5, ఆగస్టు 2019, సోమవారం

స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా....

 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు....

        స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం...
        స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం... అన్నాడో సినీ కవి. అందుకే ప్రపంచంలో ఎన్ని బంధాలున్నా స్నేహ బంధం మాత్రమే మనిషి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. ఆధునిక స్నేహాలు... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఆధునాతన టెక్నాలజీ వరంగా స్నేహం సరికొత్త పుంతలు తొక్కుతొంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మంచిని పెంచుకోవాల్సిందిపోయి చెడు మార్గాలు పట్టడం, దానికి స్నేహం అనే ముసుగు వేయడం బాధాకరమైన విషయం. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌...వంటి వాటిని వినియోగించుకోవడంలో ముందున్న యువత ముక్కుమొఖం తెలియనివారితో అవసరానికి మించి చనువు ప్రదర్శించడం, అవతలి వ్యక్తి ఆడో మగో కూడా తెలియకుండా స్నేహం చేయడం వంటి వాటివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనం రోజు చేస్తున్నాం. కొందరు స్వార్థపరుల వల్ల స్నేహం కూడా వ్యాపారానికి గురవుతున్న సంఘటనలు కూడా చాలానే జరుగుతున్నాయి. సోషల్‌ మీడియాను మంచిగా ఉపయోగించుకున్న వారికి మంచి స్నేహితులు లభిస్తారు. కాబట్టి ఈ అత్యంత ఆధునిక యుగంలోనూ మంచి స్నేహానికి ఉన్న వన్నె తగ్గలేదు.
         స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా....
         ఎదుటి వారిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఓ నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనపుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెంచిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే మంచి ఔషదం స్నేహం. తమకు అవసరమైనపుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కొనాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి