భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కింది. సచిన్ కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ కార్యాలయం శనివారం (16.11.13) ప్రకటించింది. ఇదే రోజు కెరీర్ కు వీడ్కోలు పలికిన మాస్టర్ కు అత్యున్నత పురస్కారం ప్రకటించడం విశేషం.
భారత క్రీడా చరిత్రలో అత్యున్నత పౌరపురస్కారం అందుకోనున్న తొలి క్రీడాకారుడిగా సచిన్ ఘనత సాధించనున్నాడు. భారత క్రికెట్ కు విశేష సేవలు అందించినందుకుగాను ఈ అవార్డును బహూకరించనున్నారు. మాస్టర్ కు భారతరత్న ఇవ్వాలని పలువురు రాజకీయ నాయకులు, వివిధ రంగాల వ్యక్తులు రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ రోజునే సచిన్ కు అవార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించడంతో అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ 126 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 43 /3 పరుగుల ఓవర్ నైట్ తో ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు 187 పరుగులకు ఆలౌట్ అయ్యింది.