1, మే 2011, ఆదివారం

మహా మనిషి ...

                        ప్రపంచ చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతికొద్దిమంది మహా పురుషుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు. అందరిలాగే పుట్టారు. సంపన్న కుటుంబంలో పెరిగారు. కాని శ్రామికనేతగా ఎదిగారు. భూస్వామ్య బంధనాలను తాను తెంచుకోవడమే గాక, సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిన ఫ్యూడల్‌ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి నడుంకట్టారు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా మలచుకోవడమేగాక దాన్ని ఆచరణలోపెట్టి లక్షలసంఖ్యలో సామాన్య ప్రజానీకాన్ని కదనరంగంలోకి దించిన మహానేత.
                 ఆ రకంగా సిద్ధాంతాన్ని ఆచరణతో జోడించి దేశంలో బలమైన వామపక్ష శక్తిగా సిపియంను ఆయన తీర్చిదిద్దారు. దాని కోసం ఆహరహం తపించారు. సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించిన పోరాటయోధుడు.
                  మన దేశంలో పేదలు వర్గరీత్యానే గాక సామాజికంగా అణచివేయబడుతున్నారు. తన చిన్నతనంలోనే సుందరయ్య ఈవిషయాన్ని గ్రహించారు. ఊరుమ్మడి బావుల్లో దళితుల్ని నీరు తోడుకోనివ్వకపోవడం, అంటరానితనం, కూలీ వివక్ష, అగౌరవపర్చడం, ఆడవారితో నీచంగా మాట్లాడటం వంటి అనాగరిక పద్ధతుల్ని ఆయన ఈసడించుకున్నారు.  విద్యార్థిగా స్వగ్రామం అలగానిపాడులో సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.  ''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ఈ సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని పిలుపునిచ్చారు.

                 సుందరయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సుందరయ్య బతికున్నంతకాలం సామాజికన్యాయం కోసం , పేద ప్రజల కోసమే పోరాడారు. పాలకుల విధానాలపై తిరుగుబాటు చేశారు. సోషలిజమనే నూతన సమాజం కోసం అహరహం శ్రమించారు. 
సుందరయ్య
నీలాంటి త్యాగజీవు లెందరయ్యా       
శ్రమజీవులు నిన్నెపుడూ మరువరయ్యా...
( నేడు
మహా మనిషి  సుందరయ్య గారి జన్మదినం సందర్బంగా  ) 

2 కామెంట్‌లు:

  1. వీరయ్యగారు బాగున్నారా? మీ బ్లాగు చూశాను బాగుంది. ' మహామనిషి 'సుందరయ్య గురించి బాగా రాశారు. 'ఆకలి' పేరుతో నాదో బ్లాగు ఉంది. వీలయితే చూడండి.

    రిప్లయితొలగించండి
  2. మీ బ్లాగు చూశాను బాగుంది. మీ అకాలి పొస్టులు వివరంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి