18, సెప్టెంబర్ 2011, ఆదివారం

అరుణాక్షరాలతో లిఖించబడిన గొప్ప రోజు...

   ప్రపంచ ప్రజల పోరాటాల చరిత్రలోనే అరుణాక్షరాలతో లిఖించబడిన గొప్ప రోజు...
     సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్న రోజు...
నిజాం రాజు తరతరాల పరమ పైశాచిక పాలనకు,  వెట్టిచాకిరీకి,  దొరల చెరలకు మట్టిమనుషులు లిఖించిన మరణ శాసనం వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాం.  పది లక్షల ఎకరాల భూమి పంపిణీ, 3000 గ్రామాలలో పంచాయితీ ప్రజారాజ్య స్థాపన ..... ఆ పోరాట విజయాలు.  1946 జులై 4న దొడ్డి కొమరయ్య వీర మరణం దానికి నాందీ వాచకం.  వామపక్షాలు సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్నాయి. 


వీరోచిత తెలంగాణ పోరాటంలో  లక్షలాది ప్రజలు పోరా టంలో పాల్గొన్నారు. నాలుగువేల మంది అమ రులయ్యారు. వారి త్యాగాలు వృధా కాలేదు. దాని ప్రాధాన్యత, ఉత్తేజం వెలుగొందుతూనే వుంటాయి. ఆ మహత్తర పోరాటం నిజాం నిరంకుశత్వాన్ని అంతం చేయటానికి సాగింది.  ఆ పోరాటం మొత్తం కమ్యూ నిస్టు పార్టీ ప్రతిష్టనే పెంచింది.  తెలుగు ప్రజలలో విప్లవ సాంప్రదాయాలను ఆ పోరాటం నెలకొల్పింది. పీడనకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే శక్తులకు అది స్ఫూర్తి దాయకం. భారతదేశ ప్రజాస్వామిక విప్లవపథంలో తెలంగాణ పోరాటం ఒక ఉజ్జ్వల ఘట్టం.
          
      వీర తెలంగాణా సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య వ్యవస్థను కుప్పకూలిస్తే నేటి పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల నయా భూస్వాములు తయారవుతున్నారు. కార్పొరేట్‌ సంస్కృతి, రాజకీయ వ్యాపారీకరణ అనే ఈ రెండు శక్తులే ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్నాయి . ఫలితంగా దేశంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోతున్నది . ఈ అంశాలన్నింటికీ వ్యతిరేకంగా భవిష్యత్తులో  జరిపే పోరాటాలకు  తెలంగాణ సాయుధ పోరాటం ఒక పునాదిగా ఉంటుందని బావిద్దాం.  

1 కామెంట్‌: