలవాటు పెరుగుతుందని నా నమ్మకం.
2) Medical & Health care - Western countries లో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ శక్తుల చేతుల్లో ఉంది. అందువల్లే COVID 19 ను ఎదుర్కోవడంలో అవి విఫలమయ్యాయి అని నేను భావిస్తున్నాను. అమెరికా లాంటి అత్యున్నత దేశంలో కేవలం 89,000 వెంటిలేటర్లు ఉండడం, PPE కిట్లు అందుబాటులో లేకపోవడం దుస్థితిని తెలియజేస్తోంది. భారత్ లాంటి దేశాలు అమెరికా కన్నా మెరుగ్గా COVID 19 ను ఎదుర్కో కలుగుతున్నాయి అంటే ఇక్కడ వున్న ప్రభుత్వ రంగంలోని హాస్పిటల్స్ కారణం. భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు COVID 19 వైద్యాన్ని మొత్తం ప్రభుత్వ రంగంలోనే చేయించడం వల్ల కేసులను అర్థం చేసుకోవడం, నియంత్రించడం సాధ్యమవుతోంది . అదే ప్రైవేటు రంగానికి వదిలి ఉంటే ఎక్కడ ఎన్ని కేసులు ఉన్నాయో, అది ఎంత స్ప్రైడ్ అవుతుందో, వైద్యం పేరిట వారెంత దోపిడీ చేస్తారో ఊహించుకుంటేనే భయమేస్తుంది. కనుక రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసే విషయంలో అన్ని దేశాలు ముందడుగు వేస్తాయని భావిస్తున్నాను.
3) Personal & Community Hygiene - ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే Western countries లో నే COVID 19 ఎక్కువగా వ్యాపించింది. Personal hygiene తక్కువగా ఉండి ఎక్కువగా మురికితో సహవాసం చేసే మనలాంటి దేశాల్లో ఉద్ధృతి కొంత తక్కువగానే ఉంది. దీనిని బట్టి మురికితో సహవాసం చేసేవారికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుందనేది అర్థమవుతుంది. అంతేకాకుండా మన దగ్గర మలేరియా, తట్టు లాంటి రోగాలు ఇప్పటికీ ఉండడం వల్ల మనం హైడ్రోక్లోరొక్విన్ మందులను, బీసీజీ టీకాలను ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు అవే మనలను రక్షిస్తున్నాయి అంటున్నారు.
మిగిలిన ప్రపంచం మలేరియా లను, తట్టు లాంటి రోగాలను జయించడం వల్ల వారికి hydroxychloroquine, bcg లు అందుబాటులో లేకుండా పోయాయి. కాబట్టి personal hygiene ను ఎక్కువగా పెంచుకున్నా ఇబ్బందేనేమో ఆలోచించాలి.
4) Travel & Hospitality - ఇది బాగా తగ్గవచ్చు. వివిధ దేశాలు తమ దేశంలో ప్రవేశించే వారిపట్ల కఠిన నిబంధనలు అమలు చేయవచ్చు. అలాగే ప్రజలు కూడా కొంతకాలం టూరిజం పై ఆసక్తి కన బరచక పోవచ్చు. ఈ రంగం ఎక్కువగా కుదుపులకు గురయ్యే అవకాశం ఉంది.
COVID19 లాక్ డౌన్ వల్ల పర్యావరణ కాలుష్యం విపరీతంగా తగ్గింది. వ్యక్తిగత వాహనాలు మూలనపడ్డాయి. వాటిని అలాగే మూలన ఉంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచడం మంచిది. తద్వారా ప్రపంచాన్ని కాలుష్య రహితంగా మార్చుకోవడానికి అది ఉపకరిస్తుంది. అంతే తప్ప డ్రైవర్ లెస్ వాహనాలను పెంచితే భవిష్యత్తు కాలుష్యంతో మరింత బాధాకరంగా మారుతుంది.
గ్లోబలైజేషన్ కు దూరంగా ఉన్న ఉత్తర కొరియా(ఆంక్షల వల్ల), తుర్కమిస్తాన్, కొన్ని ఆఫ్రికా దేశాలు COVID 19 కు దూరంగా ఉన్నాయి. మిగిలిన ప్రపంచంతో అనుసంధానం లేకపోవడం వాటిని ఈ విషయంలో రక్షించినట్లు ఉంది.
5)Focus on Agriculture & Infrastructure - ఇది అత్యంత అవసరం. గ్లోబలైజేషన్ పేరిట వ్యవసాయ రంగాన్ని విస్మరించారు. అలాగే Infrastructure ను కూడా విస్మ రించారు. వెనకబడిన దేశాలనుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకున్న అభివృద్ధి చెందిన దేశాలు తమ దగ్గర వస్తువులను తామర తంపరగా ఉత్పత్తి చేసి ప్రపంచమంతా వెదజల్లిన ఫలితంగా మన దేశం లాంటి దేశాలలో కనీసం ఆడవాళ్ళు తలలో పెట్టుకునే పిన్నీసులు సైతం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే ఆహార పదార్థాల విషయంలో కూడా అనేక దేశాలు దిగుమతుల మీద ఆధారపడ్డాయి. అలాంటి దేశాలన్నీ లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.మహాత్మా గాంధీ స్వయం పోషక గ్రామాలు ఉండాలని కోరుకున్నాడు. ప్రతి గ్రామం యొక్క అవసరాలు అన్ని ఆ గ్రామంలోనే తీరాలి అనేది ఆయన కోరిక. ఈ సూత్రాన్ని ప్రస్తుతం అన్ని దేశాలు అనుసరించడం మంచిది. ప్రతి దేశము తమకు అవసరమైన ఆహారాన్ని, వస్తువులను, ఇంధనాలని, ప్రతి దాన్ని సమకూర్చుకొని స్వయం సమృద్ధం అవడం మంచిది.
6)Low Cost Living - ఇది అనివార్యం. ఇప్పటికే రెండు నెలలు లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు స్తంభించి ఆర్థిక చలనం ఆగిపోయింది. నూటికి ఎనభై శాతం మందికి పైగా జీతం లేకపోవడమో లేదా జీతంలో కోత పడడమో జరిగాయి. గ్లోబలైజేషన్ పుణ్యం వల్ల వస్తు సంస్కృతి, విలాస సంస్కృతి పెరిగి అందరూ EMI లకు అలవాటు పడ్డారు. ఇప్పుడు వాటిని చెల్లించడమే పెద్ద భారం. భారత్ లో కొంత పొదుపు అలవాటు ఉంది. యూరప్ దేశాలలో పొదుపు అలవాటు లేని కారణంగా ఉన్న సొమ్ము తో రెండు నెలలకు మించి బతకలేని దుస్థితి ఉంది. రానున్న సంవత్సరం లేదా ఆపైన ఆర్థిక మాంద్యం కొనసాగక తప్పదు. అందువల్ల జీతాలలో పెరుగుదల 80 శాతం మందికి అసాధ్యమనే చెప్పాలి. కనుక తక్కువ ఖర్చుతో జీవితాన్ని సాగించడం అలవాటు చేసుకుని తీరాలి.
7) China will emerge as Top Country - నా అంచనా ప్రకారం రానున్న రోజుల్లో చైనా ప్రపంచం అగ్రరాజ్యంగా భాసిల్లవచ్చు. COVID19 విషయంలో చైనాను దోషిగా నిలబెట్టాలని మిగిలిన ప్రపంచం ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవచ్చు. ప్రపంచం మొత్తం ఉన్న 200కు పైగా దేశాల్లో దాదాపుగా 80 దేశాలు ఇస్లామిక్ దేశాలు. అలాగే ఆఫ్రికా దేశాలు కూడా గణనీయంగా ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు అమెరికా, దాని అనుబంధ దేశాలకు వ్యతిరేకం కనుక, ఆర్థికంగా, సాంకేతికంగా బలంగా ఉండి వివిధ అంశాలలో తమకు సహకరించే చైనాకు అవి బాసటగా నిలవవచ్చు. ఇక అనేక ఆఫ్రికా దేశాలతో చైనా ఇప్పటికే ఆర్థిక, సాంకేతిక బంధాలను కలిగి ఉంది. పేదరికాన్ని అధిగమించడం కోసం ఆదేశాలు కూడా చైనాకు సహకరించవచ్చు. భారత్ చుట్టూ ఉన్న శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్ లాంటి దేశాలు ఇప్పటికే చైనాతో సత్ సంబంధాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా చైనా అతి సమీప కాలంలోనే ప్రపంచపు అగ్రరాజ్యంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. చైనాతో వైరం ఉన్న జపాన్, దక్షిణ కొరియా,భారత్ లాంటి దేశాలు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు చైనా వ్యతిరేక కూటమిగా ఉండవచ్చు. రష్యా, జర్మనీ వంటి దేశాలతో పాటు మాజీ సోవియట్ యూనియన్ నుంచి విడివడిన దేశాలు తటస్థ వైఖరి అవలంబించవచ్చు.
8) Is India grab the opportunity? - చాలా మంది ఆశావహులు, ముఖ్యంగా ఒక సెక్షన్ మద్దతుదారులు ఈ pandamic ముగిసిన అనంతరం భారత్ వెలిగి పోతుందని ఇప్పటి నుంచే ఊదర గొడుతున్నారు. అనేక ప్రపంచ దేశాలు చైనా నుంచి తమ ఫ్యాక్టరీలను, ఉత్పత్తులను ఉపసంహరిస్తాయనీ, వాటన్నింటినీ భారత్ కు తరలిస్తారని భావిస్తున్నారు. కొంతమేరకు ఇది జరగవచ్చు. అయితే ఒకప్పుడు సాంకేతికంగా వెలుగొందిన జపాన్, ఇప్పుడు సాంకేతికతలో ముందున్న దక్షిణ కొరియా, ఆ తర్వాత వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు ఎక్కువగా లబ్ధి పొందవచ్చు. భారత్ లో మానవ వనరులు అధికంగా ఉన్నా పెద్ద ప్రతికూలత ఏమంటే ఇటీవల సమాజంలో అసహనం పెరగడం. అధికార స్థానంలో ఉన్న వాళ్ళు వాస్తవికత లో కన్నా వాగాడంబరం లో జీవించడం. దేశంలో ఫెడరల్ స్ఫూర్తి కి విఘాతం కలిగించే నిర్ణయాలను, చట్టాలను అమలుపరచడం. వీటన్నింటి వల్ల పొందాల్సిన మేరకు మన దేశం లబ్ధిని పొందలేక పోవచ్చు. అయితే ఇప్పుడున్న దానికన్నా కొంత లాభం జరగ వచ్చు. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు తమ దేశాలలోకి ఇతరుల ప్రవేశంపై ఆంక్షలు పెంచనున్న కారణంగా భారత్ లోని software పరిశ్రమ పెరిగే అవకాశం వున్నది. ఇక్కడి నుండే సేవలను ఆయా దేశాలు పొందే అవకాశం గణనీయంగా పెరగవచ్చు.ఇతర రంగాలలో చెప్పుకోదగిన అభివృద్ధి ఉండకపోవచ్చు. కారణం మనదేశంలో ఉన్న పెట్టుబడిదారులలో అధిక శాతం దళారీలుగా వ్యవహరించే ధోరణి ఉన్నవారు. ఎంత ఎక్కువగా బ్యాంకులను, ఇతరులను ముంచాలనే ధోరణి ఉన్నవారు. వారికి మన ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తూ ఉంటుంది. కనుక ఇతర రంగాల్లో అభివృద్ధి కష్టమే. Software లో పెట్టుబడి తక్కువ ఫలితం ఎక్కువ. కనుక అది విజయవంతం అయ్యే అవకాశం ఉంది.
కొన్ని అంశాలలో ఇవి నా అంచనాలు మాత్రమే.
- టి.వి.రావు

కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా తిండిలేని వారిని అదుకుందాం....

హైదరాబాద్‌ జిందాబాద్‌ బాగ్‌లింగంపల్లి కమిటి ఆధ్వర్యంలో ఈ రోజు ఎల్‌ఐజి కాలనీ లో హైదరాబాద్‌ జిందాబాద్‌ కార్యాలయం వద్ద జరిగిన బియ్యం, సరుకుల పంపిణి కార్యక్రమము జరిగింది.  ముఖ్య అతిథులుగా ఎఎస్‌వో బాల్‌రాజు గారు, మరియు హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు శ్రీనివాస్‌ రావు గారు, సరుకుల దాత వి. రాజు గారు హాజరై ప్రారంభించారు. 
ఈ కార్యక్రమంలో 50 మంది కుటుంబలకు బియ్యం, సరుకుల పంపిణిి చేశారు. 




3, మే 2020, ఆదివారం

214 మందికి బియ్యం, సరుకుల పంపిణి...

ఆకలితో వందల మంది చనిపోతున్నారు.
వలస కూలీలను, తిండిలేని వారిని ఆదుకుందాం...

చాలా మంది ఎన్నోసార్లు నిరుపేదలకు కాస్తయినా సాయం చేద్దామనుకుంటారు.
 కానీ జీవన గమనంలో సమయం దొరకదు. అభాగ్యులకు అండగా నిలుద్దామన్న
 ఆశ వుంటుంది కానీ డబ్బులు వుండవు. దానికోసం సంపన్నులు, 
కోటీశ్వరులు కానక్కర లేదు. చదువు, హోదాలతో పనిలేదు. 
మంచితనం, మానవత్వం వుంటే చాలు...

1, మే 2020, శుక్రవారం

పారిశుధ్య ఉద్యోగులకు మే డే శుభాకాంక్షలు...

కరోనా మహమ్మారి పై పోరు చేస్తున్న పారిశుధ్య ఉద్యోగులకు
వైద్య సిబ్బందికి, శ్రామిక వర్గానికి వందనాలు...
మే డే శుభాకాంక్షలు. 

... హైదరాబాద్‌ జిందాబాద్

30, ఏప్రిల్ 2020, గురువారం

ఓల్డ్‌ నల్లకుంట వీది నంబర్ 14 లో...బియ్యం, సరుకుల పంపిణి..

వలస కూలీలను, తిండిలేని వారిని అదుకుందాం.... హైదరాబాద్‌ జిందాబాద్‌
27.04.2020 ఓల్డ్‌ నల్లకుంట వీది నంబర్ 14 లో జరిగిన బియ్యం, 10 రకాల సరుకుల పంపిణి... 

25 మంది కుటుంబలకు పంపిణి చేశాము.








26, ఏప్రిల్ 2020, ఆదివారం

ఫీవర్‌ హాస్పిటల్‌ చౌరస్తాలో బియ్యం, 10 రకాల సరుకుల పంపిణి ...

వలస కూలీలను, తిండిలేని వారిని అదుకుందాం.... హైదరాబాద్‌ జిందాబాద్‌
ఈ రోజు ఫీవర్‌ హాస్పిటల్‌ చౌరస్తాలో ( ఓల్డ్‌ నల్లకుంట ) జరిగిన బియ్యం, 
10 రకాల సరుకుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లకుంట సిఐ 
మూరళిధర్‌ గారు, ఎస్‌ఐ వీరశేఖర్‌ గారు హాజరై ప్రారంభించారు.
ఈ రోజు ఉత్తరప్రదేశ్‌ చెందిన 27 మంది కుటుంబలకు పంపిణి చేశాము.


బియ్యం5 కెేజీలు, కందిపప్పు1కెేజీ, విజయా నూనె1కేజీ, షుగర్‌ 500 గ్రా.,
చింతపండు 250 గ్రా...మొదలగు 10 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌లు పంపిణి చేయడం జరిగింది.





22, ఏప్రిల్ 2020, బుధవారం

ఓల్డ్‌ నల్లకుంట లో బియ్యం, సరుకుల పంపిణి...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ఓల్డ్‌ నల్లకుంట లోని ఓల్డ్‌ రామాలయం వద్ద జరిగిన బియ్యం, సరుకుల పంపిణి కార్యక్రమానికి జిహెచ్‌ఎంసి డిఫ్యూటి కమీషనర్‌ వేెణుగోపాల్‌ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు.
వలస కార్మికులు,ఇంటి పనివారు, చెత్తబండి వారు,వాచ్ మెన్ లకు బియ్యం5 కెేజీలు, కందిపప్పు1కెేజీ, విజయా నూనె1కేజీ, షుగర్‌ 500 గ్రా.,చింతపండు 250 గ్రా...మొదలగు 10 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌లు పంపిణి చేయడం జరిగింది. ఈ రోజు మొత్తం 32 మందికి పంపిణి చేశాము.




18, ఏప్రిల్ 2020, శనివారం

వలస కార్మికులకు బియ్యం సరుకుల పంపిణి...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో అంబర్‌పేట్‌ 6 నెంబర్‌ చౌరస్తాలో జరిగిన బియ్యం సరుకుల పంపిణి కార్యక్రమానికి జిహెచ్‌ఎంసి డిఫ్యూటి కమీషనర్‌ వేెణుగోపాల్‌ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఉత్తరప్రదేశ్‌, కర్నాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ , మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల వలస కార్మికులకు బియ్యం5 కెేజీలు, కందిపప్పు1కెేజీ, విజయా నూనె1కేజీ, షుగర్‌ 500 గ్రా.,చింతపండు 250 గ్రా...మొదలగు 10 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌లు పంపిణి చేయడం జరిగింది. ఈ రోజు మొత్తం 7 ఫ్యామిలీలకు, 42 మంది బ్యాచ్‌లర్స్‌కు ప్యాకెట్స్‌ పంపిణి చేశాము.