11, మార్చి 2019, సోమవారం

మోగిన ఎన్నికల నగారా...

- ఏప్రిల్‌ 11న తొలి దశలోనే తెలంగాణ, ఏపీ ఎన్నికలు
- దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్‌
- ఏప్రిల్‌ 11న షురూ... మే 19కి పూర్తి
- 23న ఓట్ల లెక్కింపు... ఫలితాలు వెల్లడి
- ఆదివారం నుంచే కోడ్‌ అమలు
- జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ వాయిదా, పార్లమెంట్‌ ఎన్నికలు మాత్రమే
- దేశంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికలు
              రోజుల తరబడి ఎదురుచూస్తున్న ఎన్నికల సైరన్‌ మోగింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం విజ్ఞాన భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్లు అశోక్‌ లావాస, సునీల్‌ చంద్రతో కలిసి ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగుతాయన్నారు. ఏప్రిల్‌ 11న తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశ ఏప్రిల్‌ 18, మూడో దశ ఏప్రిల్‌ 23, నాలుగో దశ ఏప్రిల్‌ 29, ఐదో దశ మే 6, ఆరో దశ మే 12, ఏడో దశ మే19న జరగనున్నాయి. మే 23న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలు వెల్లడి జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒరిస్సాలో 147, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు వివరించారు. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి