నిండు పున్నమి... పండువెన్నెల... అంతలోనే మహాద్భుతం. వెన్నెల మటుమాయం అవుతుంది. ఆకాశమంతటా గాఢాంధకారం అలముకుంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం చేసే తమాషా ఇది. ఆకాశంలో అద్భుతాలను ఆసక్తిగా తిలకించే ఖగోళప్రియులకు నేడే ( బుధవారం) పండగే. ఈ శతాబ్దిలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఖగోళప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి అరుదైన, సుదీర్ఘ సమయం ఉండే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మళ్లీ చూడాలంటే 130 ఏళ్లు ఆగాల్సిందే!
చంద్రగ్రహణం పట్టినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాకూడదన్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని బిర్లా సైన్స్ ఆడిటోరియం(హైదరాబాద్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలాంటి అనుమానాలూ లేకుండా... చంద్ర గ్రహణాన్ని ప్రతిఒక్కరూ చూడొచ్చని అంటున్నారు.
భారత స్థానిక కాలమానం ప్రకారం జూన్ 15 రాత్రి 11:52:26 గంటలకు గ్రహణం మొదలవుతుంది. చంద్రుడు పూర్తిగా అదృశ్యమయ్యేది: అర్ధరాత్రి 12:52:30 నుంచి 02:32:42గంటల నడుమ చంద్రుడు భూమి నీడలో పూర్తిగా అదృశ్యమవుతాడు. జూన్ 16 తెల్లవారుజామున 02:32:42 గంటల నుంచి మళ్లీ పాక్షికంగా కనిపించడం మొదలై 03:32:15గంటలకు గ్రహణం ముగుస్తుంది. మనదేశం అంతటా కనిపిస్తుంది.
నాసా లెక్కల ప్రకారం 2011లో నాలుగు పాక్షిక సూర్య గ్రహణాలు, రెండు సంపూర్ణ చంద్రగ్రహణాలు సంభవిస్తున్నాయి. ఇలా జరగడం చాలా అరుదు. 21 శతాబ్దం మొత్తమ్మీదా ఈ ఏడాది కాకుండా మరో ఐదు సార్లు మాత్రమే ఇలా జరగనుంది. ఆ సంవత్సరాలు... 2029, 2047, 2065, 2076, 2094. ఇంతటి అరుదైన, సుదీర్ఘ సమయం ఉండే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మళ్లీ చూడాలంటే 130 ఏళ్లు ఆగాల్సిందే!
గ్రహణం నేపథ్యంలో... ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించేందుకు మన వంతు కృషి చేద్దాం.
( పత్రికల సహకారంతో ...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి