భగత్‌సింగ్ 23 ఏళ్ళకే దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు. భగత్‌సింగ్ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు. 'ఇంక్విలాబ్-జిందాబాద్' అని వారు ఇచ్చిన నినాదం యావత్ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి.
భగత్‌సింగ్ గొప్ప అధ్యయనశీలి, ఆలోచనాపరుడు. అందుకే విప్లవం, సోషలిజం, దేవుడు, మతం, టెర్రరిజం అనే విషయాలపై స్పష్టంగా తన అభిప్రాయాలను వివరించాడు. సెప్టెంబర్ 28న భగత్‌సింగ్ 107వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఆయన భావాలను ప్రజల ముందుంచడం అవసరం. సమాజ సేవ, సామాజిక న్యాయం, దేశ సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత, సమగ్రత, మానవత్వం, మత సామరస్యం కోసం పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో పెంపొందించాలి.