ప్రపంచీకరణ నేపథ్యంలో కనుమరుగవుతోన్న ప్రజా సంస్కృతిని, కళలను పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైనా ఉందని ప్రముఖ చరిత్రకారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ అన్నారు. ఇందుకోసం ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రగతిశీలవాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 26వ వర్థంతిని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ప్రజా సంస్కృతి, వికాసం, పరిణామం' అనే అంశంపై రామకృష్ణ స్మారకోపన్యాసం చేశారు.
రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా సంస్కృతి మీద, సాహిత్యం మీద సుందరయ్యకు మంచి పట్టు ఉందన్నారు. ప్రముఖుల జీవిత చరిత్రలోని లోపాలను సైతం ఆయన సునిశితంగా విమర్శించారని చెప్పారు. శ్రమైక జీవన సౌదర్యం నుండే ప్రజా సంస్కృతి ఉద్భవించిందని తెలిపారు. అనేక మంది శతకకారులు ప్రజా సంస్కృతిని ప్రతిబింబించే శతకాలను రచించారని, వారి పద్యాల్లో సామాజిక చిత్రణ స్పష్టంగా గోచరించేదని చెప్పారు. రాజ్యాధికారం కోసం ప్రజా సంస్కృతిని వాడుకున్న రాజులు, ఆ తర్వాతికాలంలోని భూస్వామ్య వర్గాలవారు కావాలనే వీటిని నిర్లక్ష్యం చేశారన్నారు. అయితే కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం, వామపక్ష భావజాలం వల్ల 1950 తర్వాత జానపదాలు, కళారూపాలు పునరుద్దరింపబడ్డాయని వివరించారు. ప్రజలకు దూరమైన, మరుగునపడిపోతున్న కళలను వారికి చేరవయ్యేట్లు కృషి చేసిందన్నారు. అంతేకాక సమాజంలోని చెడును, రుగ్మతలను, దురాచారాలను, రూపుమాపడానికి, వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేసిందని వివరించారు.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అన్ని జిల్లాలో దాదాపు వంద దళాలు తిరిగి గొల్లసుద్దుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాయని చెప్పారు. ఈ కాలంలో ప్రజా కళారూపాలు పోరాటానికి మద్దతుగా నిలిచాయని, ప్రజల్ని ఉత్తేజపరిచాయని చెప్పారు. ఇలా మన రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన కళారూపాలు ప్రస్తుత ప్రపంచీకరణ ధాటికి నిలబడలేక కనుమరుగవుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. తద్వారా మన సంస్కృతి మూలాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని కాపాడుకోవటం మన తక్షణ కర్తవ్యమని, అయితే కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడటం ద్వారా వీటిని కాపాడుకోలేమని స్పష్టం చేశారు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లి, వారి నిత్య జీవితాన్ని పరిశీలించటం ద్వారా నేటి సంస్కృతి తీరుతెన్నులను అధ్యయనం చేయాలని సూచించారు. తద్వారా ప్రజా కళలను, సంస్కృతిని పరిరక్షించుకోవాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. తన జీవితంలో సురదరయ్యతో గడిపిన పలు సందర్భాలను గుర్తుచేసుకున్నారు.- ( ప్రజాశక్తి సహకారంతో ...)
20, మే 2011, శుక్రవారం
ప్రజా సంస్కృతి పరిరక్షణకు నడుం కడదాం...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి