18, అక్టోబర్ 2011, మంగళవారం

55ఏళ్ల వ్యక్తితో 16ఏళ్ల యువతి పెళ్లి ....?

        కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పట్టణంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని బివైనగర్‌కు చెందిన నడిమెట్ల శంకర్‌, రేఖ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు (16), రజిని(8), రాణి(7) ఉన్నారు. శంకర్‌ ఓ దాబాలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. తన పెద్ద కూతురికి పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డాడు. తనకు కట్నం ఇచ్చే స్థోమత లేదని, కట్నం లేకుండా పెళ్లి చేసుకునే వారు ఎవరైనా ముందుకు వస్తే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని బంధువులకు తెలిపాడు.                
            హైదరాబాద్‌లోని పార్సిగుట్టకు చెందిన వడకొండ్ల యాదగిరి(55) ఆర్‌టిసిలో పార్ట్‌టైం స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు 26సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. ఇతనికి ఒక కుమారుడు (23), కూతురు (18) ఉన్నారు. యాదగిరిని వీరు 18సంవత్సరాల క్రితమే వదిలి వెళ్లారు. ఒంటరిగా జీవిస్తున్న యాదగిరి అమ్మాయి పేరు మీద 50వేల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి పెళ్లి చేసుకుంటానని ముందుకు రావడంతో పేద కుటుంబానికి చెందిన ఈ తల్లిదండ్రులు తలొగ్గారు. సోమవారం పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు మహిళా సంఘాల వారు పెళ్లిని అడ్డుకుని, ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడు యాదగిరి, అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ చేసి వదిలిపెట్టారు.
     
పేదరికం కారణంగానే తల్లిదండ్రులు ఈ పెళ్ళికి ఒప్పుకున్నారని సమాచారం.
సామాన్య పేదల జీవనపరిస్థితులు ఏంత దీనంగా వుంటాయి అన్నది ఈలాంటి సంఘటనల సందర్భంగా స్ఫష్టంగా కనబడుతుంది. నేడు చాల మంది పేదలు తిండి తినాలాన్న, బ్రతుకు సాగించాలన్న చాలా దుర్భరంగా, కష్టంగా వుంది.
ప్రజాశక్తి సౌజన్యంతో.. 

1 వ్యాఖ్య: