27, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఆ పేరు వింటేనే హృదయాలు ఉత్తేజితమవుతాయి...


భగత్‌సింగ్‌ పేరు వినిపిస్తేనే భారతీయులందరికి హృదయాలు ఉత్తేజితమవుతాయి.
                 దేశంకోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలిన విప్లవవీరుడు భగత్‌సింగ్‌. ఆయన గురించి మాట్లాడుకుంటే తెలియకుండానే మనస్సు ఉద్వేగానికి లోనవుతుంది. భగత్‌సింగ్‌ ఒక విప్లవ స్ఫూర్తి, రగులుతున్న కాగడాల నుండి ఎగిసిపడే చైతన్యపు జ్వాల. ఆయన 1907 సెప్టెంబర్‌ 27 పంజాబ్‌లోని లాయల్‌పూర్‌ జిల్లా బంగా గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు విద్యావతి, కిషన్‌సింగ్‌.
               తన చిన్ననాడే జరిగిన జలియన్‌వాలాబాగ్‌ దురంతం ఆయనను కలిచివేసింది. దానికి కారణమైన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుండి తరిమికొట్టాలంటే విప్లవకారులందరు ఎవరికి వారు పని చేయడం కాదు అందరూ ఏకమై ఐక్యంగా పనిచేసినపుడే సాధ్యమని విప్లవకారులందరినీ ఏకంచేశారు.భారతీయుల కనీస హక్కులు కాలరాసే చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్‌లో పొగబాంబు వేశారు.పార్లమెంట్‌లో పొగబాంబు వేస్తే ఖచ్చితంగా ఉరి తీస్తారని తెలిసి కూడా పారిపోని ధీశాలి. మన స్వాతంత్య్రం కేవలం తెల్లదొరలు పోయి నల్లదొరల పెత్తనం చేసేదిగా ఉండకూడదని, కూడు, గుడ్డ, విద్యా, వైద్యం, ఉపాధి అందరికి కల్పించే ''సమసమాజం'' కావాలని భగత్‌సింగ్‌ ఆకాంక్షించారు.
       నేటి విద్యార్ధి, యువత భగత్‌సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులవటమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
                            ఇంక్విలాబ్‌ జిందాబాద్‌.
నేడు భగత్‌సింగ్‌ 105 వ జయంతి

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

అరుణాక్షరాలతో లిఖించబడిన గొప్ప రోజు...

   ప్రపంచ ప్రజల పోరాటాల చరిత్రలోనే అరుణాక్షరాలతో లిఖించబడిన గొప్ప రోజు...
     సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్న రోజు...
నిజాం రాజు తరతరాల పరమ పైశాచిక పాలనకు,  వెట్టిచాకిరీకి,  దొరల చెరలకు మట్టిమనుషులు లిఖించిన మరణ శాసనం వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాం.  పది లక్షల ఎకరాల భూమి పంపిణీ, 3000 గ్రామాలలో పంచాయితీ ప్రజారాజ్య స్థాపన ..... ఆ పోరాట విజయాలు.  1946 జులై 4న దొడ్డి కొమరయ్య వీర మరణం దానికి నాందీ వాచకం.  వామపక్షాలు సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్నాయి. 


వీరోచిత తెలంగాణ పోరాటంలో  లక్షలాది ప్రజలు పోరా టంలో పాల్గొన్నారు. నాలుగువేల మంది అమ రులయ్యారు. వారి త్యాగాలు వృధా కాలేదు. దాని ప్రాధాన్యత, ఉత్తేజం వెలుగొందుతూనే వుంటాయి. ఆ మహత్తర పోరాటం నిజాం నిరంకుశత్వాన్ని అంతం చేయటానికి సాగింది.  ఆ పోరాటం మొత్తం కమ్యూ నిస్టు పార్టీ ప్రతిష్టనే పెంచింది.  తెలుగు ప్రజలలో విప్లవ సాంప్రదాయాలను ఆ పోరాటం నెలకొల్పింది. పీడనకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే శక్తులకు అది స్ఫూర్తి దాయకం. భారతదేశ ప్రజాస్వామిక విప్లవపథంలో తెలంగాణ పోరాటం ఒక ఉజ్జ్వల ఘట్టం.
          
      వీర తెలంగాణా సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య వ్యవస్థను కుప్పకూలిస్తే నేటి పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల నయా భూస్వాములు తయారవుతున్నారు. కార్పొరేట్‌ సంస్కృతి, రాజకీయ వ్యాపారీకరణ అనే ఈ రెండు శక్తులే ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్నాయి . ఫలితంగా దేశంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోతున్నది . ఈ అంశాలన్నింటికీ వ్యతిరేకంగా భవిష్యత్తులో  జరిపే పోరాటాలకు  తెలంగాణ సాయుధ పోరాటం ఒక పునాదిగా ఉంటుందని బావిద్దాం.  

17, సెప్టెంబర్ 2011, శనివారం

సందిగ్ధంలో పరీక్షలు...

త్రైమాసిక పరీక్షలు ఉన్నయా  లేవా .... 

           రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19 నుంచి 26 వరకూ నిర్వహించబోయే త్రైమాసిక పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు.   దీంతో త్రైమాసిక పరీక్షలు జరుగుతాయా? లేదా అన్న విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకల జనుల సమ్మె ఒకవైపు, ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె మరోవైపు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావడం లేదు. పరీక్షల గురించి  విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా ఇవ్వడం లేదు. స్పష్టమైన ఆదేశాలను కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే విద్యార్థులు, తల్లిదండ్రుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకుండా విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు విద్యాశాఖ అధికారులనూ డైలమాలో పడేసింది.

           ఇంతకుముందే ఈనెల 27 నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకూ దసరా సెలువులూ ప్రకటించింది.    
           వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు  స్పష్టమైన ఆదేశాలను  ఇవ్వలి.

15, సెప్టెంబర్ 2011, గురువారం

అగ్రరాజంలో 4.6 కోట్ల మంది పేదలే...

 ప్రపంచంలోని  అన్ని దేశాల యువత కలల  దేశం అమెరికా.  అన్నింటికీ  అవకాశాల గడ్డ.   కానీ, ఇదంతా పైపైన చక్కెరపూత మాత్రమే.   అమెరికాలోనూ పేదలున్నారు. అక్కడొకరు ఇక్కడొకరు కాదు.. అక్షరాలా నాలుగున్నర కోట్ల మంది తిండికి ముఖం వాచిపోతున్నారు. 'ఇన్‌కం, పావర్టీ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్: 2010' పేరిట అమెరికా సెన్సస్ బ్యూరో విడుదల చేసిన నివేదిక తేల్చిచెబుతున్న విషయమిది. దీని కన్నా 'పెద్దన్న'కు బాగా ఆందోళన కలిగించే అంశమేమిటంటే మూడేళ్లుగా పేదల సంఖ్య ఏటికేడాదీ పెరుగుతూ ఉండటం.

                       అమెరికా సర్కారు లెక్కల ప్ర కారం.. నలుగురు జీవించటానికి ఏడాదికి 22,314 డాలర్ల ( సుమారు రూ.10 లక్షలు) కన్నా తక్కువ సంపాదన ఉన్నా.. లేదా ఒక వ్యక్తి ఆదా యం ఏడాదికి 11,139 డాలర్ల (దాదాపు రూ.5 లక్షలు)కు తగ్గినా దారిద్య్ర రేఖ దిగువన ఉన్నట్టే. అమెరికాలో పేదల సంఖ్య పెరగడానికి రెండు ప్రధానమైన కారణాలున్నాయని నిపుణులు పే ర్కొంటున్నారు. 1 నిరుద్యోగం పెరగటం. 2 ప్రజల ఆదాయం తగ్గ టం.