ఆంధ్రప్రదేశ్‌లో అతి పొడవైన పర్వతశ్రేణులంటే గుర్తొచ్చేది తూర్పు కనుమలే. ఇవి చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు నుంచి ప్రారంభమవుతాయి. చిత్తూరు జిల్లాలో దట్టమైన అడవి, పచ్చటి చెట్లు ఉన్న కొండలపైన తిరుమల క్షేత్రం, పర్వత పాదభాగంలో తిరుపతి నగరం ఉన్నాయి. కింద తిరుపతి నుండి పైకి చూస్తే, ఏడుకొండల శ్రేణి... మహా సర్పంలా, తిరుమల ప్రాంతం... పడగలా కన్పిస్తుంది. భారతదేశంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి అగ్రస్థానంలో ఉంది. చుట్టుపక్కల ఉన్న సహజ మానవ నిర్మిత ఆకర్షణలతో చక్కటి యాత్రాస్థలంగా, సెలవు కాలపు నెలవుగా విరాజిల్లుతోంది. ఏడుకొండల ఘాట్ రోడ్డులో ప్రయాణ అద్భుత అనుభూతిని కలిగిస్తుంది.
తిరుమల దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. సంవత్సరం పొడవునా లక్షలాది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తండోప తండాలుగా తరలివస్తారు. ఈ ఆలయం గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విశేషాలను ప్రస్తావించారు. తిరుమల ఆలయానికి మహరాజ పోషకులుగా పల్లవులు, పాండ్యులు, చోళులు, విజయనగర పాలకులు, మైసూరు మహారాజులు చరిత్రకెక్కారు.
తిరుమల ప్రధాన ఆలయం ప్రాచీన భారతీయ శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. గర్భగుడిపై ఉండే విమానం, ధ్వజస్థంభం పైపొరలు బంగారు తాపడంతో చేసినవి.
తిరుమల, తిరుపతి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో స్వామి పుష్కరిణి, ఆకాశగంగ, శిలాతోరణం, ఆలిమేలుమంగ ఆలయం, నారాయణవనం, కపిల తీర్థం, శ్రీ వెంకటేశ్వర ప్రకృతి సంరక్షణ కేంద్రం, చంద్రగిరి, కాణిపాకం, కైలాసనాథ కోన, తలకోన, శ్రీకాళహస్తి, హార్స్‌లీ హిల్స్ వంటివి పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు.
స్వామి పుష్కరిణి
ఈ చెరువు తిరుమల ప్రధాన ఆలయాన్ని అనుకుని ఉంటుంది. దీనిని భక్తులు పవిత్రంగా భావిస్తారు. విష్ణుమూర్తి జలక్రీడకు ఉద్దేశించిన ఈ చెరువును శ్రీ వెంకటేశ్వరస్వామి కోసం గరుడు దివి నుండి భువికి తీసుకొచ్చినట్టు పురాణం.
ఆకాశ గంగ
ప్రధాన ఆలయానికి 3 కిలో మీటర్ల దూరంలో ఉత్తర దిశలో ఆకాశ గంగ ఉంది. శ్రీవారి పాద పద్మాల నుంచి ప్రవహించే జీవధారగా దీనిని అభివర్ణిస్తారు. శ్రీవారి ఆలయంలో నిత్యపూజల కోసం ఆకాశగంగ నీటినే ఉపయోగిస్తారు.
శిలాతోరణం
శిలాతోరణం తిరుమల కొండలపై ఉంది. ఇది సహజంగా రాళ్లతో ఏర్పడిన ప్రకృతి అద్భుతం. ఆసియాలో ఇటువంటిది మరెక్కడా లేదు. ఇటువంటి శిలాతోరణాలు ప్రపంచం మరో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి. అవి అమెరికాలోని ఉటా వద్ద రెయిన్ బో ఆర్చ్, బ్రిటన్‌లోని కట్ త్రూ. తిరుమలలోని శిలాతోరణం 150 కోట్ల (1500 మిలియన్ల) సంవత్సరాల నాటిదని అంచనా వేశారు. వాతావరణ మార్పులు, ఇతర కారణాల వల్ల ఇది సహజంగా ఏర్పడింది. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవు 10 అడుగుల ఎత్తులో ఉంటుంది.
అలివేలుమంగ ఆలయం
తిరుమలో శ్రీవారిని దర్శించుకున్న వారు, కింద తిరుపతికి దిగిన తర్వాత అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉన్న తిరుచానూరు అలివేలుమంగ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటారు. ఈ ఆలయం స్వర్ణముఖినది ఒడ్డున ఉంది.
నారాయణవనం
శ్రీ వెంకటేశ్వరస్వామికి, పద్మావతి అమ్మవారికి వివాహం జరిగిన పవిత్ర స్థలంగా ఇది ప్రసిద్ధి కెక్కింది. తిరుపతికి 36 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది.
కపిల తీర్థం
కపిల మహర్షికి మహాశివుడు దర్శనం ఇచ్చిన ప్రదేశమని అంటారు. పర్వతాల నుంచి జారిపడే జలపాతాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి.
శ్రీవెంకటేశ్వర జూలాజికల్ పార్కు
శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో 58 రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలు ఉన్నాయి. మొత్తం 500 జంతు జాతులు ఇక్కడ వర్థిల్లుతూ జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా ఉన్నాయి. సింహాలు పులులు కొత్తగా వచ్చి చేరాయి. జంతు రక్షణ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 8 కిలోమీటర్లు, విమానాశ్రయం గేటు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జంతు ప్రదర్శనశాల విస్తీర్ణం 2.212 హెక్టార్లు. ఈ జూకి ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చు. ఏ జంతువునైనా, ఎన్‌క్లోజర్‌నైనా దత్తత తీసుకోవచ్చు. ప్రవేశ రుసుము పెద్దలకు 10/-, పిల్లలకు 5/-. సోమవారం తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ సందర్శకుల కోసం జూ తెరచి ఉంటుంది.
అతి ప్రాచీన జీవ పార్కు
దిగువ తిరుపతిలో అలిపిరి గేటు వద్ద 2.5 ఎకరాలలో ఈ వినూతమైన పార్కును అభివృద్ధి చేశారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ విభాగమైన రీజినల్ సైన్స్ సెంటర్ దీనికి రూపకల్పన చేసింది. ఈ పార్కులో భారీ డ్రాగన్ ఫ్లైస్, భూతల మండ్రగబ్బలు, డైనోసార్లు, ఆర్కయోటికిక్స్ పక్షి, లెమర్, ఇతర జంతువులు, ప్రాణులను పోలిన బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ 25 నుంచి 50 కోట్ల సంవత్సరాల క్రితం జీవించి, కాలక్రమంలో అంతరించిపోయాయి.
శ్రీ వెంకటేశ్వర సంరక్షణ కేంద్రం
ఈ సంరక్షణ కేంద్రం 500 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నేషనల్ పార్కులో అనేక రకాల, జాతుల చెట్టు చేమలు, జంతువులు, పక్షులు, ఇతర ప్రాణులు ఉన్నాయి. సెలవు దినాల్లో ఇక్కడ ఉల్లాసంగా గడపడానికి చాలా మంది ఇష్టపడతారు.
చంద్రగిరి
చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న చారిత్రక పట్టణం చంద్రగిరి. ఇది విజయనగర రాజుల చిట్టచివరి రాజధాని. తెలుగు సంస్కృతి, కళలు, సాహిత్యాలను విజయనగరం రాజులు పోషించి, అభివృద్ధి చేశారు. చారిత్రక ప్రాధాన్యంగల చంద్రగిరి కోటకు అక్కడి రాజమహల్, రాణిమహల్‌కు పాత వన్నె చిన్నెలు తెచ్చారు. చంద్రగిరి కోట తిరుపతికి 12 కిలో మీటర్ల దూరంలో 58 మీటర్ల ఎత్తయిన పెద్ద రాతిపైన నిర్మితమైంది. విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని కళ్లకు కట్టి సౌండ్ అండ్ లైట్‌షోను ఎపి టూరిజం ఏర్పాటు చేసింది.
కాణిపాకం
ఇది 11వ శతాబ్దం నాటి ప్రాచీన వినాయకుడి ఆలయం. ఇందులోని ప్రధాన వినాయక విగ్రహ పరిమాణం ఇప్పటికీ పెరుగుతోందని విశ్వసిస్తారు. అర్థశతాబ్దం క్రితం ఈ విగ్రహానికి వేయించిన కవచం ఇప్పుడు చిన్నదిగా కన్పిస్తోంది. వినాయక విగ్రహం పెరుగుతుందనడానికి దీన్ని నిదర్శనంగా భక్తులు భావిస్తారు. తిరుపతి నుండి 70 కిలోమీటర్లు, చిత్తూరుకు 12 కిలో మీటర్ల దూరంలో కాణిపాకం ఉంది.
శ్రీకాళహస్తి
ఇది మహా శివుడి ఆలయం. ఇక్కడ వాయులింగం రూపంలో ఉంది. ఈ క్షేత్రం తిరుపతి నుండి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం ఇక్కడి శివలింగానికి శ్రీ అనే సాలీడు లింగంపై సాలెగూడును పెట్టగా, కాళ అనే పాము రత్నాన్ని తెచ్చి పెట్టింది. హస్తి అనే ఏనుగు తొండంతో నీటిని పీల్చుకుని తెచ్చి లింగాన్ని శుభ్రం చేసింది. ఆలయంలోని దీపశిఖ శివలింగం నుండి వచ్చే గాలి వల్ల కదులుతూ, రెపరెపలాడుతుంది.
ప్రకృతి సోయగాల వెలుగు
చిత్తూరు జిల్లాలో అనేక రకాల చెట్లు చేమలు, అనేక జలపాతాలు ఉన్నాయి. ఇందులో రెండు జలపాతాలు సంవత్సరం పొడవునా పారుతూనే ఉంటాయి. గిరి శిఖరం నుండి జాలువారే తలకోన జలపాతం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ. తలకోన, కైలాసనాథ కోన జలపాతాలు ఏడుకొండల పైభాగం నుండి వస్తాయి. కొండలు, చెట్టు చేమల నుంచి మొదట చిన్న ధారల్లా తర్వాత నిండుగా, వేగంగా పై నుంచి కిందికి దూకే ఈ జలపాతంలో ఎన్నో ఔషధ విలువగల ఖనిజాలున్నాయని విశ్వసిస్తుంటారు. ఈ ప్రాంతాలకు స్థానిక రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఎపిటిడిసి ఈ రెండు ప్రాంతాల్లోనూ హరిత హోటళ్లను నడుపుతోంది.
హార్స్‌లీ హిల్స్
హార్స్‌లీ హిల్స్ ఆంధ్రప్రదేశ్‌లోని అత్యుత్తమ హిల్స్ రిసార్టు. అప్పట్లో కడపలో పనిచేసిన బ్రిటీష్ కలెక్టరు పేరు దీనికి పెట్టారు. ఈ కొండ ప్రాంతాల చల్లదనం, అందాలకు ఆకర్షితుడై ఆయన తన వేసవి విడిదిగా దీన్ని అభివృద్ధి చేశారు. హార్స్‌లీ హిల్స్ సముద్రమట్టం నుంచి 1265 మీటర్ల ఎత్తులో ఉంది. తిరుపతి 140 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుంచి కూడా అంతే దూరం ఉంటుంది. దీని ప్రక్కనే ప్రఖ్యాత రిషి వ్యాలీ ఉంది. ఇక్కడే రిషివ్యాలీ పబ్లిక్ స్కూలు ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది. ఎపిటిడిసి హరితహిల్ రిసార్టును నిర్వహిస్తోంది.
( ప్రజాశక్తి పత్రిక సౌజన్యం తో... )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి