29, జులై 2011, శుక్రవారం

అమెరికాలో మరో బూటకపు యూనివర్శిటీ...!

వాషింగ్టన్‌ నగర శివార్లలో వున్న ఒక బూటకపు యూనివర్శిటీపై అమెరికా అధికారులు గురువారం దాడి చేశారు. ఈ యూనివర్శిటీ విద్యార్ధుల్లో 90 శాతం మంది భారత్‌కు చెందిన వారే కావటం విశేషం. కాగా అందులో అధిక సంఖ్యాకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని తెలుస్తోంది.
                       వాషింగ్టన్‌ నగర శివార్లలో వర్జీనియా రాష్ట్రంలోని అన్నాడేల్‌లో వున్న ఈ యూనివర్శిటీలో దాదాపు 2,400 మంది విద్యార్ధులున్నారు.  అయితే ఈ దాడిపై స్పందించేందుకు నిరాకరించిన యూనివర్శిటీ పాలక వర్గం తమ విద్యార్ధులు ఇతర యూనివర్శిటీలకు బదిలీ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రవేశద్వారం ముందు ఒక నోటీసు అంటించింది. తాము తాత్కాలికంగా విదేశీ విద్యార్ధులెరినీ చేర్చుకోవటం లేదంటూ మరో నోటీసును అంటించింది. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధికారులు కేలిఫోర్నియాలోని ట్రైవ్యాలీ యూనివర్శిటీపై దాడులు చేసి దానిని మూసివేయించిన విషయం తెలిసిందే. ఇమిగ్రేషన్‌ అవకతవకలకు పాల్పడిందంటూ ఈ యూనివర్శిటీని మూసివేసిన ఫలితంగా దాదాపు వెయ్యికి పైగా భారత విద్యార్ధుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. ఈ వరుసలో ఇది రెండో యూనివర్శిటీ కావటం విశేషం. ట్రైవాలీ యూనివర్శిటీలో భారత విద్యార్ధులను అమెరికా అధికారులు పరిగణించిన తీరును దృష్టిలో వుంచుకున్న భారత ప్రభుత్వం ఈసారి విద్యార్ధులకు ఎటువంటి వెసులుబాటూ కల్పించని ఫెడరల్‌ అధికారుల వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అయితే విద్యార్ధులను అరెస్ట్‌ చేయటం లేదా నిర్బంధించటం లేదా ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్‌ పరికరాలను ఏర్పాటు చేయటం వంటి చర్యలేవీ తీసుకోబోమని అమెరికా అధికారులు ఇక్కడి రాయబార కార్యాలయానికి హామీ ఇచ్చారు. విద్యార్ధులను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చూసేందుకు ఇక్కడి భారత రాయబార కార్యాలయం అమెరికా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
           
( ప్రజాశక్తి ,ఈనాడు పత్రిక సౌజన్యం తో...  )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి