14, జూన్ 2019, శుక్రవారం

శాంతిలో ఐదు మెట్లు జారి...

శాంతిలో ఐదు మెట్లు జారి... భారత్‌కు 141వ ర్యాంకు
- పొరుగు దేశాలు మనకన్నా నయం
- రాజకీయ, హిందూత్వ శక్తులే కారణం : ప్రజాస్వామ్యవాదులు
మానవాళి క్షేమాన్ని కాంక్షించి ప్రపంచానికి శాంతిని బోధించిన భారతదేశంలో అశాంతి రాజ్యమేలుతోంది. తాజాగా విడుదలైన 2019-ప్రపంచ శాంతి సూచి (జీపీఐ) ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. శాంతి సూచిలో భారత్‌ గతేడాది కంటే ఐదు స్థానాలు దిగజారి 141 ర్యాంకు (మొత్తం 163 దేశాలు)కు పడిపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన 'ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌' అనే సంస్థ ఈ నివేదికను వెల్లడించింది. మూడు అంశాలను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించినట్టు సంస్థ ప్రతినిధి స్టీవ్‌ కిల్లియెలా తెలిపారు. అవి.. 1)సామాజిక భద్రత, రక్షణ 2) జాతీయ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య సంఘర్షణలు 3) దేశంలో పెరుగుతున్న సైనికీకరణ.
నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం.. యూరప్‌ దేశం ఐస్‌లాండ్‌ మరోసారి జీపీఐలో ప్రథమ స్థానంలో నిలబెట్టు కున్నది. ఆ దేశం 2008 నుంచి వరుసగా మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. తర్వాతి స్థానాలలో న్యూజీలాండ్‌, పోర్చుగల్‌, డెన్మార్క్‌లు ఉన్నాయి. దక్షిణాసియా నుంచి మన పొరుగు దేశమైన భూటాన్‌ 15వ స్థానంలో ఉండగా.. శ్రీలంక (72), నేపాల్‌ (76), బంగ్లాదేశ్‌ (101)లు గతంలో కంటే తమ ర్యాంకును మెరుగుపర్చుకున్నాయి. దాయాది దేశం పాక్‌ 153వ స్థానంలో ఉంది. ఇక నిత్యం ఉగ్రదాడులతో వణికిపో తున్న అఫ్ఘనిస్తాన్‌ చివరి స్థానంలో ఉంది. శాంతిని నెలకొల్ప డంలో గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దక్షిణాసియాలో పెద్దగా మార్పులేమీ లేవని నివేదిక వెల్లడించింది. శాంతి సూచితో పాటు వాతావరణంలో మార్పులు సంభవించి పర్యావరణ ప్రమాదం పొంచి ఉన్న తొమ్మిది దేశాలలో భారత్‌ ఉండటం ఆందోళనకు గురి చేసే అంశం. ఈ జాబితాలో ఫిలిప్పీన్స్‌, జపాన్‌, చైనా వంటి దేశాలున్నాయి. ఇక సైన్యం మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్న దేశాల జాబితాలోనూ భారత్‌ ఉండటం గమనార్హం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి