25, ఆగస్టు 2020, మంగళవారం
నిశ్శబ్దంగా నిష్క్రమించిన నాన్న...
నిశ్శబ్దంగా నిష్క్రమించిన నాన్న - Venkat Kolagari
80 సంవత్సరాలకు పైబడిన జీవితం. ఎవరి మీద పిర్యాదులు లేవు. ఆందోళనలు లేని నిశ్శబ్ద జీవితం. బుదవారం వేకువన, ప్రశాంతమైన నాన్న నిద్రను ఆఖరి నిద్రను చేసి, కాలం నిర్ధాక్షిణ్యంగా తన దారిన తాను వెళ్లిపోయింది. శ్రమలో నిండిన తన జీవితం బ్రహ్మ తన నుదుటిన రాసిన రాత ఫలితం అన్న ప్రగాఢ నమ్మకం, బండ చాకిరి నుండి బయటపడి, తన జీవితాన్ని వికసింపచేసుకోవడానికి చేసే ప్రయత్నాలను అన్నింటిని కాలరాసి, తలఎత్తక కలవారికి దాస్యం చేయడం తప్ప మరో మెరుగైన జీవితం తనకు లేకుండా చేసింది.
కల్మషంలేని, ఒకరికి చెడు తలపెట్టాలన్న తలంపు లేని, ఇతరుల గురించి చెడు ప్రచారం చేయాలన్న ఆలోచన లేని, కోపం ఎరుగని, ప్రేమగా మనసార తోటివారిని పిలిచే మంచి మనిషి తాను. అందుకేనేమో, తన మోహంలో చెదరని ప్రశాంతత వెల్లివిరుస్తుండేది.
స్వాతంత్రానికి సుమారు ఏడు సంవత్సరాల క్రితం, మారుమూల గ్రామం, కృష్ణ , తుంగభద్రల కూడలైన కూడవెళ్లిలో జన్మించాడు మా నాన్న తెలుగు రాముడు. గ్రామంలోని భూములన్నీ ఆధిపత్య కులాలయిన రెడ్లు మరియు బ్రహ్మణ కులస్థుల చేతిలో ఉండేవి. గ్రామానికి రెండువైపుల విస్తరించిన రెండు నదులు, గ్రామాన్ని బయటి ప్రపంచానికి దూరంచేసి, గ్రామ భూముల్ని అత్యంత సారవంతంగా మార్చాయి. గ్రామాన్ని మాత్రం మారుమూలకు పరిమితం చేశాయి. మారుమూల గ్రామం, రాజ్యాంగం ఆధునిక విలువలయిన స్వేచ్చా, సమానత్వాన్ని, ఆత్మగౌరంగా బ్రతికే పరిస్థితుల్ని దళిత, బహుజనులకు పూర్తిగా దూరంచేసి, ఆధిపత్య కులాల ప్రజలకు సేవచేస్తూ, వారిముందు తలవంచుకొని బ్రతికే దుర్భర పరిస్థితిని కల్పించింది. గ్రామాలు ఆజ్ఞానం, ఆచారాలతో కుళ్లికంపు కొడుతూ, వివక్షతలు, అణచివేతలు, వెట్టిచాకిరి లకు నెలవై దళిత బహుజన కులాల ప్రజల జీవితాల్ని దుర్భరంగా మార్చే మురికికూపాలు అన్న అంబేద్కర్ మాటలకు అచ్చమైన నమూనాగా ఉండిందీ ఈ గ్రామం.
తాను పాఠశాల విద్య ఎరుగడు. ఆర్థిక స్థోమతలేక, చదువు అవసరం పట్ల స్పృహలేక, చదువుకునే సౌకర్యాలు సైతం లేని మారుమూల గ్రామంలో, ఆనాటి కాలాన, వెనుక ఉంచబడిన కులం అయిన బెస్త కులంలో జన్మించిన తనకు జీవితం వికసించడానికి అవకాశం ఇవ్వలేదు. గాసం పేరున వెట్టిచాకిరికి బంధీని చేసింది. రెడ్ల ఇండ్లలో గాసం చేయడం ప్రధాన జీవితం, జీవనోపాధిని కలిగిన తన తండ్రులు, చిన్నప్పుడే తనను రెడ్ల ఇండ్లలో గాసానికి ఉంచారు. అర్థ శతాబ్దం పైగా గాసమనే దుర్మార్గపు కోరలకు బంధీ అయి, తన చెమట, నెత్తురును ధార పోసి, నమ్మకంగా పనిచేశాడు. తనకు డబ్బులు ఖర్చుచేసే ఎలాంటి దురలవాట్లు లేవు. డబ్బు విషయం పట్ల బహు పొదుపరి. వ్యవసాయం చేయడం నుండి వంట చేయడం దాక తనకు ఎన్నోరకాల పనులు నైపుణ్యంతో చేయడం వచ్చు. నిరంతరం శ్రమించడం తప్ప మరో జీవితం ఎరుగడు. అయినప్పటికి తాను సంపదను సృష్టించుకోలేక పోయాడు. శ్రమించే వారి వద్దకు సంపద చేరుతుందన్నది నిజం కాదని, వారి శ్రమను వెట్టి చాకిరి పేర దొచుకొని సంపన్నులే తమ సంపదను మరింత పెంచుకుంటారన్నది మెజారిటీ పేదల విషయంలో అక్షరాల నిజమని నిరూపించిన కోట్లాది ఉదాహరణల్లో తన జీవితం కూడా కలిపి కాలగర్భంలోకి వెళ్లిపోయాడు.
రైతు కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన తన జీవిత సహచరి, వెట్టిచాకిరి విషపు కోరల నుండి బయటపడి, స్వతంత్రంగా, ఆత్మగౌరంగా బ్రతికే అవకాశాల్ని చూడమని చెప్పిన సలహాలు, కలవారికి చాకిరిచేయడమే తనజీవిత ధర్మం, జీవనోపాధిగా మతం, దైవం పేర ప్రగాఢంగా నమ్మిన తన చెవికి చేరలేకపోయాయి.
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం, శ్రీశైలం నీటిమునకలో పూర్తిగా మునిగి, చరిత్ర చిత్ర పటం నుండి కనుమరుగయిపోయిన కూడవెళ్లి, గ్రామ ప్రజల జీవితాల్ని చెల్లాచెదరు చేసింది. ఆస్థులున్న వారికి కొంత అధిక నష్ట పరిహారం వచ్చింది, ఆస్థులు, సామాజిక బంధాల బలంతో కలవారు మెరుగైన అవకాశాలను వెతుకున్నారు. ఆస్థులు లేనివారు గాసం, ప్రకృతి వనరుల పై ఆధారపడి బ్రతికే మెజారిటి పేదలు, బ్రతుకుతెరువు వెతుక్కుంటు, స్నేహితులు, బంధువులు ఉన్న గ్రామాలకు విసిరివేయబడ్డారు. అలా తాను 10 సంవత్సరాల కాలంలో 3 ప్రాంతాలు మారాడు. చివరికి తాను ఏ రెడ్ల చెంత అయితే గాసం చేశాడో, అదే రెడ్లకు సరికొత్త రూపంలో సేవ చేసేందుకు అలంపూర్ లో చివరికి స్థిరపడ్డాడు. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, ఈ దాస్యపు భూతపు కోరలనుండి తాను పూర్తిగా బయటపడలేక పోయాడు.
మనిషి అనుమతిలేకుండానే మొదులయ్యే జీవితం, ఆరంభంలో ఆమనిషి కన్నవారికి, ఆప్తులకు ఆనందాన్నిస్తుంది. అంతిమంలో ఆమనిషి అనుమతి అక్కరలేకుండా తనదారిన పోతూ, ఆప్తులకు అందమైన జ్ఞాపకాలతోపాటు తీరని విషాదాన్ని, నేర్చుకోవడానికి తగిన పాఠాల్ని మిగిల్చిపోతుంది.
తన అంతిమ ప్రయాణాన్ని ముందే ఊహించి, తనను కాపాడుకునే అవకాశాలను అన్నింటిని ఉపయోగించుకోలేని పిల్లల అసమర్థతపై, నాణ్యమైన వైద్యం అందరికి ఉచితంగా తక్షణం అందించడంలో వ్యవస్థ వైఫల్యాల పై ప్రశ్నలు మిగిల్చి వెళ్లిపోయారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి