7, మే 2011, శనివారం

తెలుగు జాతి గర్వించదగ్గ విప్లవయోధుడు...

                భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు  ఒక మహోజ్వల శక్తి. మన్యం వీరుడు, తెలుగు జాతి గర్వించదగ్గ విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు. వారు  జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి.  కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
                 అల్లూరి సీతారామరాజు 1974లో విడుదలైన తెలుగు సినిమా.  ఆ  సినిమా నిజంగా అల్లూరి పోరాటాన్ని చుసిన అనుభూతి కలిగింది.  జీవిత కధను తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం. కృష్ణ హిరో సినీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా పేరుపొందింది.  తెలుగు వీర లేవరా"  దీక్షబూని సాగరా...దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా పాటకై  మొటమొదటి  సరిగా తెలుగు పాటకు  జాతీయ బహుమతి వచ్చింది. ( మహా కవి శ్రీశ్రీ రచనకు  ). మేము చినప్పుడు  స్వాతంత్ర్య దినోత్సవాల సందర్బంగా స్కూల్లో , రోడ్ల మిద ఆ పాట పాడుతూ ఊరేగింపు  చేసేవాళ్ళం .

                అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మైదాన ప్రాంతంలో భాగమైన 'మోగల్లు' గ్రామంలో గిరిజనేతరునిగా జన్మించినా ఆయన ఉద్యమ నేపథ్యమంతా గిరిజన ప్రాంతాల్లోనే సాగింది. గిరిజన జాతిని అపారంగా ప్రేమించాడు. మన్యంలో గిరిపుత్రులపై జరుగుతున్న అంతులేని దోపిడీని చూసి చలించిపోయాడు. కూలీ సమస్య, అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆంక్షలు, అన్యాక్రాంతమైన భూముల సమస్య, రిజర్వు ఫారెస్టు పేరుతో ఆంక్షలు, వెట్టిచాకిరీ, అటవీ, పోలీస్‌, రెవెన్యూ శాఖల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఆయన ప్రజలను సమీకరించాడు. గిరిజన తెగల మధ్య అనైక్యతను సృష్టించే దళారీ, స్వార్థపరుల కుటిల యత్నాలను ఎండగట్టి గిరిజనులందరినీ ఏకతాటిపై నిలిపాడు. రామరాజు పిలుపు మేరకు మద్యపానాన్ని, ప్రభుత్వ కోర్టులను గిరిజనులు బహిష్కరించారు.
                             ఈ పోరాటాన్ని అణి చివేసేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం తీవ్ర నిర్బంధ కాండను ప్రయోగించింది. చిత్ర హింసలు, మహిళలపై అత్యా చారాలు, అవమానాలు... ఇంకానా ఇకపై సాగవని గిరిజనులు తిరగబడ్డారు. చివరికి అది గిరిజనుల వీరోచిత సాయుధ తిరుగుబాటుగాను, గిరిజన ప్రజల దేశభక్తియుత పోరాటంగానూ మారింది. అల్లూరి సైన్యం సాంప్రదాయక ఆయుధాలతో, విల్లంబులతో చేస్తున్న పోరాటాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం అధునాతన ఆయుధాలతో అణచివేయడం ప్రారంభించింది. దీనికి ప్రతిగా ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో రంపచోడవరం, కృష్ణదేవిపేట, .. పోలీస్‌ స్టేషన్‌లపై దాడులు చేశారు. గిరిజనులు సాయుధ శిక్షణ పొంది తమపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టారు. ఈ సాయుధ తిరుగుబాటును ఎలాగైనా అణచివేయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం రూథర్‌పర్డ్‌ అనే కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఆధునాతన ఆయుధ సంపత్తిని, అనేక యుద్ధాల్లో ఆరితేరిన సాయుధ బలగాలను మన్యంలో మోహరించింది. అనేక మంది వీరులను ఒక పథకం ప్రకారం హతమార్చింది. గ్రామాలకు గ్రామాలు తగులబెట్టించి భయానకమైన పరిస్థితిని సృష్టించింది. అల్లూరి సీతా రామరాజును మాటువేసి బంధించి కాల్చి చంపింది.
                      మన్యం అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే గిరిజన నాగరికతకు ఆలంబనగా ఉన్న నీరు, అడవి, భూమి నుండి ఆదివాసులను వెళ్లగొట్టే విధానాలను ప్రతిఘటించాలి. గనులు, అడవులు, నదులు తదితర సమస్త సహజ వనరులన్నింటినీ కార్పొరేట్‌, సామ్రాజ్యవాద బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టే విధానాలను ఎదిరించాలి. మన్యం వీరుల ఆశయాల కొనసాగింపు, పోరాట వారసత్వాన్ని ఆదివాసీ లాంటి గిరిజన సంఘాలు, సిపిఎం లాంటి పార్టీలు స్వీకరించాయి.  ఆంధ్రప్రదేశ్‌లో 1/70లాంటి ఎల్‌టిఆర్‌ చట్టాలకు తూట్లు పొడవాలని పాలకవర్గ పార్టీలు, భూస్వామ్య శక్తులు నిరంతరం కుట్రలు పన్నుతూనే ఉండగా గిరిజనోద్యమం అప్రమత్తంగా ఉండి వాటిని ఎదిరించి పోరాడుతున్నది.                          

             1924 మే7న బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు అల్లూరి సీతారామరాజును విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో 'మంపా' అనే గ్రామ సమీపంలోని చెరువు దగ్గర పట్టుకొని అక్కడికి 3కి.మీ.దూరంలో ఉన్న రాజేంద్ర పాలెం(నేడు మండల కేంద్రంగా ఉన్న కొయ్యూరు గ్రామంలో ఒక భాగం) తీసుకొచ్చి చెట్టుకు కట్టి కాల్చి చంపారు. ఆయన సమాధి అక్కడే ఉంది. స్వాతంత్య్రానంతరం వచ్చిన పాలక వర్గ పార్టీలు అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాట ప్రాధాన్యాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నాయి. చివరికి ఆయన శత జయంతి ఉత్సవాల నిర్వహణలోనూ అదే అలసత్వం. ఆయన సమాధి వద్ద స్మారక కేంద్రం ఏర్పాటు చేయలేదు.  సిపిఎం భద్రాచలం పార్లమెంట్‌ సభ్యులు డా.మిడియం బాబూరావు ఎంపిగా ఉన్న కాలంలో తన ఎంపి ల్యాడ్స్‌ నిధులతో విశాఖ మన్యంలోని కొయ్యూరులో అల్లూరి, మన్యం అమరుల స్మారక మ్యూజియం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.25లక్షల నిధులను కేటాయించారు. (జూలై 4న అల్లూరి జయంతి రోజున అక్కడి గిరిజనులకు, గిరిజనోద్యమానికి ఈ నిర్మాణం అంకితం కాబోతున్నది)
           మహనీయుల ఆశయాలు నెరవేరాలంటే నేటి  యువత వారి  పోరాటాలను నెమరు వేసుకోవాలి.  తెలుగు జాతి గర్వించదగ్గ విప్లవయోధుడు అడుగు జడలాలో  మన  వంతు  కర్తవ్యం నేరవెరుచుద్దాం.
నేడు అల్లూరి సీతారామరాజు 87వ వర్థంతి.  ( గూగ్ల్స్ ఇమేజ్స్, పత్రిక ల సహకరం తొ.....)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి