5, జూన్ 2011, ఆదివారం

మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది....

 మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది.  వాతావరణ సమతుల్యం కోల్పోయి ఓజోన్‌పొర దెబ్బతినడం వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  దీంతో క్యాన్సర్, చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.  ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి ఆవరణలో చెట్లను నాటాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి, వాహన కాలుష్యం తగ్గించాలి.  పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం  మనందరి మీద ఉంది.
               ఒకరికి ఒకరు  తోడైతే మన పర్యావరణాన్ని ఈ కాలుష్య భూతానికి బలికాకుండా కాపాడగలుగుతాం. మన కాలనీలలో, మనం వుండే గృహ సముదాయాలలో ఈ విషయం పై అవగాహన కల్పించి ఈ సత్కార్యానికి చేయూతనిస్తే మన భూమిని మరుభూమి కాకుండా చూడగలుగుతాం.
            అందుకే రండి.. ఆ ఆనందం లో మనమూ పాలుపంచుకొని, మనవంతు పని మనం చేసి మన తరువాతి తరాలకు పచ్చని పర్యావరణాన్ని శోభాయమానంగా అందిద్దాం..!

                 నేడు మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై... పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం... అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. అంతేగాకుండా, మానవుడు తన వేగవంతమైన జీవితంలో వాహనవేగం పెంచుతూ.. ఇంధన కొరతకు కారణమవుతున్నాడు. కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌ వంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జలవనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది.

               కాబట్టి పిల్లలూ.. పెద్దలు   ప్రకృతి వనరులను నాశనం చేసుకుంటే, ముందు ముందు జీవకోటికి మనుగడ లేకుండా పోతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకోవాలి. దీనికి పర్వావరణ పరిరక్షణ ఒక్కటే నివారణ మార్గమని ఐక్యరాజ్యసమితి కూడా నినదిస్తోంది. అందులో భాగమే.. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటించటం.. ఏమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఓ సమస్యగా పరిణమించిన వాతావరణ కాలుష్యాన్ని నివారించే క్రమంలో మానవులంతా బాధ్యతాయుతమైన పాత్రను పోషించాల్సిన సమయం ఆసన్నమైంది.

               మన  వంతుగా జూన్‌ 5వ తేదీన ఒక మొక్కను నాటండి...! 
మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది.
( ప్రజాశక్తి, ఇతర పత్రికల  సహకారంతో ...)

2 కామెంట్‌లు: