19, జులై 2011, మంగళవారం

పేదల నెత్తిన పిడుగు...ఆధార్‌?

పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇచ్చే ఆధార్‌ కార్డులు కేంద్రం, ప్రణాళికా సంఘం చేపడుతున్న చర్యలు భవిష్యత్తులో పేదలను నిరాధారులుగా మార్చనున్నాయి. సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి చేయాలన్న నిర్ణయం వెనుక సబ్సిడీలను కుదించే కుట్ర దాగుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జారీ చేస్తున్న ఆధార్‌ కార్డు ప్రజలకు ముఖ్యంగా పేదలకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగ పడుతుందని యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ అధినేత నందన్‌ నిలేకని చెపుతున్నారు. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లు ప్రభుత్వ పథకాల్లో లీకేజీలు, అవినీతి, అక్రమాల నిరోధం అన్నింటికీ ఆధార్‌ కార్డే ఏకైక అస్త్రమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. నిలేకని చెప్పినట్లు పేదలకు ఆధార్‌ కార్డులు ఉపయోగ పడతాయన్న గ్యారంటీ అయితే లేదు. కాని వారికి అందుతున్న సబ్సిడీలను కోయడానికి సర్కార్‌కు ఆధార్‌ కార్డు కత్తెరలా పనికొస్తుంది. బ్యాంక్‌ అక్కౌంట్‌, రేషన్‌ పొందడానికి సైతం గుర్తింపు పత్రాల్లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు,  వారి సమస్యలను తీర్చడానికే ఆధార్‌ కార్డులిస్తున్నాం అని గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ప్రధాని మన్మోహన్‌ వక్కాణించారు. ప్రభుత్వ పథకాలను అనర్హులు అనుభవిస్తున్నారని, సబ్సిడీలను అర్హులకు చేర్చడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. సబ్సిడీలు అర్హులకు అందాలన్న విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు. అనర్హులను ఏరివేసే పేరుతో అర్హులను పథకాలకు దూరం చేస్తేనే సమస్య. నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న మన్మోహన్‌ సర్కార్‌ ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలకు ఏ విధంగా కోత పెట్టాలా అన్న రంధిలో ఉంది. నగదు బదిలీ వంటి వాటిని తెరమీదికి తెచ్చింది. ఎప్పుడు ఏ మార్గంలో సబ్సిడీలకు కోత పెడుతుందో తెలీక ప్రజలు ఆందోళన చెందుతున్నరు.  వారి నెత్తిన పడటానికి ఆధార్‌ పిడుగు సిద్ధంగా ఉంది.
ఇటువంటి కార్డులను కేవలం వ్యక్తి గుర్తింపునకే వినియోగించాలని, అదీ వ్యక్తి అనుమతిస్తేనే సమాచారం తీసుకోవాలని అమెరికాలో చట్టం చేశారు. బ్రిటన్‌లో బ్లెయిర్‌ ప్రభుత్వం 2004లో యునిక్‌ కార్డులను ప్రవేశపెట్టగా వాటికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు ఐదేళ్లపాటు పోరాడారు. ఇటీవల అధికారంలోకొచ్చిన కెమరాన్‌ సర్కార్‌ కార్డులను రద్దు చేసింది.
 
రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌కు ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ప్రణాళికా సంఘం చేసిన సూచన ఉచిత విద్యుత్‌ పొందుతున్న రైతులను తగ్గించడానికేనని వేరే చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో తొలి దశ ఆధార్‌ కార్డుల పంపిణీ నత్తనడకన సాగుతోంది. కాంట్రాక్టర్లపై ఆరోపణలు రావడంతో కొత్త కాంట్రాక్టర్లను తీసుకున్నారు. లక్షల కార్డుల జాడ లేకపోగా, ఐదు లక్షల కార్డులు బట్వాడా కాక మూలుగుతున్నాయి. గతంలో బోగస్‌ రేషన్‌ కార్డుల నిరోధానికి వినియోగించిన ఐరిస్‌ పరిజ్ఞానం విఫలమైంది. రూ.200 కోట్లు వృథా అయ్యాయి. ఇప్పుడు ఆధార్‌కు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కంప్యూటర్లు, ఆ పరిజ్ఞానం ఉపయోగించే సంస్థలకు ప్రజాధనం మళ్లుతుంది తప్ప జనానికి మేలు లేదు. ఆధార్‌ కార్డును వ్యక్తి గుర్తింపునకు ఉపయోగిస్తే ఇబ్బంది లేదు. లబ్ది, సేవలు, హక్కులకు లింక్‌ పెడితేనే సమస్య. ఆధార్‌ ప్రక్రియ పూర్తయితే రానున్న రోజుల్లో సమాచారం పొందడానికి యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తారు. అదే జరిగితే ప్రైవేటు సంస్థలకు ఆధార్‌ ఆదాయ వనరు అవుతుంది, ప్రజల జేబులకు చిల్లులు పడతాయి. అంతేకాదు ప్రజలకు అక్రమ హ్యాకింగ్‌లు, మానవ హక్కుల ఉల్లంఘన, సైబర్‌ నేరాల ప్రమాదం పొంచి ఉన్నాయి. 
( ప్రజాశక్తి పత్రిక సహాకరం తో.....  )    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి