22, ఏప్రిల్ 2011, శుక్రవారం

బెంగాల్‌ కేరళల్లో విజయం దేశంలో వామపక్షాలకు కీలకం...ప్రకాశ్‌ కరత్‌

               అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి అంచనా వేయాల్సివస్తే బెంగాల్‌, కేరళ రాష్ట్రాలు దేశంలో వామపక్షాలకు చాలా ముఖ్యమైనవని ఈ రెండు రాష్ట్రాల్లో వామపక్షాల విజయం దేశ వ్యాపితంగా వామపక్ష, ప్రజాతంత్ర, ప్రత్యామ్నాయం కోసం లెఫ్ట్‌ సాగిస్తున్న నిరంతర పోరాటాలకు మరింత ఊపునిచ్చేందుకు తోడ్పడతాయని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ చెప్పారు.
            తమిళనాడు ఎన్నికల ఫలితాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుచేతనంటే ఇవి నయా ఉదారవాద - అవినీతి మధ్య అపవిత్ర పొత్తుకు నేరుగా తగిలే పెద్ద ఎదురు దెబ్బ కానుంది. అవినీతి- ఉదారవాద కలయికకు మొత్తంగా యుపిఏ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్నది.  కాబట్టి తమిళనాడు ఫలితాలు జాతీయ స్థాయిలో కూడా పెద్ద ప్రభావాన్నే చూపనున్నాయి.

               అవినీతి, ద్రవ్యోల్బణం ఇవి రెండూ జాతీయ స్థాయిలో ప్రధాన అంశాలు.  కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం వరుస కుంభకోణాల్లో మునిగి తేలుతుంటే, ఇంకోవైపు కేరళలో యుడిఎఫ్‌ను గతంలో చేసిన అవినీతి, తప్పుడు పనులు నీడలా దానిని వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు యుడిఎఫ్‌కు చెందిన మాజీ మంత్రికి ఒకరికి అవినీతి కేసులో సుప్రీం కోర్టు ఒక సంవత్సర జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై ప్రస్తుత ముఖ్యమంత్రి సుప్రీం కోర్టుకు అప్పీలు చేసి గట్టిగా పోరాడారు.
 
                అధిక ధరలు, అవినీతి  దేశ వ్యాపిత ప్రభావం చూపగల అంశాలు కనుక పశ్చిమ బెంగాల్‌ లోనూ ఇవి ప్రభావం చూపుతాయి. అవినీతి గురించి మరీ ముఖ్యంగా స్వతంత్ర భారతంలోనే అతి పెద్దదైన 2జి- స్పెక్ట్రమ్‌ కుంభకోణం బయటపడ్డాక ప్రజలు దీనిపట్ల చాలా మెలకువగా వున్నారు.  గడచిన అయిదేళ్లలో అది అనేక ముఖ్యమైన చర్యలు చేపట్టింది. ఈ కాలంలో 20 వేల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు పునః పంపిణీ చేసింది. అఖిలభారత స్థాయిలో వ్యవసాయ వృద్ధి రేటులో స్తబ్ధత నెలకొన్న స్థితిలో బెంగాల్‌ నికరమైన వృద్ధిరేటు సాధించింది. వ్యవసాయోత్పత్తి లో పెరుగుదల జాతీయ సగటు కన్నా చాలా అధికంగా ఉన్నది. రెండవది, లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం అధిక ధరల మూలంగా ప్రజలకు ఎదురైన కడగండ్లను తొలగించేందుకు పలు చర్యలు చేపట్టింది. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఇందులో అతి ముఖ్యమైనది. మూసివేసిన ఫ్యాక్టరీలలో కార్మికులకు నెలకు రు.1500 అలవెన్సు ఇచ్చే ఏర్పాటు చేసింది. అసంఘటిత రంగ కార్మికులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ సదుపాయాన్ని కల్పించింది.  కేంద్ర ప్రభుత్వ విధానాల దుష్ప్రభావాల నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రతి సందర్భంలోనూ లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో వీటిని హైలైట్‌ చేస్తాము.
          బెంగాల్‌లో వామపక్షాలు ఒక బలమైన శక్తిగా ఉన్నాయి. వామపక్షాలను తొలగించాలని అనుకున్నప్పుడల్లా తృణమూల్‌ మావోయిస్టులతో చేతులు కలిపింది. ఏ కారణం చేతనో కానీ కొందరు మేధావుల్లో కూడా ఇటువంటి కలయికే జరిగింది. ఇటువంటి వారే మమతా బెనర్జీని విప్లవ రాజకీయవేత్తగా చిత్రిస్తున్నారు. మార్పు కోసం అన్ననినాదం కూడా క్షణభంగురం పాటు ఉండేదే. చివరికి ఈ మితవాద శక్తుల, మేధావుల, వారి సూత్రీకరణల అసలు బండారం బయటపడక మానదు.
( గూగ్ల్స్ ఇమేజ్స్,  పత్రిక ల సహకరం తొ.....)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి