30, మే 2019, గురువారం

లోక్‌సభ స్థానాల్లో గెలిచిన వారు 88 శాతం కోటీశ్వరులు...

2019 లోక్‌సభ స్థానాల్లో గెలిచిన వారు 88 శాతం కోటీశ్వరులు... 
- గత లోక్‌సభ సభ్యులతో పోలిస్తే 6శాతం పెరుగుదల
- రూ. 10 లక్షలకన్నా తక్కువ ఆస్తి ఉన్నవారు 9 మంది మాత్రమే
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 83 శాతం కోటీశ్వరులు... (ప్రధాన పార్టీలలోనే)
ఇది మన భారత దేశ పరిస్థితి ...
రాజకీయాల్లో అంగబలం, ధనబలం పెరుగుతుందా? డబ్బున్నవారికే పదవులు దక్కుతున్నాయా? గెలవాలంటే కోట్లు ఉండాల్సిందేనన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు. ఎన్నికైన పార్లమెంటు సభ్యుల్లో 475 (88శాతం) మంది కోటీశ్వరులే. 2014 ఎన్నికలతో పోలిస్తే వీరి సంఖ్య 6శాతం పెరిగింది. 2014లో 82శాతం, 2009లో 58శాతం కరోడ్‌పతులు లోక్‌సభలో కొలువుతీరారు. ఎన్నికైన సభ్యుల గణాంకాలను విశ్లేషించిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) ఈ వివరాలను వెల్లడించింది. ఏడీఆర్‌ విశ్లేషణ ప్రకారం.. రూ.10 లక్షల కన్నా తక్కువ ఆస్తి వున్న అభ్యర్థుల విజయం రేటు కేవలం 0.3శాతం (9 మంది ఎంపీలు) మాత్రమే. అలాగే దాదాపు మూడో వంతు (30.1 శాతం) ఎంపీలకు రూ.5 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. 542 లోక్‌సభ లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ 303 సీట్లు, కాంగ్రెస్‌ 52, డీఎంకే 23, టీఎంసీ 22, తృణమూల్‌ కాంగ్రెస్‌ 22, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 22 స్థానాల్లో గెలుపొందాయి.

26, మే 2019, ఆదివారం

తెలంగాణ లో స్పీడు తగ్గిన కారు...

- 9 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు
- 4 చోట్ల బీజేపీ సంచలన విజయం
- 3 స్థానాలు కాంగ్రెస్‌ కైవసం, 
- ఒక స్థానంలో మజ్లిస్‌
- ఓటమిపాలైన కవిత, వినోద్‌ కుమార్‌...
                         సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ సత్తాచాటింది. మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల గెలిచి ఆధిపత్యం చాటుకుంది. డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 సీట్లకు గానూ 88 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తామని టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆశించింది. టీఆర్‌ఎస్‌ 16 స్థానాలు, మిత్రపక్షం మజ్లిస్‌కు ఓ స్థానం కలిపి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలను తామే దక్కించుకుంటామని ప్రకటించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 11 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన టీఆర్‌ఎస్‌ తాజా ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితమైంది.సంఖ్యాపరంగా రెండు స్థానాలను కోల్పోయింది. మూడు సిట్టింగ్‌ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోగా, టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి అందని ద్రాక్షగా ఉన్న నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది.






25, మే 2019, శనివారం

ఆంధ్రప్రదేశ్‌ లో ఫ్యాన్‌ హోరు...

- వైసిపి151
- టిడిపి 23
- జనసేన 1
లోక్‌సభ స్థానాలు :  - వైసిపి 22    - టిడిపి 3
                        ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. శాసనసభతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ ఆ పార్టీ పూర్తిస్థాయిలో ఆధిక్యత సాధించింది. ఫ్యాన్‌ హోరు ధాటికి తెలుగుదేశం పార్టీ బేజారెత్తింది. ఎన్నడూ లేని విధంగా ఘోర ఓటమిని మూటకట్టుకుంది. 175 శాసనసభ స్థానాలకు గానూ, 151 స్థానాల్లో వైసిపి అభ్యర్థులు గెలుపొందగా, 23 స్థానా లకు టిడిపి, జనసేన 1 కి పరిమితమైంది. పులివెందుల నుండి ఎన్నికల బరిలోకి దిగిన వైసిపి అధినేత జగన్మో హన్‌రెడ్డికి 90వేలకు పైగా రికార్డు ఓట్లను సాధించారు. అదేసమయంలో టిడిపికి చెందిన పలువురు సీనియర్‌ నేతలు, మంత్రులు ఓటమి పాలయ్యారు. మంగళగిరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడి కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేష్‌ ఓటమి పాలయ్యారు. 







24, మే 2019, శుక్రవారం

మోడీకే పట్టం...

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి ఆధిక్యొం..
- 348 స్థానాల్లో గెలిచిన ఎన్‌డీఏ
- సొంతంగా 303 చోట్ల బీజేపీ ఘన విజయం
- 86 స్థానాల్లో గెలిచిన యూపీిఏ కూటమి
- 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌
- ఇతర పార్టీలకు 108 స్థానాలు
- తగ్గిన వామపక్షాల బలం
- కేంద్రపాలిత సహా 17 రాష్ట్రాల్లో హస్తానికి నిల్‌
- 3 రాష్ట్రాల్లో ఖాతా తెరవని కమలం
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆర్థిక, సామాజిక, పాలనా రంగాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైనప్పటికీ భావోద్యేగాలను ముందుకు తేవటం ద్వారా మళ్ళీ బీజేపీ గెలిచింది. విఫలమైన విధానాలు, ప్రజా సమస్యలు ఎన్నికల ఎజెండాగా రూపొందకుండా భావోద్వేగాలే ఎజెండాగా మల్చటంలో బీజేపీ సఫలమైంది. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ప్రకటించిన కాంగ్రెస్‌ మరోసారి చతికిలబడింది.








1, మే 2019, బుధవారం

సూచనలొద్దు ...ఆచరించండి...

కాలుష్య నివారణకు చర్యలు తీసుకోండి...
తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు అవసరమని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ధర్మాసనం అభిప్రాయపడింది. అసలు పర్యావరణ కాలుష్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ఎన్జీటీ ప్రశ్నించింది. పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఉద్ఘాటించింది. సోమవారం ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ కాలుష్య నియంత్రణపై విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ ఎస్‌కే జోషితో పాటు పీసీబీ అధికారులు సైతం హాజరయ్యారు.
        తెలంగాణలో అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న విషయంపై ఎన్జీటీ ఘాటుగా స్పందించింది. స్థానిక కలెక్టర్లతో రాష్ట్ర సీఎస్‌, పీసీబీ అధికారులు నెలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. దీనికి స్పందించిన సీఎస్‌ ఇక నుంచి ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. ఆరు నెలల్లో కాలుష్య నియంత్రణ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించింది. మరో ఆరు నెలల తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలను పూర్తిమేర సమీక్షిస్తామని హరిత ట్రిబ్యూనల్‌ ధర్మాసనం విచారణ సందర్భంగా చెప్పింది.