20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

పని మీద గౌరవం, నిబద్ధత...

తను చేసే పని మీద గౌరవం, నిబద్ధత...
కొత్త చెప్పులు కొందామని ఓ ప్రముఖ చెప్పుల దుకాణం కు వెళ్ళాను,
షాపులోని సేల్స్ మేన్ నాకు రక, రకాల క్రొత్త చెప్పులు చూపిస్తున్నాడు, 
కానీ సైజు కరెక్ట్ ఉంటే చెప్పులు నచ్చడం లేదు, 
నచ్చిన చెప్పులు సైజు సరిపోవడం లేదు,
అయినా పాపం సేల్స్ మేన్ ఓపిగ్గా ఇంకా కొత్తరకాలు తీసుకొచ్చి చూపిస్తున్నాడు,
అంతలో షాపు ముందు ఓ పెద్ద కారు వచ్చి ఆగింది, 
అందులోనుండి ఓ వ్యక్తి హూందాగా షాపులోకి వచ్చాడు, 
ఆయన్ని చూడగానే సేల్స్ మేన్స్ అందరూ మర్యాదగా లేచి నిలబడి 
నమస్కారం చేసారు, 
ఆయన చిరునవ్వుతో యజమాని సీట్లో కూర్చొని దేవునికి నమస్కారం చేసి 
తన పనిలో నిమగ్నం అయ్యారు, 
మీ యజమానా? అని సేల్స్ మేన్ ను అడిగాను, 
అవును సార్, ఆయన మా యజమాని ,
ఇలాంటి షాపులు ఆయనకు ఓ పది వరకు ఉంటాయి, 
చాలా మంచి మనిషి అండి అని..  ఓ క్రొత్త రకం చెప్పుల జత చూయించాడు, 
ఆ చెప్పుల జత చూసే సరికి నాకు తెలియకుండానే నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది,
కానీ సైజే కాస్త అటు, ఇటు గా ఉన్నట్టుంది, 
చెప్పుల జత నాకు నచ్చిన విషయం సేల్స్ మేన్ కనిపెట్టినట్టున్నాడు ,
ఎలాగైనా నాతో ఆ చెప్పులజత కొనిపించేయాలని తెగ ఆరాట పడుతున్నాడు, 
కాస్త బిగుతుగా ఉన్నట్టున్నాయి కదా అంటే, అబ్బే అదేం లేదు సార్, 
మీకు కరెక్ట్ సైజే అంటూ బలవంతపెట్టడం మొదలుపెట్టసాగాడు, 
ఇదంతా గమనిస్తున్న షాపు యజమాని లేచివచ్చి నాముందు క్రింద కూర్చుని 
సార్ ఓసారి మీ పాదం ఈ చెప్పులో పెట్టండి 
అని నా పాదం ను తన చేతిలో తీసుకుని చెప్పును తొడిగాడు,,
నాకు అంత పెద్ద మనిషి (వయసు లో పెద్ద, హోదాలో కూడా) 
నా పాదం ముట్టుకుని చెప్పు తొడుగుతుంటే ఇబ్బంది గా అనిపించింది, 
పరవాలేదులెండి సర్ నేను  తొడుక్కుంటాను లెండి అని వారిస్తున్నా 
అతను వినకుండా రెండు కాళ్ళకు తన చేతులతో 
నాకు చెప్పులు తొడిగి లేచి నిలబడి 
ఓసారి నడిచి చూడండి సర్, మీకు కంఫర్ట్ గా 
ఉన్నాయో లేదో, లేకుంటే మరో జత చూద్దాం అన్నారు, 
కానీ ఆ జత సరిగ్గా సరిపోయాయి,
నేను బిల్ పే చేస్తూ షాపు యజమాని తో మనసులో మాట బయటపెట్టాను,
సర్ మీరు ఈ హోదా లో ఉండికూడా మా పాదాలు పట్టుకుని మరీ చెప్పులు తొడగడం మాకు ఇబ్బంది గా ఉందండీ? అన్నాను, ఆయన చిల్లర తిరిగి ఇస్తూ చిరునవ్వుతో సర్! 
ఇది నా వృత్తి, నాకు దైవం తో సమానం, 
"షాపు బయట మీరు కోటి రూపాయలు ఇస్తాను అన్నా 
నేను మీ పాదాలు ముట్టుకోను, 
అదే షాపు లోపల మీరు కోటి రూపాయలు ఇచ్చినా 
మీ పాదాలు వదలను " అన్నారు.. 
నాకు ఆశ్చర్యమేసింది,ఎంత గొప్ప వ్యక్తిత్వం! 
Dignity of labour ******

తను చేసే పని మీద గౌరవం, నిబద్ధత! 
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పాఠం నేర్పడానికి నాకు దేవుడు పంపిన 
గురువు లా కనిపించారు,
మనం చేసే పని చిన్నదా? పెద్దదా? అన్నది కాదు సమస్య, 
న్యాయబద్ధ మైందా? కాదా అని చూడాలి, న్యాయబద్ధమయినప్పుడు చేసే చిన్న పనికి సిగ్గు పడకూడదు. 
ఎప్పుడూ మనం చేసే పనిని కానీ, ఉద్యోగంను కానీ తిట్టరాదు,
అదికూడ లేక రోడ్ల మీద వృధా గా తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారని 
గుర్తు పెట్టుకోవాలని కోరుతూ....

18, సెప్టెంబర్ 2019, బుధవారం

“మీ కంటే ధనవంతుడు ఉన్నాడా ?”...

“మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?” బిల్ గేట్స్ ని ఎవరో అడిగారు.
“ఒకవ్యక్తి ఉన్నాడు” అని సమాధానమిచ్చి - ఇలా చెప్పాడు.
నేను డబ్బు, పేరు  సంపాదించక ముందు ఒకరోజులలో ఒక నాడు న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగాను. దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నావద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను.

“పర్లేదు...మీవద్ద చిల్లర లేకపోయినా, ఈ పేపర్ తీసుకోండి” బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోక తప్పలేదు. 
మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది. 
ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ “ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వలన నేనేమీ నష్టం పోను, ఆ ఖరీదును నా లాభం లోంచి మినహాయించుకుంటాను” అన్నాడు.
ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను. నెలన్నర తర్వాత అతడు దొరికాడు. 
“నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను.
“మీరు తెలుసు...బిల్ గేట్స్.... ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను” 
“ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు, నీకు ఏమి కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలను కున్నది  ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను “
“సర్... మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది? అతడు ప్రశ్నించాడు.
“ఎందుకు సరితూగదు?” నేను ఆశ్చర్య పోయాను.
“నేను పేదరికంతో బాధ పడుతూ, దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేసాను. ఈ రోజు మీరు ప్రపంచం లోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు... ఎలా సరితూగుతుంది?”
అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. అతడు ఇతరులకు సహాయం చెయ్యాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. అవును... నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు. 
అప్పుడు నాకు అనిపించింది- కుప్పలు కుప్పలు డబ్బు ఉండే కంటే...ఇతరులకు సహాయ పడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం.
ఇతరులకు సహాయ పడటానికి కావలసింది అదే...
(ఒక మిత్రుడి పేస్ బుక్ వాల్ నుండి ... ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి)

15, సెప్టెంబర్ 2019, ఆదివారం

యురేనియంతో మానవ మనుగడ ప్రశ్నార్థకం...

యురేనియం అంటే ఏమిటి? 

యురేనియం ప్రకృతి సహజ సిద్ధంగా భూమిలో, నీటిలో లభించే అణుధార్మిక రసాయన మూలకం. ఇది మూడు ఐసోటోపుల మిశ్రమం. దీనిని అణ్వాయుధాలలో, అణురియాక్టర్లలో ఇంధనంగా వాడుతారు. ప్రకృతిలో యురేనియం ప్రధానంగా మూడు రూపాలలో లభిస్తుంది. అవి యూ 238, యూ 235, యూ 234, యూ 235 అనేది అణురియాక్టర్లు అణ్వాయుధాల్లో వాడే అతి ముఖ్యమైన ఇంధనం. భూమి పొరల్లో 2-4 పార్ట్‌ మిలియన్‌గా లభిస్తుంది. భారత్‌లో ప్రధానంగా మేఘాలయ, అస్సాం, నాగాలాండ్‌, బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలో ఉన్నాయి. భారత్‌లోని ఈ ప్రాంతాలన్నికూడా దట్టమైన అడవులతో ఉన్న ప్రాంతాలు కాబట్టి సహజంగానే ఇవి ఖనినజ నిక్షేపాలను తమ కడుపులో దాచుకున్నాయి. 

_____________

యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలు!

భూమిలో ఉన్నంత వరకు యురేనియం క్షేమకరమైనది. భూమిలో నుంచి బయటకు రాగానే అది మొదట గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి ఆక్సైడ్‌గా విడిపోయి గాలిలో కలిసిపోతుంది. బయటికి రాగానే దీనికి అణుధార్మికత వస్తుంది. దీనికి అణుభారం ఎక్కువ. దీని సాంద్రత సీసం కంటే 75 శాతం అధికంగా ఉంటుంది. ఇది న్యూక్లియర్‌ రియాక్టర్లలో చర్య జరిగినపుడు అత్యధిక ఉష్ణోగ్రతలను విడుదల చేస్తుంది. అణ్వాయుధాలలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఇంధనం యు-235 తక్కువ లో తక్కువగా 7కిలోల యురేనియంతో ఒక అణుబాంబును తయారు చేయొచ్చు. యూరేనియం (యు- 238) నుంచి జనించే ఫ్లుటోనియం అనే రూపం (యు-239) అత్యంత ప్రమాదకరమైనది. యురేనియం తన ప్రతి రసాయనిక చర్యలో అత్యంత ప్రమాదకరమైన బీటా, గామా కిరణాలను వెదజల్లుతుంది. దీనిలోని అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత మనుషుల శరీరాల్లో, జంతువుల శరీరాల్లోకి ప్రవేశించి ఎముకల్లో స్థిరపడుతుంది. దీనితో చాలా సులభంగా క్యాన్సర్‌ వ్యాధి వ్యాపిస్తుంది. భూమి లో నుంచి యురేనియంను బయటకు తీయడమే ఆలస్యం గాలితో చర్య జరిపి విషంగా మారుతుంది. 
యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి దాదాపు కొన్ని వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియో ధార్మిక పదార్థాలు వేల సంవత్సరాలు వాతావరణంలోనే ఉండిపోతాయి. తద్వారా గాలి, నీరు కలుషితమై మనుషులు, జంతువులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తో చనిపోతారు. కొన్ని వందల తరాలు వికృత సంతానం లేదా పూర్తిగా సంతాన లేమితో మానసిక వ్యధకు గురియ్యే ప్రమాదం ఉంది. పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి స్త్రీలలో అండాల విడుదల క్రమం దెబ్బతినడం, గర్భాశయ క్యాన్సర్‌ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

_____________

పర్యావరణం పై ప్రభావం !

యూఎస్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ నివేదిక ప్రకారం యురేనియం గాలిని, నీటిని, మట్టిని, ఆహారాన్ని తొందరగా కలుషితం చేస్తుంది. గాలిలో దుమ్ములాగా ప్రయాణించి నీటిని చేరుతుంది. తద్వారా మొక్కలు గ్రహిస్తాయి. వానలు పడినపుడు ఈ అణుధార్మికత దుమ్ము భూమిలోకి చేరుతుంది. యురేనియం కోసం బోర్లు తవ్వే ప్రాంతాలలో తాగే నీటిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భూ ఉపరితల నీటిలో ఇది చాలా దూరం ప్రయాణిస్తుంది. యురేనియం ఆనవాళ్లు మట్టిలో కలిసి ఉంటాయి. అందువల్ల మొక్కలు, చెట్ల వేర్లలో నిక్షిప్తమౌతాయి. 
యురేనియం తవ్వకాల కోసం 1000 ఫీట్ల వరకు బావులు తవ్వడం వల్ల 200-300 ఫీట్ల లోతులో ఉండే నీటి వనరులు కిందికి దిగుతాయి. తద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి కొరత ఏర్పడుతుంది. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే నదుల, నీటి సెలయేర్ల యందు, అణుధార్మిక పదార్థాలు కలవడం వల్ల రానురాను నీటి వనరుల మొత్తం విషపదార్థాలుగా మారి జలరాశులు మొత్తం అంతరిస్తాయి. మండుతున్న యురేనియంతో కార్బన్‌ను చర్య జరపడం వలన యురేనియం మోనాక్సైడ్‌ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. అందువల్ల వాతావరణంలోని ఓజోన్‌ పొర దెబ్బతిని, భూవాతావరణం వేడెక్కి ఋతువుల్లో విపరీత పరిణామాలు సంభవిస్తాయి. మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. జీవ వైవిద్యం దెబ్బతింటుంది. 

#SaveNallamala
#StopUraniumMining 
#SaveGreen #GoGreen

2, సెప్టెంబర్ 2019, సోమవారం

వినాయక చవితి శుభాకాంక్షలు...

మీకు ,
మీ కుటుంబ సభ్యులకు    
వినాయక చవితి శుభాకాంక్షలు... 
... కె. వీరయ్య,  హైదరాబాద్ జిందాబాద్

1, సెప్టెంబర్ 2019, ఆదివారం

మట్టి గణేష్‌లనే ప్రతిష్టిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం...

హైదరాబాద్‌ జిందాబాద్‌ - హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో చాణిక్య అపార్ట్‌మెంట్‌లో (రాంనగర్‌ చౌరస్తా) ''మట్టి గణేష్‌  విగ్రహాల ఉచిత పంపిణి'' కార్యక్రమానికి అసోసియేషన్‌ కోశాధికారి డి. విజయలక్ష్మిగారు ముఖ్యఅతిధిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు శాస్త్రీ గారు, ప్రధాన కార్యదర్శి రవీంద్ర గారు,అసోసియేషన్‌ సభ్యులు, హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు పి.నాగేష్‌, సుకుమార్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌ జిందాబాద్‌ - హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో జనప్రియ అపార్ట్‌మెంట్‌ లో (రాంనగర్‌ గుండు ) ''మట్టి గణేష్‌ విగ్రహాల ఉచిత పంపిణి'' కార్యక్రమానికి అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ముఖ్యఅతిధిగా హాజరై  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు పుష్పరాజు, నాయకులు అనురాధ, అసోసియేషన్‌ సభ్యులు, హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు నవీన్‌ కృష్ణ,సుకుమార్‌ పాల్గొన్నారు.