కిరణం - వీరయ్య కె
30, అక్టోబర్ 2021, శనివారం
దీపాలతోనే దీపావళి జరుపుకుందాం...
12, ఏప్రిల్ 2021, సోమవారం
శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ
కరోనా మీద విజయం సాధించాలని ...
షడ్రుచుల ఉగాదితో ఇంటింటా ఆయురారోగ్యాలు,
సిరిసంపదలు, ఆనందాలు నిండాలని...
మీకు, మీ కుటుంబ సభ్యులకు
తెలుగు నూతన సంవత్సర మరియు
శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...
21, మార్చి 2021, ఆదివారం
ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రాజధానుల్లో ఢిల్లీకి అగ్రస్థానం దక్కింది.
... ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రాజధానుల్లో ఢిల్లీకి అగ్రస్థానం దక్కింది.
... ప్రపంచంలో 30 అత్యంత కాలుష్య నగరాల్లో 22 భారత్‌లో ఉన్నాయి.
ప్రపంచంలో కాలుష్య దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉన్నాయి. 30 అత్యంత కాలుష్య నగరాల్లో జిన్జియాంగ్ (చైనా) మొదటిస్థానంలో ఉంది. భారత్‌కు చెందిన ఘజియాబాద్, బులేందషహర్, బిసరాఖ జలాల్పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, బివారీ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
20, డిసెంబర్ 2020, ఆదివారం
ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయ్యాలని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకోవాలని మాజీ కేంద్ర సమాచార కమీషనర్ శ్రీ మాడబూషి శ్రీధర్ గారు పిలుపునిచ్చారు.
ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయ్యాలని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకోవాలని మాజీ కేంద్ర సమాచార కమీషనర్ శ్రీ మాడబూషి శ్రీధర్ గారు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మానవ సంఘీవ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో బ్లడ్ డోనర్స్ క్లబ్ ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు (20.12.20) ప్రారంభించబడింది. ప్రారంభోత్సవంలో డాక్టర్ ప్రసాదరావు గారు లోగోను, శ్రీ మాడభూషి శ్రీధర్ గారు పోస్టర్‌ను, డా|| మోహన్ రెడ్డి గారు ప్రచార స్టిక్కర్‌ను, శ్రీ జి. కిరణ్‌రెడ్డి గారు డోనర్ దరఖాస్తు ఫారమ్‌ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో డా|| జయసూర్య, బిఎన్ సుదర్శన్, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు టిఎన్‌వి రమణ, వీరయ్య, ఎం.శ్రీనివాస్‌రావు, నాగేశ్వర్రావు, పి.శ్రీనివాస్‌రావు, నాగేష్, శ్రీవల్లి, రాజమౌళి, సంగీత, హస్మిత, ఆమీన్ తదితరులు పాల్గొన్నారు.
27, ఆగస్టు 2020, గురువారం
ఉదయం 8లోపు ఈ ఆరు పనులు చేయండి...
మీలోని మిమ్మల్ని నిద్రలేపడానికి ఉదయం 8లోపు ఈ ఆరు పనులు చేయండి.........
ఉదయం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అలవాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!
హాల్ ఎలోర్డ్ అనే ప్రముఖ రచయిత రాసిన .... “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉదయం 8 లోపు చేసే 6 పనులు మన జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బయటపడ్డ ఈ రచయిత ఇప్పుడు తన రచనలతో ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాడు.
ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S
1. S-Silence( నిశ్శబ్దం) ....మన ప్రతి రోజును చాలా నిశ్శబ్దంగా ప్రారంభించాలి…అంటే ప్రశాంతతతో స్టార్ట్ చేయాలి..లేవడం లేటయ్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ పని…ఈ రోజు అతడిని కలుస్తానని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంతలా హైరానా పడొద్దు… ప్రశాంతంగా లేవగానే….కాసింత సేపు మెడిటేషన్ చేయండి. లేదా…కళ్ళు మూసుకొని ప్రశాంతతను మీ మనస్సులోకి ఆహ్వానించండి. ఇక్కడే మన రోజు ఎలా గడుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది .
2. A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవడం) …. అందరి గురించి, అన్ని విషయాల గురించి అనర్గలంగా మాట్లాడే మనం…మనతో మనం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేకపోతున్నాం. అసలు మనలోని మనకు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది. ఈ మూడు పాయింట్స్ ప్రతి రోజు మీతో మీరు మాట్లాడుకోండి.
1) నేనేమి కావాలనుకుంటున్నా.??
2) దాని కోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్న??
3) అనుకున్నది సాధించడం కోసం నేను వేటిని వదిలివెయ్యాలి? వేటిని కొత్తగా ఆహ్వానించాలి? ఇలా ప్రతి రోజూ మనలో మనం మాట్లాడుకుంటూ….మనలోని మార్పును మనమే లెక్కించాలన్న మాట.!
3. V-Visualization ( ఆత్మ సాక్షాత్త్కారం) … మనలోని భావాలకు మనస్సులో దృశ్యరూపం ఇవ్వడం. కాన్సియస్ తో కలలు కనడం అన్నమాట! ఉదయాన్నే మన లక్ష్యం అలా కళ్ళ ముందు కనబడితే…దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాం.
4. E-Exercise ( వ్యాయామం) – ఇది ప్రతి ఒక్కరికి తెల్సిన విషయమే… కండరాలు, నరాలు ఉత్తేజితమై…కొత్త శక్తిని ప్రేరేపిస్తుంది.
5. R-Reading (పుస్తక పఠనం) – రోజుకు 10 పేజీలు చదవడాన్ని అలవాటు చేసుకోవాలి..ఇది మనలోని అంతర్గత శక్తిని ప్రేరేపిస్తుంది. ఫలానా బుక్ చదవాలని లేదు..మీకు తోచిన బుక్ ను చదువుతూ పోండి.
6. S-Scribing ( రాయడం) - ఉదయం లేవగానే…మీకు తోచిన లైన్స్ రాయండి… వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు. ఇలా మీరు రోజూ రాస్తూ పోతే…మీ ఆటిట్యూడ్ లో మీకే తెలియని పాజిటివ్ వేవ్స్ వస్తాయ్.
సో…. ఈ పనులన్నీ ఉదయం 8 లోపే చేయాలి. ఆల్ ది బెస్ట్…మీలోని మిమ్మల్ని నిద్రలేపండి
లేబుళ్లు:
ఆరోగ్యం,
ఇతరములు,
ఒక చిరుదివ్వె...
25, ఆగస్టు 2020, మంగళవారం
నిశ్శబ్దంగా నిష్క్రమించిన నాన్న...
నిశ్శబ్దంగా నిష్క్రమించిన నాన్న - Venkat Kolagari
80 సంవత్సరాలకు పైబడిన జీవితం. ఎవరి మీద పిర్యాదులు లేవు. ఆందోళనలు లేని నిశ్శబ్ద జీవితం. బుదవారం వేకువన, ప్రశాంతమైన నాన్న నిద్రను ఆఖరి నిద్రను చేసి, కాలం నిర్ధాక్షిణ్యంగా తన దారిన తాను వెళ్లిపోయింది. శ్రమలో నిండిన తన జీవితం బ్రహ్మ తన నుదుటిన రాసిన రాత ఫలితం అన్న ప్రగాఢ నమ్మకం, బండ చాకిరి నుండి బయటపడి, తన జీవితాన్ని వికసింపచేసుకోవడానికి చేసే ప్రయత్నాలను అన్నింటిని కాలరాసి, తలఎత్తక కలవారికి దాస్యం చేయడం తప్ప మరో మెరుగైన జీవితం తనకు లేకుండా చేసింది.
కల్మషంలేని, ఒకరికి చెడు తలపెట్టాలన్న తలంపు లేని, ఇతరుల గురించి చెడు ప్రచారం చేయాలన్న ఆలోచన లేని, కోపం ఎరుగని, ప్రేమగా మనసార తోటివారిని పిలిచే మంచి మనిషి తాను. అందుకేనేమో, తన మోహంలో చెదరని ప్రశాంతత వెల్లివిరుస్తుండేది.
స్వాతంత్రానికి సుమారు ఏడు సంవత్సరాల క్రితం, మారుమూల గ్రామం, కృష్ణ , తుంగభద్రల కూడలైన కూడవెళ్లిలో జన్మించాడు మా నాన్న తెలుగు రాముడు. గ్రామంలోని భూములన్నీ ఆధిపత్య కులాలయిన రెడ్లు మరియు బ్రహ్మణ కులస్థుల చేతిలో ఉండేవి. గ్రామానికి రెండువైపుల విస్తరించిన రెండు నదులు, గ్రామాన్ని బయటి ప్రపంచానికి దూరంచేసి, గ్రామ భూముల్ని అత్యంత సారవంతంగా మార్చాయి. గ్రామాన్ని మాత్రం మారుమూలకు పరిమితం చేశాయి. మారుమూల గ్రామం, రాజ్యాంగం ఆధునిక విలువలయిన స్వేచ్చా, సమానత్వాన్ని, ఆత్మగౌరంగా బ్రతికే పరిస్థితుల్ని దళిత, బహుజనులకు పూర్తిగా దూరంచేసి, ఆధిపత్య కులాల ప్రజలకు సేవచేస్తూ, వారిముందు తలవంచుకొని బ్రతికే దుర్భర పరిస్థితిని కల్పించింది. గ్రామాలు ఆజ్ఞానం, ఆచారాలతో కుళ్లికంపు కొడుతూ, వివక్షతలు, అణచివేతలు, వెట్టిచాకిరి లకు నెలవై దళిత బహుజన కులాల ప్రజల జీవితాల్ని దుర్భరంగా మార్చే మురికికూపాలు అన్న అంబేద్కర్ మాటలకు అచ్చమైన నమూనాగా ఉండిందీ ఈ గ్రామం.
తాను పాఠశాల విద్య ఎరుగడు. ఆర్థిక స్థోమతలేక, చదువు అవసరం పట్ల స్పృహలేక, చదువుకునే సౌకర్యాలు సైతం లేని మారుమూల గ్రామంలో, ఆనాటి కాలాన, వెనుక ఉంచబడిన కులం అయిన బెస్త కులంలో జన్మించిన తనకు జీవితం వికసించడానికి అవకాశం ఇవ్వలేదు. గాసం పేరున వెట్టిచాకిరికి బంధీని చేసింది. రెడ్ల ఇండ్లలో గాసం చేయడం ప్రధాన జీవితం, జీవనోపాధిని కలిగిన తన తండ్రులు, చిన్నప్పుడే తనను రెడ్ల ఇండ్లలో గాసానికి ఉంచారు. అర్థ శతాబ్దం పైగా గాసమనే దుర్మార్గపు కోరలకు బంధీ అయి, తన చెమట, నెత్తురును ధార పోసి, నమ్మకంగా పనిచేశాడు. తనకు డబ్బులు ఖర్చుచేసే ఎలాంటి దురలవాట్లు లేవు. డబ్బు విషయం పట్ల బహు పొదుపరి. వ్యవసాయం చేయడం నుండి వంట చేయడం దాక తనకు ఎన్నోరకాల పనులు నైపుణ్యంతో చేయడం వచ్చు. నిరంతరం శ్రమించడం తప్ప మరో జీవితం ఎరుగడు. అయినప్పటికి తాను సంపదను సృష్టించుకోలేక పోయాడు. శ్రమించే వారి వద్దకు సంపద చేరుతుందన్నది నిజం కాదని, వారి శ్రమను వెట్టి చాకిరి పేర దొచుకొని సంపన్నులే తమ సంపదను మరింత పెంచుకుంటారన్నది మెజారిటీ పేదల విషయంలో అక్షరాల నిజమని నిరూపించిన కోట్లాది ఉదాహరణల్లో తన జీవితం కూడా కలిపి కాలగర్భంలోకి వెళ్లిపోయాడు.
రైతు కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన తన జీవిత సహచరి, వెట్టిచాకిరి విషపు కోరల నుండి బయటపడి, స్వతంత్రంగా, ఆత్మగౌరంగా బ్రతికే అవకాశాల్ని చూడమని చెప్పిన సలహాలు, కలవారికి చాకిరిచేయడమే తనజీవిత ధర్మం, జీవనోపాధిగా మతం, దైవం పేర ప్రగాఢంగా నమ్మిన తన చెవికి చేరలేకపోయాయి.
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం, శ్రీశైలం నీటిమునకలో పూర్తిగా మునిగి, చరిత్ర చిత్ర పటం నుండి కనుమరుగయిపోయిన కూడవెళ్లి, గ్రామ ప్రజల జీవితాల్ని చెల్లాచెదరు చేసింది. ఆస్థులున్న వారికి కొంత అధిక నష్ట పరిహారం వచ్చింది, ఆస్థులు, సామాజిక బంధాల బలంతో కలవారు మెరుగైన అవకాశాలను వెతుకున్నారు. ఆస్థులు లేనివారు గాసం, ప్రకృతి వనరుల పై ఆధారపడి బ్రతికే మెజారిటి పేదలు, బ్రతుకుతెరువు వెతుక్కుంటు, స్నేహితులు, బంధువులు ఉన్న గ్రామాలకు విసిరివేయబడ్డారు. అలా తాను 10 సంవత్సరాల కాలంలో 3 ప్రాంతాలు మారాడు. చివరికి తాను ఏ రెడ్ల చెంత అయితే గాసం చేశాడో, అదే రెడ్లకు సరికొత్త రూపంలో సేవ చేసేందుకు అలంపూర్ లో చివరికి స్థిరపడ్డాడు. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, ఈ దాస్యపు భూతపు కోరలనుండి తాను పూర్తిగా బయటపడలేక పోయాడు.
మనిషి అనుమతిలేకుండానే మొదులయ్యే జీవితం, ఆరంభంలో ఆమనిషి కన్నవారికి, ఆప్తులకు ఆనందాన్నిస్తుంది. అంతిమంలో ఆమనిషి అనుమతి అక్కరలేకుండా తనదారిన పోతూ, ఆప్తులకు అందమైన జ్ఞాపకాలతోపాటు తీరని విషాదాన్ని, నేర్చుకోవడానికి తగిన పాఠాల్ని మిగిల్చిపోతుంది.
తన అంతిమ ప్రయాణాన్ని ముందే ఊహించి, తనను కాపాడుకునే అవకాశాలను అన్నింటిని ఉపయోగించుకోలేని పిల్లల అసమర్థతపై, నాణ్యమైన వైద్యం అందరికి ఉచితంగా తక్షణం అందించడంలో వ్యవస్థ వైఫల్యాల పై ప్రశ్నలు మిగిల్చి వెళ్లిపోయారు.
23, ఆగస్టు 2020, ఆదివారం
యూట్యూబ్, ఫేస్బుక్ మెషీన్ లెర్నింగ్‌తో మిమ్మల్ని ఇలా హైజాక్ చేస్తున్నాయి..!
యూట్యూబ్, ఫేస్బుక్ మెషీన్ లెర్నింగ్‌తో మిమ్మల్ని ఇలా హైజాక్ చేస్తున్నాయి..!
--------------------
యూట్యూబ్‌లో నీకు ఎలాంటి వీడియోలు చూపించాలో నీకన్నా యూట్యూబ్‌కే బాగా తెలుసు..
స్మార్ట్ టీవీ ఆన్ చేస్తే ఎలాంటి వీడియో కంటెంట్ చూపించాలి అన్నది అదే నిర్ణయిస్తుంది..
అంతెందుకు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నీకు వేలాదిమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎవరెవరి పోస్టులు మాత్రమే చూపించాలి అన్నది ఫేస్బుక్కే నిర్ణయిస్తుంది.
ఆల్గారిధమ్స్.. ఇది సాంకేతిక పదం కాదు.. ఇప్పుడు మన జీవితాలను మనవి కాకుండా చేస్తున్న అతి పెద్ద ప్రమాదం! మన జీవితం, మన ఆలోచనలు మన చేతిలో నుండి టెక్నాలజీ చేతిలోకి వెళ్లిపోతున్న ప్రమాదకర పరిణామం. నాకు నచ్చిన కంటెంట్ ఇది భలే చూపిస్తోందే అని చాలామంది సంబరపడిపోతూ ఉంటారు. టెక్నాలజీని తెగ మెచ్చేసుకుంటారు. కానీ తమ ఆలోచనలు, వ్యక్తిత్వం మొత్తాన్ని మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ సమూలంగా మార్చేస్తున్నాయని.. తాము చూసే సెన్సేషనల్ కంటెంట్ మాత్రమే ఇక జీవితాంతం చూపించబడి జీవితం సమాధి అయిపోతోందని అర్థం చేసుకునే పరిపక్వత అతి కొద్దిమందికే ఉంటుంది.
ప్రొఫైలింగ్
యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి దాదాపు అన్ని టెక్నాలజీ కంపెనీలు చాలా కాలంగా మెషీన్ లెర్నింగ్ పద్ధతులు అనుసరిస్తున్నాయి. సంబంధిత సర్వీసుల్లో మీరు ఎకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఆలస్యం.. అవి ఎప్పటికప్పుడు నిశితంగా మీరు ఎలాంటి వీడియోలు, పోస్టులు ఎంత సమయం చూస్తున్నారు, ఏ వీడియోలు, పోస్టుల దగ్గర ఆగకుండా ముందుకు కదులుతున్నారు వంటి సమాచారం మొత్తాన్ని "హీట్ మ్యాప్స్" అనే ఏర్పాటు ద్వారా మీకు తెలియకుండానే విశ్లేషిస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మెషీన్ లెర్నింగ్ నిరంతరం మీ ఇష్టాఇష్టాలను గమనిస్తూ మీ గురించి నేర్చుకుంటూ ఉంటుంది. ఇకమీదట సరిగ్గా మీకు నచ్చే కంటెంట్ యూట్యూబ్ రికమండేషన్స్ రూపంలో, ఫేస్బుక్ న్యూస్‌ఫీడ్‌లో అదే విధమైన కంటెంట్ మాత్రమే మీకు చూపించబడుతుంది.
తప్పేంటి అనుకుంటున్నారా?
"నాకు నచ్చిన కంటెంట్ అది చూపిస్తోంది కదా, నా పని మరింత సులువు చేస్తోంది కదా, దాంట్లో తప్పేముంది" అని కొంతమంది భావిస్తూ ఉంటారు. నిజమే మనకు ఎలాంటి కంటెంట్ కావాలో మనం కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన పనిలేకుండా స్క్రీన్ మీద ఏదో ఒక కంటెంట్, అది గతంలో మనం ఇష్టపడిన తరహాది కన్పించడం మనకు చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే, మన బ్రెయిన్‌ని ఇబ్బంది పెట్టడం మనకు ఇష్టం ఉండదు. "నాకు నువ్వు కంటెంట్ వద్దు, వేరే నాకు నచ్చినది నేను వెతుక్కుంటాను" అనే తెగింపు అతి కొద్దిమందిలోనే ఉంటుంది. మిగతా వాళ్లంతా ఒక వీడియో తర్వాత మరొకటి యూట్యూబ్ చూపించిన వీడియోలన్నీ చూసేస్తూ చాలా నేర్చుకున్నాం అన్న భ్రమలో బ్రతికేస్తుంటారు.
వ్యక్తిత్వం మారిపోతుంది!
సహజంగా సంచలన విషయాల జోలికి వెళ్లకుండా జీవితం పట్ల స్పష్టమైన ఆలోచనలు ఉండి, ప్రొడక్టివ్‌గా బ్రతికే ఆలోచనలు కలిగిన వ్యక్తులు మీరు అనుకుందాం. పొరబాటున చైనాకి, ఇండియాకి మధ్య దశాబ్దాలుగా ఏం జరుగుతోంది అన్న వీడియో మీది యూట్యూబ్‌లో వెదికారు అనుకోండి. అది అనేక వీడియోలు చూపిస్తుంది. మీరు రెండు మూడు వీడియోలు చూస్తారు. అంతటితో ఆ విషయం మీరు మర్చిపోతారు. కానీ యూట్యూబ్ దాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటుంది. ఇక యూట్యూబ్‌లోకి మీరు ఎప్పుడు వెళ్ళినా ఇండియా, చైనా గురించి విభిన్నమైన వీడియోలు మీ దృష్టికి రికమండేషన్స్ రూపంలో చూపిస్తుంది. గతంలో ఆ సమాచారాన్ని మీరు ఇష్టపడ్డారు కాబట్టి, సహజంగానే మీ మెదడులో దానికి సంబంధించిన ఒక న్యూరల్ నెట్వర్క్ సృష్టించబడి ఉంటుంది కాబట్టి, ఇలా చూపించబడే కొత్త వీడియోలను కూడా మీరు రెండో ఆలోచన లేకుండా చూస్తారు. అంటే ఇక్కడ మీకు తెలియకుండానే మీ ప్రొడక్టివ్ టైం మొత్తాన్ని పక్కన పెట్టి చైనా, ఇండియా అనే అంశం దగ్గర ఇరుక్కుపోయారు. మీరు ఆశావహ దృక్పథం ఉన్న వ్యక్తి అనుకోండి.. గాసిప్స్ చూడడం ఇష్టం లేదు అనుకోండి. పొరపాటున ఏదో ఒక రోజు ఒకటి రెండు వీడియోలను నెగిటివ్ వీడియోలు, గాసిప్స్ వీడియోలు చూశారు అనుకోండి. అప్పటినుండి అలాంటి కంటెంట్ మళ్లీ మళ్లీ చూపించబడుతుంది.
దాంతో మెల్లగా మీ వ్యక్తిత్వం మొత్తం "వేరే వాళ్ల జీవితం గురించి మనకెందుకు" అనే మాదిరిగా గతంలో ఉన్నది కాస్తా మారిపోయి, "వాళ్ల జీవితంలో ఏం జరిగింది, వీళ్ల జీవితంలో ఏం జరిగింది" లాంటి గాసిప్ వీడియోలు చూడటం మొదలు పెడతారు. దురదృష్టవశాత్తు దీన్నంతా చాలా జ్ఞానం సంపాదిస్తున్నాం అనే భ్రమలో చూసేస్తుంటారు. యూట్యూబ్ వీడియోలు చేసే వ్యక్తులు వ్యూల కోసం అభూత కల్పనలు చక్కని స్వరంతో చెప్పినా అది నిజమని నమ్మే ఊబిలో కూరుకుపోతాం.
సామూహిక హైజాక్
కేవలం ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలు మాత్రమే కాదు.. సామూహికంగా ఒక నగరంలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో అధిక శాతం మంది ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వినియోగదారులు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అన్నది కూడా "ట్రెండింగ్" రూపంలో మన ముందుకు తీసుకు రాబడుతుంది. అంటే సమాజం మొత్తం మంచి విషయాలు పక్కన పెట్టి, కాలక్షేపపు విషయాలు, సంచలనాత్మక విషయాలు చూస్తూ కూర్చున్నారు అనుకుందాం. మీకు అలాంటి కంటెంట్ వద్దు అనుకున్నా తప్పించుకోటానికి లేకుండా అది "ట్రెండింగ్" అనే విభాగంలో మీ దృష్టికి బలవంతంగా తీసుకు రాబడుతుంది. ఒకసారి మీ కళ్లకు అలాంటి సమాచారం వచ్చిన తర్వాత దాన్ని చూడకుండా ఉగ్గబట్టుకోవడం అతి కొద్దిమంది స్థితప్రజ్ఞులకే సాధ్యపడుతుంది. అంటే మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కావచ్చు, సమాజం మొత్తం చేసే బలహీన ఆలోచనలు కావచ్చు.. అవి మీరు తెల్లారి లేచింది మొదలు కొన్ని వందల సార్లు ఓపెన్ చేసే ఫేస్బుక్, యూట్యూబ్ వంటి యాప్స్‌లో ప్రతిఫలిస్తుంటాయి. దాంతో వ్యక్తులు తమ ప్రాధాన్యతలు మర్చిపోయి ఇలాంటి అప్లికేషన్స్ చూపించే సమాచారం మాయలో పూర్తిగా మునిగిపోతారు.
నష్టం ఏంటంటే?
మెషీన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ మనకేం కావాలో అవే నిర్ణయించి మన ఆలోచనలను ప్రభావితం చేయటం, మనకంటూ మనం సొంతంగా ఎప్పటికప్పుడు నిర్ణయించుకునే స్వేచ్ఛను హరించడం వల్ల వ్యక్తుల యొక్క నిర్ణయాత్మక శక్తి సన్నగిల్లుతుంది. తన జీవితానికి ఏమాత్రం ముఖ్యం కాని విషయాన్ని కూడా అతి ముఖ్యమైనదిగా భావిస్తాడు. ఉదాహరణకు "రామ జన్మభూమి" అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది అనుకోండి. రెండు మూడు రోజులపాటు ఆ అంశం తనకు ఏమాత్రం సంబంధం లేనిది అని అతను ఎంత తప్పించుకుని తిరుగుతున్నా ఏదో రూపేణా యూట్యూబ్‌లో గానీ, ఫేస్బుక్లో గానీ కన్పిస్తూ ఉంటుంది. దాంతో ఆ అంశం చుట్టూ ఆ వ్యక్తిలో మెదడులో న్యూరాన్ల ఫైరింగ్ జరిగి ఓ న్యూరల్ నెట్వర్క్ సృష్టించబడుతుంది. తనకు అవసరం లేని విషయమైనా అతను కూడా దాని మీద ఒక పోస్ట్ రాస్తాడు. అంటే పరోక్షంగా మన ఆలోచనలు, మన ప్రాధాన్యతలు సోషల్ మీడియా సంస్థలు నిర్ణయిస్తున్నాయి.
దీన్ని అడ్డుకోవడం ఎలా?
ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టా వంటి యాప్స్ మాయలో పడకుండా ఉండాలంటే ఒక వ్యక్తికి తన మీద తనకు పూర్తిస్థాయి నియంత్రణ అవసరం. కళ్లెదురుగా ఎంత ప్రలోభపూరితమైన సమాచారం చూపించబడుతున్నా దాని జోలికి వెళ్లకుండా ఉండాలి. "కరోనా వచ్చిన వ్యక్తి ఎంత దారుణంగా చచ్చిపోతాడో తెలుసా" అని ఓ భయంకరమైన యూట్యూబ్ థంబ్‌నెయిల్ కన్పిస్తుంది అనుకోండి. మానవ సహజమైన స్వభావంతో దాన్ని చాలామంది రెండో ఆలోచన లేకుండా క్లిక్ చేస్తారు. అది ఆ వీడియో సృష్టించిన వ్యక్తి మనల్ని తన వైపు లాక్కోవడానికి పెట్టిన టైటిల్ అనీ, ఆ అంశం మనకు ఏమాత్రం అవసరం లేనిది, మన ప్రాధాన్యతలు వేరని అప్పటికప్పుడు గుర్తించగలిగే విజ్ఞత చాలా అవసరం.
ఈ సెట్టింగ్స్ చేయండి
ఈ సోషల్ మీడియా ట్రాప్ నుండి బయటపడాలంటే వెంటనే కొన్ని సెట్టింగ్స్ చేయండి. మీ ఫోన్ లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి, అందులో సెట్టింగ్స్ లో ఉండే "సెర్చ్ హిస్టరీ, వాచ్ హిస్టరీ" అనే వాటిని డిసేబుల్ చేయండి. ఇకమీదట మీకు చాలా వరకు ప్రమాదకరమైన రికమండేషన్స్ నిలిచిపోతాయి. అలాగే యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్లో గానీ, "ఇదేదో ఆసక్తికరంగా ఉందే" అని ఒక వీడియో దగ్గర గానీ, ఫొటో, పోస్ట్ దగ్గర గానీ ఎక్కువ సేపు ఆగకండి. మీ ఫేస్బుక్, యూట్యూబ్ యాప్‌లలో పైకి మీ కళ్ళకు కనిపించకుండా "హీట్ మ్యాప్" అనే టెక్నాలజీ ఉపయోగించబడుతుంది. ఇది స్క్రీన్ మీద ఏ ఫొటో, పోస్ట్, వీడియో దగ్గర మీరు ఎక్కువ సేపు ఆగారు అన్నది కూడా రహస్యంగా పరిశీలిస్తూ మీ ఇష్టాలను పసిగట్టడానికి ప్రయత్నిస్తుంది. వీలైనంతవరకూ సంచలనాత్మక అంశాలను ఎట్టి పరిస్థితుల్లో చూడకండి. మీకు కావలసిన కంటెంట్ కోసం మీరే ఎప్పటికప్పుడు సెర్చ్ చేయండి. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్లో మీకు పైకి కనిపించని మీ జీవితాలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన వీడియోలు, పోస్టులు, ఫాలో కావలసిన వ్యక్తులు కూడా ఉంటారు, వారిని మీకు మీరుగా వెదికి పట్టుకోండి.. మీకేం కావాలో మెషీన్ కాదు నిర్ణయించాల్సింది, మీ ఆలోచనలను, మీరు ఫాలో అవ్వాల్సిన వ్యక్తులను, మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాల్సిన వ్యక్తులను మీకు మీరుగా నిర్ణయించుకునే స్వేచ్ఛ మీరు సాధించండి. స్వాతంత్రం అంటే దేశానికి మాత్రమే కాదు.. ఇలాంటి సోషల్ యాప్స్ మెషీన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ ద్వారా మీకు వేసిన బంధనాల నుండి విముక్తి సాధించడమూ స్వతంత్రమే, అదే నిజమైన స్వేచ్ఛ!
- Nallamothu Sridhar
(ఆంధ్రజ్యోతి టెక్ గురు కాలమ్)
లేబుళ్లు:
ఇతరములు,
విజ్ఞానం-విద్యార్థులు,
వీడియోలు...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)