19, మే 2011, గురువారం

మహా మనిషి, ఆదర్శ జీవి...

ప్రపంచ చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతికొద్దిమంది మహా పురుషుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు.
               నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1 న జన్మించాడు అందరిలాగే పుట్టారు. సంపన్న కుటుంబంలో పెరిగారు. కాని శ్రామికనేతగా ఎదిగారు. భూస్వామ్య బంధనాలను తాను తెంచుకోవడమే గాక, సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిన ఫ్యూడల్‌ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి నడుంకట్టారు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా మలచుకోవడమేగాక దాన్ని ఆచరణలోపెట్టి లక్షలసంఖ్యలో సామాన్య ప్రజానీకాన్ని కదనరంగంలోకి దించిన మహానేత.   దేశంలో బలమైన వామపక్ష శక్తిగా సిపియంను ఆయన తీర్చిదిద్దారు.  సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించిన పోరాటయోధుడు.  తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు . కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.
             ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నంత కాలం మన దేశ పార్లమెంటు లో సైకిల్ స్టాండు ఉండేది. పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్ మీదే వెళ్ళేవారు. ఆయనతో పాటే ఆ స్టాండు కు కాలం చెల్లింది.  రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిల్. ఆయన నిరాడంబర జీవితానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.  పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లికాగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నారు. తండ్రినుంచి లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశారు. 1985 మే19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి.
                                    కులవ్యవస్థను నిరసించిన ఆయన తన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు. "కామ్రేడ్ పి.ఎస్." అని ఈయనను పిలిచేవారు. మన దేశంలో పేదలు వర్గరీత్యానే గాక సామాజికంగా అణచివేయబడుతున్నారు.  ''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ఈ సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని  ఆనాడే 
సుందరయ్య గారూ   పిలుపునిచ్చారు.
                 సుందరయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సుందరయ్య బతికున్నంతకాలం సామాజికన్యాయం కోసం , పేద ప్రజల కోసమే పోరాడారు. పాలకుల విధానాలపై తిరుగుబాటు చేశారు. సోషలిజమనే నూతన సమాజం కోసం అహరహం శ్రమించారు.
సుందరయ్య,       నీలాంటి త్యాగజీవులెందరయ్యా  ,        శ్రమజీవులు నిన్నెపుడూ మరువరయ్యా...
( నేడు మహా మనిషి  సుందరయ్య గారి  26వ వర్థంతి  సందర్బంగా  ) 

1 కామెంట్‌: