13, మార్చి 2019, బుధవారం

మరో గొలుసుకట్టు మోసం...రోజురోజుకు పెరుగుతున్న మోసాలు

1000 కోట్ల వరకు వసూలు...
7 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకున్న ఈ సంస్థ...
ఈజీగా కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి...
అది కూడా లక్షల్లో , కోట్లలో వస్తాయని నమ్మిస్తారు . లక్షల్లో డబ్బులు ఎలా సాధ్యం అవుతుందో ఆలోచించండి..
తొందరపడి డబ్బులు పెట్టి మోసపోకండి.
                         సైబరాబాద్‌ పరిధిలో మరో గొలుసు కట్టు మోసం బయటపడింది. ఈ-బిజ్‌ సంస్థ పేరిట సుమారు వెయ్యి కోట్ల వరకు వసూలు చేసిన నిర్వాహకున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని ఖాతాల్లోని సుమారు రూ.70 లక్షలను పోలీసులు స్తంభింపజేశారు. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మంగళవారం మీడియాకు వివరించారు.
                నోయిడా కేంద్రంగా 2001లో ఈ-బిజ్‌ సంస్థను స్థాపించారు. దేశవిదేశాల నుంచి దాదాపు ఏడు లక్షల మందిని సభ్యులుగా చేర్చుకున్న ఈ సంస్థ ద్వారా దాదాపు రూ.వెయ్యి కోట్లు వసూలు చేశారు. నిర్వాహకులుగా పవన్‌ మలాన్‌, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. గొలుసుకట్టు మాదిరిగా సభ్యులను చేర్పిస్తే కమీషన్‌ ఇస్తామని నమ్మించిన నిందితులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించొచ్చని చెప్పి మోసానికి పాల్పడ్డారు. ఈ సంస్థ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. సంస్థలో రూ.16వేలు కట్టి సభ్యులుగా చేరితే 10 వేల పాయింట్లు వస్తాయని, సభ్యులుగా చేరిన ప్రతి సభ్యుడు కమీషన్‌ పొందాలంటే మరో ఇద్దరిని చేర్పించాలనే నిబంధన పెట్టారు. అంతేకాకుండా రూ.30వేలతో మరో ముగ్గురిని చేర్పిస్తే హాలిడే ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. యువతను ఆకట్టుకునేందుకు ఈ లెర్నింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టారు. కంప్యూటర్‌ కోర్సులతోపాటు 58 రకాల ఇతర కోర్సులు నేర్పిస్తామని చెప్పారు. రెండు నెలల తర్వాత క్విజ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి కోర్సు పూర్తయ్యాక 50 శాతం మార్కులు వస్తే సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు. ఈ లెర్నింగ్‌ కోర్సుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదమూ లేదు. ఆదిలాబాద్‌, వరంగల్‌తోపాటు చెన్నై, బెంగళూర్‌ తదితర ప్రాంతాల్లో సంస్థ నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు ఏడు లక్షల మంది బాధితులు ఉన్నారనీ, ఇప్పుడిప్పుడే ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారని సీపీ తెలిపారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి