8, నవంబర్ 2018, గురువారం

దీపాల పండుగ దీపావళి ...

నరకాసురుడు అనే రాక్షసుడిని హతమార్చి, చీకట్లను పారదోలినందుకు దీపావళి చేసుకుంటారని కథలో చెప్తారు. చీకటి చెడును పారదోలి, వెలుగును ఆహ్వానించడము. మన జీవితాలలో చూపించే చెడును దూరం చేయటమే దీపావళి. కానీ మనం పటాకుల రూపంలో కాలుష్యాన్ని కొనితెచ్చుకొంటున్నాము. చెడును నాశనం చేయడం కాకుండా, చెడును ఆహ్వానిస్తూ పండుగ చేసుకుంటున్నాము. వాయుకాలుష్యం, శబ్ధకాలుష్యం, ధూళికాలుష్యం...అన్ని కలిపి దీపావళి పండుగ. పండుగ ఒక రోజు కానీ పర్యావరణంపై, మన ఆరోగ్యం దాని ప్రభావం సంవత్సరం రోజులు పడుతుంది. సాధారణ రోజుల్లోనే కాలుష్యం సమస్య మనల్ని త్రీవంగా వెంటాడుతున్నది. పండుగ సమయంలో ఈ సమస్య రెండు, మూడు రేట్లు ఎక్కువగా అవుతున్నది.
ప్రపంచంలో వాయుకాలుష్యంలో మన దేశం నాలుగో స్థానం...
ప్రపంచంలో వాయుకాలుష్యంలో మన దేశం నాలుగో స్థానంలో ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యధికంగా కాలుష్యం ఉన్న 20 నగరాలలో, 13 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. ఇది పెను ప్రమాద హెచ్చరికే. దేశంలో అన్ని రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజు ఏర్పడుతున్న కాలుష్యాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తిస్తుంది. దేశంలో ఢిల్లీ అత్యంత కాలుష్యంతో చాలా దారుణంగా ప్రథమ స్థానంలో ఉంది. ఢిల్లీలో దీపావళి ఒక్క రోజే 4 వేల టన్నుల చెత్త అదనంగా పెరుగుతుంది.
ఒకటి 464 సిగరెట్లతో సమానం ....
ధూమపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిగరెట్‌ కాల్చేవారికే కాదు, ఆ పొగను పీల్చేవారికీ నష్టమే. ఒక సిగరెట్‌కే కొందరు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. అలాంది ఒకేసారి 464 సిగరెట్ల పొగను తట్టుకోగలామా..? ఒక్క పాము గోళిని కాలిస్తే చాలు, అంత పొగ వెలువడుతుంది. పుణె చెస్ట్‌ రీసెర్చ్‌ పౌండేషన్‌, పుణె విశ్వవిద్యాలయం హెల్త్‌ సైన్సెస్‌ విద్యార్థులు అధ్యయనం చేసి, ఏ బాణసంచాను కాల్చితే ఎంత నష్టమో తేల్చారు. ఆ లెక్కల్ని చేస్తే ఉక్కిరి, బిక్కిరి కావలసిందే...
బాణసంచా గాల్లోకి విడుదలయ్యే పిఎం 2.5 (మైక్రోగ్రాముల్లో) ఎన్ని సిగరెట్లకు సమానం
పాముగోళి                                        64,500                                   464
థౌజండ్‌ వాలా                                   38,540                                  277
ఫూల్‌-ఫూల్‌                                       28,950                                 208
పూల్‌ జడీ                                          10,390                                   74
భూచక్రం                                              9,490                                   68
అనార్‌                                                  4,860                                  34
అణువణువు విష పూరితమే... ప్రమాదకర రసాయనాలతో పటాకులు....
. సీసం : నాడీ వ్యవస్థను దెబ్బ తీస్తుంది. మెదడు సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.
. పొటాషియం : ఊపిరితిత్తులు చెడిపోతాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
. క్యాడ్మియం : ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముకలపై ప్రభావం అనేక రోగాలకు కారణమవుతుంది.
. క్రోమియం : చర్మవ్యాధులతో పాటు, హైపర్‌ సెన్సిటివిటీ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీస్తుంది.
. సల్ఫర్‌ డై ఆక్సెడ్‌ : శ్వాసకోశ నాళాలు దెబ్బతిని, బ్రాంకైటీస్‌కు కారణమవుతుంది.
. నైట్రోజన్‌ డై ఆక్సెడ్‌ : కండ్లు, ముక్క మండుతాయి. శ్వాసకోశంపై ప్రభావం చూపుతుంది.
. కార్భన్‌ మోనాక్సైడ్‌ : దీని వల్ల జీవకణాలకు ఆక్సిజన్‌ ఆందదు. 100 పిపిఎం కు ఇది చేరితే మరణానికి దారితీస్తుంది.
. మోగ్నీషియం : ఈ సూక్ష్మ కణాలు శరీరంలోకి చేరి నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతాయి.
హైదరాబాద్‌ నగరంలో ఏటా పెరుగుతున్న శబ్ద, వాయు కాలుష్యం...
హైదరాబాద్‌ నగరం కూడా దేశంలోని ప్రమాదకర కాలుష్య నగరాలలో ఒకటి. కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్‌ కూడా మొత్తం 17 ప్రాంతాల్లో విష రసాయనల వాయువులు వాతావరణంలో కలువడాన్ని గుర్తించింది. పిఎం 10(ధూళి కణాలు) స్థాయి సాధారణ రోజుల్లో ఒక క్యూబిక్‌ మీటర్‌కు 100 మైక్రోగ్రామ్‌లు ఉంటే 2016 దీపావళి రోజున సరాసరి 160 కి పెరిగింది. వరంగల్‌లో 60 నుండి 110, నల్లగొండలో 85 నుండి 113, రామగుండంలో 50 నుండి 90, ఖమ్మంలో 40 నుండి 70...నమోదైంది.
గత సంవత్సరం సిపిసిబి శబ్దకాలుష్య గణాంకాల ఆధారంగా అత్యధికంగా నమోదవుతున్న ఏడు నగరాలకు ర్యాంకులను ప్రకటించింది. శబ్ధకాలుష్యంలో హైదరాబాద్‌ మొదటి స్థానం నిలిచింది. తరువాత ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కోల్‌కతా, లఖ్‌నవూ, బెంగళూరు ఉన్నాయి. గతంలో మనం మూడో స్థానంలో ఉన్నాం.
సిపిసిబీ గణాంకాల ప్రకారం వాణిజ్య విభాగం పగలు 65 డెసిబుల్స్‌, రాత్రి 55 డెసిబుల్స్‌ ; పారిశ్రామిక ప్రాంతం పగలు 75, రాత్రి 70; సున్నిత ప్రాంతంలో పగలు 50, రాత్రి 40; నివాస ప్రాంతంలో పగలు 55, రాత్రి 45 డెసిబుల్స్‌ ఉండాలి. పగలు అంటే ఉ.6 నుండి రా 10 వరకు, రాత్రి అంటే రా.10 నుండి ఉ.6 వరకు నమోదుచేస్తారు.
గ్రీన్‌ దీపావళి....
అభివృద్ది చెందిన దేశాలలో ఏ సంబరమైనా పటాకులు లేకుండా జరుగదు. అయినా అక్కడ కాలుష్యం పెరుగకపోవటానికి కారణం జీరో పొల్యూషన్‌ పటాకుల వినియోగమే. అన్నింటికి మించి సామూహికంగా క్రాకర్‌ షో ఏర్పాటు చేసుకుని, అందరు సమిష్టిగా పాలుపంచుకొంటారు. దీనితో కాలుష్యం ఒక్క చోటికే పరిమితం అవుతుంది. అమెరికాకు చెందిన కొన్ని కెమికల్‌ , ఇంజనీరింగ్‌ కంపెనీలు జీరో పొల్యూషన్‌ క్రాకర్స్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి వల్ల తక్కువ పొగ రావడంతో పాటు పర్యావరణహితంగా పటాకులు కాల్చుకొనే అవకాశం కలుగుతున్నది. చైనా 710 నగరాల్లో కొత్త సంవత్సర వేడుకలలో బాణసంచాను పూర్తిగా నిషేదించింది. కాలుష్యానికి కారణమైన 17,600 పరిశ్రమలను మూడేళ్ళ క్రితమే మూసివేశారు. కొన్ని దేశాలలో కర్భన పదార్ధాలకు బదులుగా నైట్రోజన్‌ సంబంధిత పదార్ధాలతో తయారు చేస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు అభినందనీయం...
బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు అక్టోబర్‌ 23, 2018 వెలువరించిన తీర్పు హర్షణీయం, అభినందనీయం. పర్యావరణ ప్రేమికులందరు సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నారు. కాలుష్యం మానవ మనుగడకు ముప్పు కలిగిస్తున్న తరుణంలో పండుగలన్నీ పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరుకుందాం. దేశవ్యాప్తంగా దీపావళి, ఇతర పండుగలలో రెండు గంటల వరకే బాణాసంచా కాల్చాలనీ, నూతన సంవత్సరం, క్రిస్మస్‌లలో రాత్రి 11.55 నుండి 12.30 వరకు కాల్చాలనీ, ఆన్‌లైన్‌- వెబ్‌సైట్లలో టపాసులు అమ్మడానికి వీల్లేదని, తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసులకే అనుమతి ఇవ్వాలని అనేక ఆంక్షలతో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అభినందనీయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ప్రజలలో, పిల్లలో అవగహన పెంపోందించడానికి తగు చర్యలు తీసుకోవాలి.
వెలుగు నింపాలి, కాలుష్యం కాదు ....
దీపావళి అంటే అందరి ఇండ్లలో వెలుగు నిండాలి. అంతేగాని కాలుష్యం కాదు. కెమికల్స్‌తో కూడిన పటాకులు కాల్చడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకొంటున్నాం. పర్యావరణానికి హితమైన జీవానాన్ని అలవరుచుకోవడం ఈ కాలానికి ఎంతో అవసరం. అందుకు తగిన అవగాహనను పెంపొందించుకుందాం. గతంతో పోలిస్తే పటాకుల ద్వారా వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం పెంచకూడదనే స్ప ృహ దేశమంతటా పెరుగుతున్నది. పర్యావరణంపై స్ప ృహ పెరగడం అభినందనీయం.
ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం లేని రీతిలో పండుగలను జరుపుకుందాం. దీపావళి పండుగనే కాదు, వినాయక చవితి, ఏ పండుగైనా కాలుష్య రహితంగా జరుపుకుందాం.
. దీపాలు వెలిగించడంతో ఇంటికి వెలుగుల శోభను తీసుకొనిరావాలి.
. కాలనీల్లో సామూహికంగా ఒకేచోట పటాకులు కాల్చే కార్యక్రమం చేపట్టాలి.
. దానితో కాలనీల్లో మనుషుల మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది.
. తక్కువ శబ్ధం, పొగ తక్కువగా వచ్చే పటాకులకు ప్రధాన్యం ఇవ్వాలి.
కె. వీరయ్య
ఉపాధ్యక్షులు
'' హైదరాబాద్‌ జిందాబాద్‌ ''
99498 21177
veeraiahhyd@gmail.com

1 కామెంట్‌: