24, మార్చి 2020, మంగళవారం

అర్ధరాత్రి నుంచి 21 రోజులు దేశమంతా లాక్‌డౌన్‌...

కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్ధ రాత్రి 12 నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ లాక్‌డౌన్‌ 21 రోజులు కొనసాగుతుందని మోదీ తెలిపారు. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు రావడాన్ని పూర్తిగా నిషేధించారు.
దేశానికి ఇది పరీక్షా సమయమని, నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సంక్లిష్ట సమయంలో అందరూ సహకరించాలని, సామాజిక దూరం పాటించడమే ఈ మహమ్మారిని నియంత్రించేందుకు పరిష్కారమని అన్నారు.

స్వీయ నిర్బంధం తప్ప మరో మార్గం లేదన్నారు. సమిష్టిగా ఈ వైరస్‌పై పోరాడాలని పిలుపు ఇచ్చారు. ఇళ్లలో ఉంటేనే కరోనా నుంచి బయటపడగలమని అన్నారు. మహమ్మారి వైరస్‌ సైకిల్‌ను మనం అడ్డుకోవాలని అన్నారు. ప్రపంచ పరిణామాలను మనం పరిశీలిస్తున్నామని, అగ్రరాజ్యాలను సైతం ఈ మహమ్మారి అతలాకుతలం చేస్తోందని గుర్తుచేశారు. కరోనా సంక్రమించిందన్న విషయం ముందు ఎవరూ గుర్తించలేరన్నారు. వ్యాధి లక్షణాలున్న వారే కాకుండా అందరూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. తాను ప్రధానిగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిలా చెబుతున్నానని, ఈ మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక వ్యక్తి నుంచి వేల మందికి వైరస్‌ వ్యాపించవచ్చని అన్నారు.
11 రోజుల్లోనే లక్ష నుంచి రెండు లక్షల మందికి సోకిందని డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు వెల్లడించాయని చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి