23, ఆగస్టు 2020, ఆదివారం

యూట్యూబ్, ఫేస్‌బుక్ మెషీన్ లెర్నింగ్‌తో మిమ్మల్ని ఇలా హైజాక్ చేస్తున్నాయి..!

యూట్యూబ్, ఫేస్‌బుక్ మెషీన్ లెర్నింగ్‌తో మిమ్మల్ని ఇలా హైజాక్ చేస్తున్నాయి..! -------------------- యూట్యూబ్‌లో నీకు ఎలాంటి వీడియోలు చూపించాలో నీకన్నా యూట్యూబ్‌కే బాగా తెలుసు.. స్మార్ట్ టీవీ ఆన్ చేస్తే ఎలాంటి వీడియో కంటెంట్ చూపించాలి అన్నది అదే నిర్ణయిస్తుంది.. అంతెందుకు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నీకు వేలాదిమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎవరెవరి పోస్టులు మాత్రమే చూపించాలి అన్నది ఫేస్బుక్కే నిర్ణయిస్తుంది. ఆల్గారిధమ్స్.. ఇది సాంకేతిక పదం కాదు.. ఇప్పుడు మన జీవితాలను మనవి కాకుండా చేస్తున్న అతి పెద్ద ప్రమాదం! మన జీవితం, మన ఆలోచనలు మన చేతిలో నుండి టెక్నాలజీ చేతిలోకి వెళ్లిపోతున్న ప్రమాదకర పరిణామం. నాకు నచ్చిన కంటెంట్ ఇది భలే చూపిస్తోందే అని చాలామంది సంబరపడిపోతూ ఉంటారు. టెక్నాలజీని తెగ మెచ్చేసుకుంటారు. కానీ తమ ఆలోచనలు, వ్యక్తిత్వం మొత్తాన్ని మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ సమూలంగా మార్చేస్తున్నాయని.. తాము చూసే సెన్సేషనల్ కంటెంట్ మాత్రమే ఇక జీవితాంతం చూపించబడి జీవితం సమాధి అయిపోతోందని అర్థం చేసుకునే పరిపక్వత అతి కొద్దిమందికే ఉంటుంది. ప్రొఫైలింగ్ యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి దాదాపు అన్ని టెక్నాలజీ కంపెనీలు చాలా కాలంగా మెషీన్ లెర్నింగ్ పద్ధతులు అనుసరిస్తున్నాయి. సంబంధిత సర్వీసుల్లో మీరు ఎకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఆలస్యం.. అవి ఎప్పటికప్పుడు నిశితంగా మీరు ఎలాంటి వీడియోలు, పోస్టులు ఎంత సమయం చూస్తున్నారు, ఏ వీడియోలు, పోస్టుల దగ్గర ఆగకుండా ముందుకు కదులుతున్నారు వంటి సమాచారం మొత్తాన్ని "హీట్ మ్యాప్స్" అనే ఏర్పాటు ద్వారా మీకు తెలియకుండానే విశ్లేషిస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మెషీన్ లెర్నింగ్ నిరంతరం మీ ఇష్టాఇష్టాలను గమనిస్తూ మీ గురించి నేర్చుకుంటూ ఉంటుంది. ఇకమీదట సరిగ్గా మీకు నచ్చే కంటెంట్ యూట్యూబ్ రికమండేషన్స్ రూపంలో, ఫేస్‌బుక్ న్యూస్‌ఫీడ్‌లో అదే విధమైన కంటెంట్ మాత్రమే మీకు చూపించబడుతుంది. తప్పేంటి అనుకుంటున్నారా? "నాకు నచ్చిన కంటెంట్ అది చూపిస్తోంది కదా, నా పని మరింత సులువు చేస్తోంది కదా, దాంట్లో తప్పేముంది" అని కొంతమంది భావిస్తూ ఉంటారు. నిజమే మనకు ఎలాంటి కంటెంట్ కావాలో మనం కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన పనిలేకుండా స్క్రీన్ మీద ఏదో ఒక కంటెంట్, అది గతంలో మనం ఇష్టపడిన తరహాది కన్పించడం మనకు చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే, మన బ్రెయిన్‌ని ఇబ్బంది పెట్టడం మనకు ఇష్టం ఉండదు. "నాకు నువ్వు కంటెంట్ వద్దు, వేరే నాకు నచ్చినది నేను వెతుక్కుంటాను" అనే తెగింపు అతి కొద్దిమందిలోనే ఉంటుంది. మిగతా వాళ్లంతా ఒక వీడియో తర్వాత మరొకటి యూట్యూబ్ చూపించిన వీడియోలన్నీ చూసేస్తూ చాలా నేర్చుకున్నాం అన్న భ్రమలో బ్రతికేస్తుంటారు. వ్యక్తిత్వం మారిపోతుంది! సహజంగా సంచలన విషయాల జోలికి వెళ్లకుండా జీవితం పట్ల స్పష్టమైన ఆలోచనలు ఉండి, ప్రొడక్టివ్‌గా బ్రతికే ఆలోచనలు కలిగిన వ్యక్తులు మీరు అనుకుందాం. పొరబాటున చైనాకి, ఇండియాకి మధ్య దశాబ్దాలుగా ఏం జరుగుతోంది అన్న వీడియో మీది యూట్యూబ్‌లో వెదికారు అనుకోండి. అది అనేక వీడియోలు చూపిస్తుంది. మీరు రెండు మూడు వీడియోలు చూస్తారు. అంతటితో ఆ విషయం మీరు మర్చిపోతారు. కానీ యూట్యూబ్ దాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటుంది. ఇక యూట్యూబ్లోకి మీరు ఎప్పుడు వెళ్ళినా ఇండియా, చైనా గురించి విభిన్నమైన వీడియోలు మీ దృష్టికి రికమండేషన్స్ రూపంలో చూపిస్తుంది. గతంలో ఆ సమాచారాన్ని మీరు ఇష్టపడ్డారు కాబట్టి, సహజంగానే మీ మెదడులో దానికి సంబంధించిన ఒక న్యూరల్ నెట్వర్క్ సృష్టించబడి ఉంటుంది కాబట్టి, ఇలా చూపించబడే కొత్త వీడియోలను కూడా మీరు రెండో ఆలోచన లేకుండా చూస్తారు. అంటే ఇక్కడ మీకు తెలియకుండానే మీ ప్రొడక్టివ్ టైం మొత్తాన్ని పక్కన పెట్టి చైనా, ఇండియా అనే అంశం దగ్గర ఇరుక్కుపోయారు. మీరు ఆశావహ దృక్పథం ఉన్న వ్యక్తి అనుకోండి.. గాసిప్స్ చూడడం ఇష్టం లేదు అనుకోండి. పొరపాటున ఏదో ఒక రోజు ఒకటి రెండు వీడియోలను నెగిటివ్ వీడియోలు, గాసిప్స్ వీడియోలు చూశారు అనుకోండి. అప్పటినుండి అలాంటి కంటెంట్ మళ్లీ మళ్లీ చూపించబడుతుంది. దాంతో మెల్లగా మీ వ్యక్తిత్వం మొత్తం "వేరే వాళ్ల జీవితం గురించి మనకెందుకు" అనే మాదిరిగా గతంలో ఉన్నది కాస్తా మారిపోయి, "వాళ్ల జీవితంలో ఏం జరిగింది, వీళ్ల జీవితంలో ఏం జరిగింది" లాంటి గాసిప్ వీడియోలు చూడటం మొదలు పెడతారు. దురదృష్టవశాత్తు దీన్నంతా చాలా జ్ఞానం సంపాదిస్తున్నాం అనే భ్రమలో చూసేస్తుంటారు. యూట్యూబ్ వీడియోలు చేసే వ్యక్తులు వ్యూల కోసం అభూత కల్పనలు చక్కని స్వరంతో చెప్పినా అది నిజమని నమ్మే ఊబిలో కూరుకుపోతాం. సామూహిక హైజాక్ కేవలం ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలు మాత్రమే కాదు.. సామూహికంగా ఒక నగరంలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో అధిక శాతం మంది ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వినియోగదారులు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అన్నది కూడా "ట్రెండింగ్" రూపంలో మన ముందుకు తీసుకు రాబడుతుంది. అంటే సమాజం మొత్తం మంచి విషయాలు పక్కన పెట్టి, కాలక్షేపపు విషయాలు, సంచలనాత్మక విషయాలు చూస్తూ కూర్చున్నారు అనుకుందాం. మీకు అలాంటి కంటెంట్ వద్దు అనుకున్నా తప్పించుకోటానికి లేకుండా అది "ట్రెండింగ్" అనే విభాగంలో మీ దృష్టికి బలవంతంగా తీసుకు రాబడుతుంది. ఒకసారి మీ కళ్లకు అలాంటి సమాచారం వచ్చిన తర్వాత దాన్ని చూడకుండా ఉగ్గబట్టుకోవడం అతి కొద్దిమంది స్థితప్రజ్ఞులకే సాధ్యపడుతుంది. అంటే మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కావచ్చు, సమాజం మొత్తం చేసే బలహీన ఆలోచనలు కావచ్చు.. అవి మీరు తెల్లారి లేచింది మొదలు కొన్ని వందల సార్లు ఓపెన్ చేసే ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి యాప్స్‌లో ప్రతిఫలిస్తుంటాయి. దాంతో వ్యక్తులు తమ ప్రాధాన్యతలు మర్చిపోయి ఇలాంటి అప్లికేషన్స్ చూపించే సమాచారం మాయలో పూర్తిగా మునిగిపోతారు. నష్టం ఏంటంటే? మెషీన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ మనకేం కావాలో అవే నిర్ణయించి మన ఆలోచనలను ప్రభావితం చేయటం, మనకంటూ మనం సొంతంగా ఎప్పటికప్పుడు నిర్ణయించుకునే స్వేచ్ఛను హరించడం వల్ల వ్యక్తుల యొక్క నిర్ణయాత్మక శక్తి సన్నగిల్లుతుంది. తన జీవితానికి ఏమాత్రం ముఖ్యం కాని విషయాన్ని కూడా అతి ముఖ్యమైనదిగా భావిస్తాడు. ఉదాహరణకు "రామ జన్మభూమి" అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది అనుకోండి. రెండు మూడు రోజులపాటు ఆ అంశం తనకు ఏమాత్రం సంబంధం లేనిది అని అతను ఎంత తప్పించుకుని తిరుగుతున్నా ఏదో రూపేణా యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ కన్పిస్తూ ఉంటుంది. దాంతో ఆ అంశం చుట్టూ ఆ వ్యక్తిలో మెదడులో న్యూరాన్ల ఫైరింగ్ జరిగి ఓ న్యూరల్ నెట్వర్క్ సృష్టించబడుతుంది. తనకు అవసరం లేని విషయమైనా అతను కూడా దాని మీద ఒక పోస్ట్ రాస్తాడు. అంటే పరోక్షంగా మన ఆలోచనలు, మన ప్రాధాన్యతలు సోషల్ మీడియా సంస్థలు నిర్ణయిస్తున్నాయి. దీన్ని అడ్డుకోవడం ఎలా? ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టా వంటి యాప్స్ మాయలో పడకుండా ఉండాలంటే ఒక వ్యక్తికి తన మీద తనకు పూర్తిస్థాయి నియంత్రణ అవసరం. కళ్లెదురుగా ఎంత ప్రలోభపూరితమైన సమాచారం చూపించబడుతున్నా దాని జోలికి వెళ్లకుండా ఉండాలి. "కరోనా వచ్చిన వ్యక్తి ఎంత దారుణంగా చచ్చిపోతాడో తెలుసా" అని ఓ భయంకరమైన యూట్యూబ్ థంబ్‌నెయిల్ కన్పిస్తుంది అనుకోండి. మానవ సహజమైన స్వభావంతో దాన్ని చాలామంది రెండో ఆలోచన లేకుండా క్లిక్ చేస్తారు. అది ఆ వీడియో సృష్టించిన వ్యక్తి మనల్ని తన వైపు లాక్కోవడానికి పెట్టిన టైటిల్ అనీ, ఆ అంశం మనకు ఏమాత్రం అవసరం లేనిది, మన ప్రాధాన్యతలు వేరని అప్పటికప్పుడు గుర్తించగలిగే విజ్ఞత చాలా అవసరం. ఈ సెట్టింగ్స్ చేయండి ఈ సోషల్ మీడియా ట్రాప్ నుండి బయటపడాలంటే వెంటనే కొన్ని సెట్టింగ్స్ చేయండి. మీ ఫోన్ లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి, అందులో సెట్టింగ్స్ లో ఉండే "సెర్చ్ హిస్టరీ, వాచ్ హిస్టరీ" అనే వాటిని డిసేబుల్ చేయండి. ఇకమీదట మీకు చాలా వరకు ప్రమాదకరమైన రికమండేషన్స్ నిలిచిపోతాయి. అలాగే యూట్యూబ్ లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, "ఇదేదో ఆసక్తికరంగా ఉందే" అని ఒక వీడియో దగ్గర గానీ, ఫొటో, పోస్ట్ దగ్గర గానీ ఎక్కువ సేపు ఆగకండి. మీ ఫేస్‌బుక్, యూట్యూబ్ యాప్‌లలో పైకి మీ కళ్ళకు కనిపించకుండా "హీట్ మ్యాప్" అనే టెక్నాలజీ ఉపయోగించబడుతుంది. ఇది స్క్రీన్ మీద ఏ ఫొటో, పోస్ట్, వీడియో దగ్గర మీరు ఎక్కువ సేపు ఆగారు అన్నది కూడా రహస్యంగా పరిశీలిస్తూ మీ ఇష్టాలను పసిగట్టడానికి ప్రయత్నిస్తుంది. వీలైనంతవరకూ సంచలనాత్మక అంశాలను ఎట్టి పరిస్థితుల్లో చూడకండి. మీకు కావలసిన కంటెంట్ కోసం మీరే ఎప్పటికప్పుడు సెర్చ్ చేయండి. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో మీకు పైకి కనిపించని మీ జీవితాలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన వీడియోలు, పోస్టులు, ఫాలో కావలసిన వ్యక్తులు కూడా ఉంటారు, వారిని మీకు మీరుగా వెదికి పట్టుకోండి.. మీకేం కావాలో మెషీన్ కాదు నిర్ణయించాల్సింది, మీ ఆలోచనలను, మీరు ఫాలో అవ్వాల్సిన వ్యక్తులను, మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాల్సిన వ్యక్తులను మీకు మీరుగా నిర్ణయించుకునే స్వేచ్ఛ మీరు సాధించండి. స్వాతంత్రం అంటే దేశానికి మాత్రమే కాదు.. ఇలాంటి సోషల్ యాప్స్ మెషీన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ ద్వారా మీకు వేసిన బంధనాల నుండి విముక్తి సాధించడమూ స్వతంత్రమే, అదే నిజమైన స్వేచ్ఛ! - Nallamothu Sridhar (ఆంధ్రజ్యోతి టెక్ గురు కాలమ్)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి