కోల్‌కతాలో కమనీయ ప్రాంతాలు
మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం కోలకతా.1711 నుంచి రెండు శతాబ్దాల పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కోల్‌కతా రాజధానిగా భారత్‌ను పరిపాలించారు.1911లో రాజధాని న్యూఢిల్లీకి మారింది. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ నగరంలో దర్శనీయ ప్రాంతాలెన్నో. వాటిలో 90 శాతం బ్రిటిష్ వారు నిర్మించినవేనంటే ఆశ్చర్యం వేస్తుంది. అతి ముఖ్యమైన ఏడు ప్రదేశాల విశేషాలు ఈ వారం మీ కోసం.
హౌరా వారధి
కోల్‌కతా, హౌరా జంట నగరాలు. ఆ రెండు నగరాల మధ్య హూగ్లీ నది ప్రవహిస్తుంది. ఈ జంట నగరాలను కలపడానికి బ్రిటిషర్లు హౌరా వారధి నిర్మించారు. నగరానికి జీవనాడి వంటిది ఈ వారధి. వంతెన పని 1935లో ప్రారంభిస్తే 1939లో నిర్మాణం పూర్తయింది.1943లో ఈ వారధిపై ట్రాఫిక్‌ను అనుమతించారు. 705 మీటర్ల పొడవు, 71 అడుగుల వెడల్పు ఉన్న ఈ వంతెన నిర్మాణానికి ఆ రోజుల్లోనే రూ.333 కోట్లు ఖర్చయింది. 26,500 టన్నుల స్టీలుతో దీన్ని నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంలో నట్లు, బోల్టులు వాడలేదంటే నమ్మగలరా? క్యాంటీ లీవర్ ట్రస్ పద్దతిలో దీన్ని నిర్మించారు. గత 70 ఏళ్లుగా కోల్‌కతా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా సేవలందిస్తోంది. ఈ వంతెన అందాన్ని కెమెరాల్లో బంధించాలంటే హుగ్లీనది మధ్యలో నుంచి ఫొటో తీస్తే సరి.
విక్టోరియా మెమోరియల్
బ్రిటిష్ రాణి విక్టోరియా స్మారకంగా విక్టోరియా మెమోరియల్ హాల్‌ను నిర్మించారు. ఈ భవనం బ్రిటిష్, మొఘల్ నిర్మాణ శైలుల కలయికతో ఎంతో అందంగా ఉంటుంది. తెల్లని మకరానా పాలరాతితో ఈ భవనాన్ని నిర్మించారు. 1906లో నిర్మాణం ప్రారంభిస్తే 1921లో పూర్తయింది. 64 ఎకరాల్లో విరబూసిన పూదోటల మధ్య ఈ రాజ భవనం అలరారుతుంటుంది. ఈ భవనంలో విక్టోరియా రాణికి చెందిన వస్తువులు, అప్పటి బ్రిటిష్ పాలనలోని విశేషాలతో కూడిన ఓ మ్యూజియం కూడా ఉంది.
మహా మర్రి చెట్టు
ఆచార్య జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్‌లో 250 ఏళ్ల మహా మర్రి చెట్టు ఉంది. విస్తీర్ణంలో ప్రపంచంలోనే వెడల్పయిన చెట్టుగా ఇది రికార్డులకెక్కింది. పిడుగు పడడంతో ఈ చెట్టు కాండం బాగా దెబ్బ తింది. దాంతో 1925లో ఆ ప్రధాన కాండాన్ని తొలగించారు. మిగిలిన ఊడలు నేల వరకూ వచ్చి వేళ్లూనాయి. ప్రధాన కాండం లేని ఆ చెట్టు చుట్టూ 330 మీటర్ల రోడ్డు నిర్మించారు. అయితే ఆ రోడ్డును కూడా దాటి వ్యాపిస్తోంది ఈ మహామర్రి. మనం బయటినుండి చూస్తే ఓ అడవిలా కనిపిస్తుంది కానీ అదంతా ఒకే చెట్టనిపించదు. 19 వ శతాబ్దపు యాత్రా పుస్తకాల్లో ఈ చెట్టును గురించి ప్రస్తావించారు.
ఈడెన్ గార్డెన్ స్టేడియం
మన దేశంలోనే మొదటి క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్. అంతేకాదు! ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన స్టేడియంలలో ఒకటిగా పేరుగాంచింది. 1840లో దీన్ని నిర్మించారు. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఆక్‌లాండ్ సోదరి పేరు దీనికి పెట్టారు. ఇక్కడ మొదటి మ్యాచ్ 1917లో జరిగింది. మొదటి టెస్ట్ మ్యాచ్ 1934లో జరిగింది. మొదటి వన్డే మ్యాచ్ 1987లో జరిగింది. గత శతాబ్ద కాలంగా ఈ స్టేడియంను ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ స్టేడియంలో లక్ష మంది కూర్చుని తమ అభిమాన క్రీడను వీక్షించే వీలుంది.
కుమార్‌తులి
ఉత్తర కోల్‌కతాలో ఉన్న కుమ్మరుల కాలనీ కుమార్‌తులి. ఇక్కడ ప్రతిమలు తయారు చేసే వారిని కుమార్ అని పిలుస్తారు. వీరు మూడు శతాబ్దాలుగా ఇక్కడ నివశిస్తున్నారు. మొదట్లో అంతగా ప్రాచుర్యం లేని ఈ కళాకారులు తమ కళాత్మక విగ్రహాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.ఇక్కడ తయారయ్యే దుర్గ ప్రతిమలు దసరా సందర్భంగా 90 దేశాలకు ఎగుమతి అవుతాయి. ఈ కాలనీలోని 200 వర్క్‌షాపుల్లో వీటిని తయారు చేస్తారు.
సెయింట్ పాల్ కెతెడ్రల్
నియో గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన సెయింట్ పాల్ కెతెడ్రల్ చర్చి అద్భుతంగా వుంటుంది. ప్రపంచ వారసత్వ కట్టడంగా కూదా ఇది గుర్తింపు పొందింది. 1839లో బిషప్ డేనియల్ విల్సన్ ఈ చర్చి నిర్మాణం ప్రారంభించగా 1847లో పూర్తయింది. అప్పట్లో భారత్‌ను పాలిస్తున్న బ్రిటిష్‌వారు ఈ చర్చిని ఎంతగానో అభిమానించేవారు. స్టెయిన్డ్ గ్లాస్‌తో చేసిన పెద్ద కిటికీ ఎంతో అందంగా ఉంటుంది. చర్చి గోడలపై ఫ్లోరెంటైన్ పెయింటింగ్‌లు ఈ చర్చి ప్రత్యేకత. చర్చిలో ఉండే బెంచీలు, కుర్చీలు కూడా అందంగా చెక్కబడి ఉంటాయి.247 అడుగుల పొడవు, 81 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ చర్చి హాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చర్చి గోపురం 201 అడుగుల ఎత్తు ఉంది.చుట్టూ విశాలమైన పచ్చిక బయళ్లు, భారీ వృక్షాలు, అందమైన పార్కులతో చర్చి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
విద్యాసాగర్ సేతు
హౌరా, కోల్‌కతా నగరాలను కలిపేందుకు హూగ్లీ నదిపై నిర్మించిన మరో వంతెన 'విద్యా సాగర్ సేతు'. దీన్ని గోల్డెన్ గేట్ బ్రిడ్జి తరహాలో నిర్మించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఇంజినీరింగ్ అద్భుతం ఈ వంతెన. 1969లో ప్రారంభిస్తే 1992లో నిర్మాణం పూర్తయింది. ఆ రోజుల్లోనే రూ.400 కోట్లు ఖర్చయ్యాయి. దీనిపై ప్రయాణించడానికి సుంకం వసూలు చేస్తారు. ప్రపంచంలో కేబుళ్లతో నిర్మించిన అతి పెద్ద వంతెనల్లో ఇది మూడో స్థానంలో ఉంది. 121 కెేబుల్ వైర్లు, నాలుగు స్థంభాలే ఈ వంతెన ఆధారం. ఈ స్థంభాల పునాదులు 100 మీటర్ల లోతులో భారీగా నిర్మించారు.823 మీటర్ల పొడవు, 35 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ భారీ వంతెనపై 9 వరుసల్లో వాహనాలు ప్రయాణిస్తాయి. రోజుకు 85 వేల వాహనాలు ప్రయాణించినా తట్టుకోగల సామర్ధ్యం ఈ వంతెనకుంది.
( ప్రజాశక్తి పత్రిక సౌజన్యం తో... )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి