సివిల్ సర్వీసెస్ పరీక్ష 2017 ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ సత్తాచాటారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రతిభావంతులు పోటీ పడే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్–నవంబర్ 2017ల్లో నిర్వహించింది. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి–ఏప్రిల్ 2018లో ఇంటర్వ్యూలు జరిగాయి.
మొత్తం 990 పేర్లను ప్రతిష్టాత్మక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌తోపాటు ఇతర కేంద్ర సర్వీసులైన గ్రూప్ ఏ,గ్రూప్ బీలకు అభ్యర్థులను సిఫార్సు చేసింది. 990 మందిలో 476 జనరల్, 275 ఓబీసీ, 165 ఎస్సీ, 74 ఎస్టీలు ఉన్నారు. వీరిలో 750 మంది పురుషులు, 240 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన వారిలో ఐఏఎస్‌కు 180 మందిని, ఐఎఫ్‌ఎస్‌కు 42 మందిని, ఐపీఎస్‌కు 150 మందిని, కేంద్ర సర్వీసులోని గ్రూప్–ఏకు 565 మందిని, గ్రూప్–బీ సర్వీసులో 121 మందిని నియమించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఖాళీలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సత్తాచాటారు.