కొండలు, కోనలు,వాగులు, వంకలు, అరుదైన జీవవైవిధ్యం కలసి ఒకే ప్రాంతంలో ఉంటే అదే కుద్రేముఖ్. అలాంటి అసాధారణ పర్వత, అటవీ మార్గంలో హోర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయానికి మేం చేసిన ప్రయాణ విశేషాల గురించి ఈ వారం చెప్పుకుందాం. భారత పశ్చిమ తీర రాష్ట్రం కర్నాటకలో మా యాత్ర మురుదేశ్వర్, ఉడిపి, శృంగేరీ మఠాలను దాటుకుంటూ సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న కుద్రేముఖ్ పర్వత, అటవీ మార్గం ద్వారా ఓ సాహసయాత్రలా సాగింది.
మురుదేశ్వర్, అక్కడి నుంచి 27 కిలోమీటర్ల దూరంలోని కొల్లూరు మీదుగా మరో 160 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కుద్రేముఖ్ నేషనల్ పార్క్ వస్తుంది. ప్రపంచాన్ని లేదా చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టిరావాలన్న కోరిక, తీరిక, బలమైన ఆకాంక్ష ఉన్నవారు తమ జీవితకాలంలో చేసే విహారయాత్రలు ఒక్కోటి ఒక్కో విధమైన అనుభవంగా, అనుభూతిగా మిగిలిపోతాయి. సముద్రతీర ప్రాంతాలలోని క్షేత్రాలు, స్థలాలు ఎక్కడ లేని ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని తీసుకువస్తే, ఎత్తయిన కొండలు, దట్టమైన అడవులు, ఇరుకైన లోయలు, అరుదైన జీవ వైవిధ్యంతో కూడిన ప్రాంతాల పర్యటన పట్టలేని ఆనందాన్ని, ఉత్కంఠను, ఓ సాహస యాత్ర చేశామన్న భావనను తీసుకువస్తాయి. అలాంటి యాత్రగానే చిక్‌మగళూరు జిల్లాలోని కుద్రేముఖ్, హోర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయాలు.
మురుదేశ్వర్, అక్కడి నుంచి 27 కిలోమీటర్ల దూరంలోని కొల్లూరు మీదుగా మరో 160 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కుద్రేముఖ్ నేషనల్ పార్క్ వస్తుంది. ప్రపంచాన్ని లేదా చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టిరావాలన్న కోరిక, తీరిక, బలమైన ఆకాంక్ష ఉన్నవారు తమ జీవితకాలంలో చేసే విహారయాత్రలు ఒక్కోటి ఒక్కో విధమైన అనుభవంగా, అనుభూతిగా మిగిలిపోతాయి. సముద్రతీర ప్రాంతాలలోని క్షేత్రాలు, స్థలాలు ఎక్కడ లేని ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని తీసుకువస్తే, ఎత్తయిన కొండలు, దట్టమైన అడవులు, ఇరుకైన లోయలు, అరుదైన జీవ వైవిధ్యంతో కూడిన ప్రాంతాల పర్యటన పట్టలేని ఆనందాన్ని, ఉత్కంఠను, ఓ సాహస యాత్ర చేశామన్న భావనను తీసుకువస్తాయి. అలాంటి యాత్రగానే చిక్‌మగళూరు జిల్లాలోని కుద్రేముఖ్, హోర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయాలు.
వాస్తవానికి మా కర్నాటక యాత్ర రూట్ మ్యాప్‌లో కుద్రేముఖ్ పర్వత మార్గం లేదు. కొల్లూరు నుంచి షిమోగా మీదుగా హోర్నాడుకు వెళ్లాల్సిన మార్గం గతుకులతో ప్రయాణానికి అంత అనువుగా ఉండదని, కొంచెం దూరం ఎక్కువైనా వేరే మార్గం ద్వారా వెళదామని మా కారు డ్రైవర్ చెప్పడంతో.. సరే పోనీ అంటూ పచ్చ జెండా ఊపామే గానీ, మేం వెళ్లబోయే మార్గం ఎంత ప్రమాదకరమైనదీ, అరుదైనదీ, అసాధారణమైనదో ప్రయాణం పూర్తయ్యే వరకూ మాకు తెలియదు. ఈ మార్గంలో వెళ్లకుంటే ఎంత అరుదైన అవకాశం కోల్పోయే వాళ్లమో మాటల్లో చెప్పాల్సిన పని లేదు. కాకులు దూరని కారడవి లాంటి కుద్రేముఖ్ సంరక్షిత అటవీ మార్గంలో ప్రవేశించబోయే ముందు దాని గొప్పతనమేమిటో ఇక్కడ చెప్పి తీరాలి.
కుద్రేముఖ్ అంటే కన్నడ భాషలో అశ్వ ముఖాకారంతో ఉన్న పర్వతమని అర్థం. మలబారు తీరంలోని పడమటి కనుమల్లో 600 కిలోమీటర్ల మేర, సముద్రమట్టానికి 100 మీటర్ల నుంచి 1892 మీటర్ల ఎత్తులో దట్టమైన అడవులు, నాణ్యమైన ఇనుప ఖనిజం నిల్వలతో ఏర్పడినవే కుద్రేముఖ్ కొండలు. దక్షిణ అమెరికా ఖండంలోని అమెజాన్ అటవీ ప్రాంతం తర్వాత అత్యంత అరుదైన, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జీవ వైవిధ్య సంరక్షిత రిజర్వ్ పార్క్‌గా కుద్రేముఖ్‌కు పేరుంది. ఉడిపి, దక్షిణకన్నడ, చిక్‌మగళూరు జిల్లాలలో విస్తరించిన ఈ కుద్రేముఖ్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ప్రపంచ పులుల సంరక్షణా కేంద్రంగా కూడా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. ఏడాదికి సగటున 700 సెంటీమీటర్ల వర్షపాతంతో ఎన్నో నదులు, కదాంబీ వంటి జలపాతాలకు చిరునామాగా ఉంది. కృష్ణ, కావేరీ ఉపనదులు తుంగ,భద్ర, నేత్రావళి నదుల జన్మస్థానం కూడా కుద్రేముఖ్ కొండలే.
నలబై రకాల వన్య ప్రాణులు, 120 రకాల మొక్కలు, పూలు, వృక్ష జాతులతో కూడిన అరుదైన జీవవైవిధ్యానికి నిలయంగా ఈ ప్రాంతం గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడి కొండల్లో మేలు రకం ఇనుప ఖనిజం నిల్వలు ఉండడంతో 1987లో కుద్రేముఖ్ ఐరన్ ఓర్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ముడి ఇనుప ఖనిజాన్ని పెల్లెట్లుగా మార్చి మంగళూరు పోర్ట్ ద్వారా చైనా, ఇరాన్, జపాన్, తైవాన్ దేశాలకు ఎగుమతి చేసేవారు. అయితే స్టీల్ ప్లాంట్ పేరుతో కుద్రేముఖ్ కొండలను విచక్షణా రహితంగా తవ్వేస్తూ రావడంతో పర్యావరణానికి, అరుదైన జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లింది. దీంతో పాతికేళ్ల కాంట్రాక్టు ఆ తర్వాత పొడిగించకపోవడంతో ఈ ప్లాంట్‌కు శాశ్వతంగా తెరపడింది. పర్యావరణ ప్రేమికుల రాజీ లేని పోరాటం, న్యాయ స్థానాలు సకాలంలో జోక్యం చేసుకోవడంతో కుద్రేముఖ్ ప్రాంతం తన అస్థిత్వాన్ని కాపాడుకోగలిగింది.కర్నాటక రాష్ట్ర అటవీ శాఖ ఆధీనంలోని ఈ అరణ్య మార్గంలోకి కార్లు లేదా ఇతర వాహనాలు ప్రవేశించాలంటే ముందుగా చెక్‌పోస్ట్ అధికారులు ఇచ్చే నిర్ణీత సమయ అనుమతి పత్రాలు తప్పనిసరి. ఈ ఉచిత అనుమతి పత్రాలతో నిర్దేశించిన గడువులోనే ప్రయాణం చేయాలి.
కాఫీ, టీ తోటలతో కళకళ..
కొల్లూరు మూకాంబిక రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కుద్రేముఖ్ వన్య మృగ సంరక్షణ కేంద్రంలో ఐదు గంటల పాటు 160 కిలోమీటర్ల ప్రయాణం అత్యంత ప్రమాదకరమైన పచ్చిక తివాచీ పైన సాగినట్లే అనిపించింది. దట్టమైన అడవులు, నిలువెత్తున పెరిగిన నల్లమద్ది, టేకు వంటి మహావృక్షాలు, పోక, రబ్బరు చెట్లు, అనాస, అరటి, పనస, కాఫీ, టీ తోటలతో కూడిన కుద్రేముఖ్ పర్వతమార్గంలో ప్రయాణం జీవితకాల అనుభవం. బద్దకంగా పడుకున్న కొండచిలువను తలపించే మెలికలు తిరిగిన రోడ్డులో ప్రయాణం ఒక్కోసారి భయాన్ని, మరోసారి సంభ్రమాశ్చర్యాన్ని కలిగిస్తుంది. సముద్రమట్టానికి వందమీటర్ల ఎత్తు నుంచి దాదాపు 1900 మీటర్ల ఎత్తులోకి ప్రయాణం చేయడం, మళ్లీ కిందకు దిగి రావటం, జెయింట్‌వీల్ ఎక్కి కిందికి దిగుతున్న అనుభూతిని కలిగిస్తుంది.
అన్నపూర్ణ లోగిలిలో..
కారులో ఐదు గంటల ప్రయాణం అప్పుడే ముగిసిపోయిందా అనుకునేలోగా ఉడిపి జిల్లాలోని మూకాంబికా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి చిక్‌మగళూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హోర్నాడు అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయం చేరాం. నింగిని తాకుతున్నాయా అన్నంతగా పెరిగిన పోక, టేకు చెట్లతో నిండిన కొండల మధ్య ఉన్న మారుమూల గ్రామమే హోర్నాడు. ఇక్కడి ఆలయంలోని అన్నపూర్ణేశ్వరీ స్వర్ణ విగ్రహాన్ని కంచి పరమాచార్యులు ప్రతిష్టించారు. దక్షిణ రాష్ట్రాల నలుమూలల నుంచి ఇక్కడికి యాత్రీకులు, పర్యాటకులు రావటం ఈ మధ్యనే బాగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్లి కానుకలుగా, ముడుపులుగా ధనాన్ని, బంగారు నగలను మాత్రమే చెల్లించుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం ఆహారధాన్యాలు, ఉప్పు,పప్పులు సమర్పించుకోవడం విశేషం. వజ్రవైఢూర్యాలు కూర్చి మేలిమి బంగారంతో అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని రూపొందించారు. దేవీదర్శనం ముగిసిన తర్వాత 20 రూపాయలు చెల్లిస్తే బియ్యం కూపను ఇస్తారు. ఆ కూపన్ తీసుకుని దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మరో కౌంటర్లో బియ్యం ఇస్తారు. ఆ బియ్యాన్ని అక్కడ సమర్పించుకోవడం ద్వారా మొక్కు తీర్చుకుంటారు. హోర్నాడు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు, వ్యవసాయదారులు సైతం తమ పొలాలలో పండిన పంటలో కొంత భాగాన్ని ఇక్కడ సమర్పించుకుంటారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం దేవస్థాన సత్రంలో గదులు నామమాత్ర ధరలకే ఇస్తారు. ఇక దేవాలయంలో భక్తుల కోసం రోజుకు రెండుపూటలా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలోని ఈ మారుమూల కొండ ప్రాంతానికి మంగళూరు, ఉడిపి, శృంగేరీ, ఇతర ప్రధాన నగరాల నుంచి నిర్ణీత సమయాలలో మాత్రమే బస్సు సదుపాయం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే హోర్నాడు యాత్ర వ్యయప్రయాసలతో కూడుకున్నదే.
హోర్నాడు చుట్టుపక్కల కొండ ప్రాంతాలలో కాఫీ, తేయాకును విరివిగా సాగు చేస్తున్నారు. మార్గమధ్యంలో ఉన్న తేయాకు తోటలను మన భద్రాచలం పేపర్‌బోర్డ్‌కు చెందిన ఐటిసి సంస్థే నిర్వహిస్తోంది. టీ తోటల ఎదురుగానే ఏర్పాటు చేసిన ఓ స్టాల్ ద్వారా తమ తోటల్లో సాగు చేసిన ఉత్పత్తులతో పాటు అడవుల ద్వారా సేకరించిన తేనెను సైతం విక్రయిస్తున్నారు. హోర్నాడు తేయాకు తోటల్లో పండిన టీ నాణ్యతను పరీక్షించాలనుకునేవారికి వేడి వేడి తేనీరు సైతం ఈ విక్రయశాలలోనే అందిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు.
( ప్రజాశక్తి పత్రిక సౌజన్యం తో... )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి